సూపర్‌ ఫెడరర్‌

సూపర్‌ ఫెడరర్‌


కాలిఫోర్నియా: గాయం నుంచి కోలుకోవడానికి గత ఏడాది తీసుకున్న ఆరు నెలల విరామం రోజర్‌ ఫెడరర్‌కు మంచి ఫలితాలే ఇస్తున్నాయి. గత జనవరిలో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ నెగ్గి సంచలనం సృష్టించిన ఈ స్విట్జర్లాండ్‌ దిగ్గజం... తాజాగా ఇండియన్‌ వెల్స్‌ మాస్టర్స్‌ సిరీస్‌ టైటిల్‌ను సొంతం చేసుకొని ఔరా అనిపించాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో ఫెడరర్‌ 6–4, 7–5తో తన దేశానికే చెందిన స్టానిస్లాస్‌ వావ్రింకాపై విజయం సాధించాడు. విజేతగా నిలిచిన ఫెడరర్‌కు 11,75,505 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 7 కోట్ల 68 లక్షల 67 వేలు)తోపాటు 1000 ర్యాంకింగ్‌ పాయింట్లు... రన్నరప్‌ వావ్రింకాకు 5,73,680 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 3 కోట్ల 75 లక్షల 13 వేలు)తోపాటు 600 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.ఈ టైటిల్‌తో ఫెడరర్‌ ఏటీపీ తాజా ర్యాంకింగ్స్‌లో 10వ స్థానం నుంచి ఆరో స్థానానికి ఎగబాకాడు.  మరోవైపు ఇదే టోర్నీ మహిళల సింగిల్స్‌ విభాగంలో ఎలీనా వెస్నినా (రష్యా) టైటిల్‌ను దక్కించుకుంది. మూడు గంటలపాటు జరిగిన ఫైనల్లో వెస్నినా 6–7 (6/8), 7–6, 6–4తో స్వెత్లానా కుజ్‌నెత్సోవా (రష్యా)పై గెలిచి సంచలనం సృష్టించింది.ళీ ఈ విజయంతో ఫెడరర్‌ ఇండియన్‌ వెల్స్‌ టోర్నీని అత్యధికంగా ఐదుసార్లు నెగ్గిన నొవాక్‌ జొకోవిచ్‌ (సెర్బియా) రికార్డును సమం చేశాడు. ఓవరాల్‌గా ఫెడరర్‌ కెరీర్‌లో ఇది 90వ సింగిల్స్‌ టైటిల్‌కాగా... 25వ మాస్టర్స్‌ సిరీస్‌ టైటిల్‌. ళీ ఏటీపీ మాస్టర్స్‌ సిరీస్‌ టైటిల్‌ నెగ్గిన పెద్ద వయస్కుడిగా ఫెడరర్‌ (35 ఏళ్ల 7 నెలలు) గుర్తింపు పొందాడు. అగస్సీ (34 ఏళ్ల 3 నెలలు) రికార్డును ఈ స్విస్‌ స్టార్‌ అధిగమించాడు. అంతేకాకుండా ఇండియన్‌ వెల్స్‌ టైటిల్‌ సాధించిన పెద్ద వయస్కుడిగా జిమ్మీ కానర్స్‌ (31 ఏళ్ల 5 నెలలు) పేరిట ఉన్న రికార్డునూ ఫెడరర్‌ సవరించాడు.

Back to Top