రోహిత్‌-మయాంక్‌ సరికొత్త రికార్డు

Rohit And Mayank Achieve Most Sixes Record By Indian Openers - Sakshi

విశాఖ: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. 202/0 ఓవర్‌నైట్‌ స్కోరుతో గురువారం రెండో రోజు ఆట కొనసాగించిన భారత్‌ 317 పరుగుల వద్ద రోహిత్‌ శర్మ వికెట్‌ను కోల్పోయింది. ఈ రోజు ఆటలో మరో 115 పరుగులు జత చేసిన తర్వాత రోహిత్‌ శర్మ(176; 244 బంతుల్లో 23 ఫోర్లు, 6 సిక్సర్లు) తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఓపెనర్‌గా ఇన్నింగ్స్‌ ఆరంభించిన తొలి టెస్టులోనే రోహిత్‌ డబుల్‌ సెంచరీ సాధిస్తాడనుకున్నప్పటికీ ఆ అవకాశాన్ని చేజార్చుకున్నాడు. మహరాజ్‌ వేసిన 82 ఓవర్‌ ఆఖరి బంతిని ముందుకొచ్చి ఆడబోయిన రోహిత్‌ స్టంపింగ్‌ అయ్యాడు. దాంతో భారత్‌ తొలి వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది.

కాగా, మయాంక్‌  అగర్వాల్‌ సైతం సెంచరీ చేయడం విశేషం.203 బంతుల్లో సెంచరీ సాధించాడు మాయంక్‌. ఇది మయాంక్‌ అగర్వాల్‌కు తొలి టెస్టు సెంచరీ. అయితే భారత్‌ తొలి వికెట్‌కు కోల్పోయే సరికి భారత ఓపెనర్లు కొట్టిన సిక్సర్లు 9. దాంతో టెస్టు ఫార్మాట్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత జోడిగా వీరిద్దరూ ఘనత సాధించారు. ఈ క్రమంలోనే నవజ్యోత్‌ సిద్ధూ, మనోజ్‌ ప్రభాకర్‌లు(1993-94 సీజన్‌), వీరేంద్ర సెహ్వాగ్‌-మురళీ విజయ్‌(2009-10 సీజన్‌)ల పేరిట సంయుక్తంగా ఉన్న రికార్డును రోహిత్‌-మయాంక్‌లు బద్ధలు కొట్టారు. సిద్ధూ-మనోజ్‌ ప్రభాకర్‌, వీరేంద్ర సెహ్వాగ్‌-మురళీ  విజయ్‌లు 8 సిక్సర్లు సాధించిన భారత ఓపెనర్లు.

మరొకవైపు భారత్‌ తరఫున అత్యధిక ఓపెనింగ్‌ పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన మూడో జోడిగా రోహిత్‌-మయాంక్‌లు నిలిచాడు. భారత్‌ తరఫున అత్యధిక ఓపెనింగ్‌ పరుగుల భాగస్వామ్యం వినోద్‌ మన్కడ్‌-పంకజ్‌ రాయ్‌ల పేరిట ఉంది. 1955-56 సీజన్‌లో వీరిద్దరూ న్యూజిలాండ్‌పై 413 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించారు. ఆ తర్వాత స్థానంలో వీరేంద్ర సెహ్వాగ్‌-రాహుల్‌ ద్రవిడ్‌లు ఉన్నారు. ఈ జోడి 2005-06 సీజన్‌లో పాకిస్తాన్‌పై 410 పరుగులు సాధించారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top