‘రిషబ్‌ పంత్‌ అవసరం ఉంది’

Rishabh Pant can be a Game Changer, Ravi Shastri - Sakshi

బర్మింగ్‌హమ్‌: ఆతిథ్య ఇంగ్లండ్‌ జట్టుతో టెస్టు సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు మ్యాచ్‌ తుది జట్టు ఎంపిక కోసం టీమిండియా మల్లగుల్లాలు పడుతోంది. బ్యాట్స్‌మెన్‌ను ఎంపిక చేసే విషయంతో పాటు, బౌలర్ల ఎంపికపై కూడా సందిగ్థత నెలకొంది. దీనిపై కెప్టెన్‌ విరాట్‌ కోహ్లితో కలిసి కోచ్‌ రవిశాస్త్రి తీవ్ర కసరత్తులు చేస్తున్నాడు. దీనిలో భాగంగా రిషబ్‌ పంత్‌ ఎంపికపై రవిశాస్త్రిని ప్రశ‍్నించగా.. ‘అతడో గేమ్‌ చేంజర్‌. భారత్‌-ఎ తరఫున ఆడి పరుగులు సాధించాడు. భారత జట్టుకు రిషబ్‌ అవసరం ఉంది. బ్యాట్స్‌మన్‌గా, కీపర్‌గా రిషబ్‌ అవసరం జట్టుకు చాలానే ఉంది. అందుకే టెస్టు జట్టులో ఎంపిక చేశాం’ అని బదులిచ్చాడు.

మరొకవైపు ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో కుల్దీప్‌ను ఆడిస్తారా? అనే ప‍్రశ్నకు రవిశాస్త్రి తనదైన శైలిలో సమాధానమిచ్చాడు. ‘కుల్దీప్‌కు ఇంగ్లండ్‌తో టెస్టు ఆడే అవకాశం తప్పకుండా దక్కుతుంది. కానీ, అది ఏ టెస్టులో అనేది కచ్చితంగా చెప్పలేం. అతనికి ఎప్పుడైనా అవకాశం రావొచ్చు. అతనికంటే అనుభవజ్ఞులైన అశ్విన్‌, జడేజా కూడా ఉన్నారు. ఇద్దరు స్పిన్నర్లతో ఆడించాలా ఒక్క స్పిన్నర్‌తో ఆడించాలా అన్న అంశం మాకు తలనొప్పిగా మారింది. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో కుల్దీప్‌ అద్భుతంగా రాణించాడు. కుల్దీప్‌ కూడా వికెట్లు తీయాలని బాగా కసితో ఉన్నాడు’ అని తెలిపాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top