హే.. కమిన్స్‌ బ్యాటింగ్‌ చేయడం అంత ఈజీ కాదు!

Rishabh Pant Sledges Pat Cummins in Adelaide - Sakshi

నోటికి పనిచెప్పిన రిషభ్‌ పంత్‌

అడిలైడ్‌ : ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్‌లో భారత్‌ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌ అధ్యాంతం ఆసక్తికరంగా సాగి ప్రేక్షకులను రంజింప చేసింది. తొలి రోజు నుంచి చివరి వరకు నువ్వా- నేనా అన్నట్లు సాగిన ఈ మ్యాచ్‌లో విజయం మాత్రం భారత్‌నే వరించింది. అయితే ఆస్ట్రేలియా ఆటగాళ్లు అనగానే గుర్తొచ్చేది స్లెడ్జింగ్‌.. గత మ్యాచ్‌ల స్థాయిలో లేకున్నా ఈ మ్యాచ్‌లో సైతం కొంత మంది ఆటగాళ్లు తమ నోటికి పనిచెప్పారు. ఆసీస్‌ పేస్‌ బౌలర్‌ ప్యాట్‌ కమిన్స్‌ భారత్‌ బ్యాట్స్‌మెన్‌ కేఎల్‌ రాహుల్‌, రిషబ్‌ పంత్‌లపై నోరుపారేసుకుని ఈ మ్యాచ్‌లో స్లెడ్జింగ్‌కు ఆజ్యం పోసాడు. ఈ తరహా స్లెడ్జింగ్‌కు మిగతా ఆటగాళ్లు స్పందించకపోయినా.. యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ సమర్ధవంతంగా తిప్పికొట్టాడు. (చదవండి: అడిలైడ్‌ టెస్టులో ‘విచిత్రం’ చూశారా!)

చివరి రోజు ఆటలో భారత బౌలర్ల సహనానికి పరీక్షగా మారిన ప్యాట్‌ కమిన్స్‌ను పంత్‌ మాటలతో రెచ్చగొట్టాడు. కమాన్‌ ప్యాటీ.. కమాన్‌ ప్యాటీ అంటూనే ఇక్కడ బ్యాటింగ్‌ చేయడం అంత సులవు కాదని మైండ్‌ గేమ్‌ ఆడాడు. అతని మాటలు స్టంప్స్‌ మైక్‌లో రికార్డయ్యాయి. అలాగే స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌.. యాష్‌, యాష్లే అని పిలవడం కూడా రికార్డు అయింది. అధికారిక బ్రాడ్‌కాస్టర్‌ చర్చలో పాల్గొన్న భారత మాజీ క్రికెటర్‌ సునీల్‌ గావాస్కర్‌  పంత్‌ స్లెడ్జింగ్‌ను తప్పుబట్టాడు.  మైదానంలో ఓ ఆటగాడిగా.. తమ బౌలర్లను ప్రోత్సహించాలని, కానీ ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌ను మాటలతో రెచ్చగొట్టడం సరైంది కాదని అభిప్రాయపడ్డాడు. అయితే ఇదే చర్చలో పాల్గొన్న ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ మైకెల్‌ క్లార్క్‌ మాత్రం రిషభ్‌పంత్‌ను వెనకేసుకొచ్చాడు. పంత్‌ అక్కడ మైండ్‌ గేమ్‌ ఆడాడని, కమిన్స్‌తో అతనికి ఉన్న చనువు కొద్దే అలా మాట్లాడాడని మద్దతుగా నిలిచాడు. ఐపీఎల్‌లో వారిద్దరూ ఢిల్లీడేర్‌ డెవిల్స్‌ తరఫున ఆడారని గుర్తు చేశాడు. (చదవండి: రిషభ్‌ పంత్‌ సరికొత్త రికార్డు)

ఇంగ్లండ్‌ పర్యటనతో టెస్ట్‌ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన పంత్‌.. మెళ్లిగా జట్టు సభ్యులతో కలిసిపోయినట్లు అనిపిస్తోందని గావాస్కర్‌ పేర్కొన్నాడు. జట్టులోకి వచ్చిన కొత్తలో పంత్‌.. అశ్విన్‌ సర్‌ లేక అశ్విన్‌ భాయ్‌ అనేవాడని, ఇప్పుడు అశ్లే అనడం చూస్తే ఈ విషయం అర్థం అవుతుందన్నారు. ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో సైతం పంత్‌ తన నోటికి పనిచెప్పాడు.  59 పరుగులకు 3వికెట్లు పడిన దశలో ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ ఖవాజా, హ్యాండ్‌స్కోంబ్‌ జాగ్రత్తగా ఆడుతూ వికెట్‌ను కాపాడుకుంటున్నారు. అయితే ఈ జోడీ ఏకాగ్రతను చెడగొట్టేందుకు వికెట్ల వెనకాల నుంచి కీపర్‌ పంత్‌ స్లెడ్జింగ్‌కు దిగాడు. ‘ప్రతీ ఒక్కరు పుజారా కాలేరు’ అంటూ భిన్నమైన వ్యూహం అనుసరించాడు. ఇది స్టంప్స్‌ మైక్‌లో వినిపించడంతో రిషభ్‌ స్లెడ్జింగ్‌కు దిగిన విషయం స్పష్టమైంది. (చదవండి: ప్రతీ ఒక్కరూ పుజారాలు కాలేరు సోదరా..!)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top