ఆశ్చర్యం.. జాంటీ రోడ్స్‌కు నో ఛాన్స్‌?

Rhodes Would Have Return Empty Handed In Supporting Staff Selection - Sakshi

హైదరాబాద్‌ : క్రికెట్‌లో ఫీల్డింగ్‌కు పర్యాయ పదంగా చెప్పుకునే దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు జాంటీ రోడ్స్‌కు తీవ్ర నిరాశే ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. టీమిండియా ఫీల్డింగ్‌ కోచ్‌ పదవి కోసం రోడ్స్‌ దరఖాస్తు చేసుకోవడంతో అతడి ఎంపిక దాదాపు ఖాయమని అందరూ భావించారు. అయితే ఇటీవలే ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రి మరల నియామకమైన తర్వాత సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. సహాయక సిబ్బంది ఎంపిక విషయంలో రవిశాస్త్రి వెనక్కి తగ్గటం లేదని, తనకు నచ్చిన వారినే నియమించుకునేలా పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ప్రస్తుతమున్న సిబ్బందే కొనసాగుతారని అనేక వార్తలు వినిపిస్తున్నాయి.  అయితే చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని కమిటీ సపోర్టింగ్‌ స్టాఫ్‌ను ఎంపిక చేసేందుకు గురువారం భేటీ కానుంది. ఆదే రోజున సహాయక సిబ్బంది పేర్లను ప్రకటించే అవకాశం ఉంది.  

ఆర్‌ శ్రీధర్‌ కోచింగ్‌ పర్యవేక్షణలో టీమిండియా ఫీల్డింగ్‌ మరింత బలపడిందని, ఆటగాళ్ల ఫీల్డింగ్‌ మెరుగుపడిందని రవిశాస్త్రి వాదిస్తున్నాడు. దీంతో శ్రీధర్‌ ఫీల్డింగ్‌ కోచ్‌గా మరోసారి కొనసాగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే ప్రపంచంలోనే దిగ్గజ ఫీల్డర్‌గా కీర్తింపబడే జాంటీ రోడ్స్‌కు నిరాశ ఎదురవక తప్పదు. భారత్‌పై తనకున్న ప్రేమ, గౌరవాన్ని అనేకమార్లు చాటిన రోడ్స్‌.. ఫీల్డింగ్‌ కోచ్‌గా టీమిండియాకు సేవలందించాలని తెగ ఆరాటపడ్డాడు. అయితే ఆశ్చర్యకరంగా రోడ్స్‌ను పక్కకు పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ఫీల్డింగ్‌ కోచ్‌గా జాంటీ రోడ్స్‌ పనిచేసిన విషయం తెలిసిందే. 

ఇక దాదాపుగా బౌలింగ్‌ కోచ్‌గా భరత్‌ అరుణ్‌ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత బౌలింగ్‌లో ఎలాంటి సమస్యలు లేనందున భరత్‌ అరుణ్‌ వైపే కమిటీ మొగ్గు చూపుతోంది. అయితే బ్యాటింగ్‌ కోచ్‌ను తప్పకుంగా మార్చాలనే ఆలోచనలో బీసీసీఐతో పాటు ప్రసాద్‌ కమిటీ ఉన్నట్లు సమాచారం. బ్యాటింగ్‌లో నాలుగో స్థానంతోపాటు, మిడిలార్డర్‌ సమస్యను పరిష్కరించలేకపోయిన ప్రస్తుత బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌పై వేటు వేయడం ఖాయంగా కనిపిస్తోంది. కొత్త బ్యాటింగ్‌ కోచ్‌ కోసం భారత మాజీ ఆటగాళ్లు ప్రవీణ్‌ ఆమ్రే, విక్రమ్‌ రాథోర్‌లు రేసులో ముందున్నారు.  

చదవండి:
ఎగేసికుంటూ పోయి.. ఉట్టి చేతులతోనే!
ఫీల్డింగ్‌ కోచ్‌ బరిలో జాంటీ రోడ్స్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top