ఆదుకున్న సందీప్, రాయుడు

Rayudu, Sandeep help Hyderabad to respectable total - Sakshi

హైదరాబాద్‌ 289/8 అస్సాంతో రంజీ మ్యాచ్‌  

గువాహటి: రంజీట్రోఫీ క్రికెట్‌ టోర్నమెంట్‌లో భాగంగా అస్సాంతో జరుగుతోన్న మ్యాచ్‌లో హైదరాబాద్‌ జట్టు తడబడి కోలుకుంది. వికెట్‌ కీపర్‌ బావనక సందీప్‌ (122 బంతుల్లో 84; 12 ఫోర్లు), కెప్టెన్‌ అంబటి రాయుడు (152 బంతుల్లో 83; 9 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధసెంచరీలతో కీలక ఇన్నింగ్స్‌ ఆడటంతో జట్టు గౌరవప్రద స్కోరు సాధించింది. గువాహటిలోని బర్సపరా స్టేడియంలో శుక్రవారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో తొలిరోజు ఆటముగిసే సమయానికి హైదరాబాద్‌ తొలి ఇన్నింగ్స్‌లో 84 ఓవర్లలో 8 వికెట్లకు 289 పరుగులు చేసింది. టి. రవితేజ (31; 4 ఫోర్లు, ఒక సిక్స్‌), ఆకాశ్‌ భండారి (43 బ్యాటింగ్‌; 4 ఫోర్లు) రాణించారు. ప్రత్యర్థి బౌలర్లలో అరూప్‌దాస్, రాహుల్‌ సింగ్‌ చెరో 3 వికెట్లు పడగొట్టగా, రజాకుద్దీన్‌ అహ్మద్‌ ఒక వికెట్‌ దక్కించుకున్నాడు.  

నాకౌట్‌ దశకు అర్హత సాధించాలంటే తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్‌లో హైదరాబాద్‌కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు తన్మయ్‌ అగర్వాల్‌ (26 బంతుల్లో 24; 3 ఫోర్లు, ఒక సిక్స్‌), అక్షత్‌ రెడ్డి (5)తో పాటు, కొల్లా సుమంత్‌ (0)ను పెవిలియన్‌కు పంపి బౌలర్‌ అరూప్‌ దాస్‌ హైదరాబాద్‌కు షాకిచ్చాడు. మెహదీ హసన్‌ (0) కూడా ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో హైదరాబాద్‌ 32 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో సందీప్, రాయుడు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 156 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అనంతరం రాహుల్‌ సింగ్‌ బౌలింగ్‌లో స్వల్ప వ్యవధిలోనే వీరిద్దరూ అవుటయ్యారు. తర్వాత రవితేజ, ఆకాశ్‌ భండారి రాణించడంతో జట్టు మంచి స్కోరును సాధించింది. ప్రస్తుతం క్రీజులో ఆకాశ్‌తో పాటు ముదస్సర్‌ (1) ఉన్నాడు.  

స్కోరు వివరాలు

హైదరాబాద్‌ తొలి ఇన్నింగ్స్‌: తన్మయ్‌ అగర్వాల్‌ (సి) రహమాన్‌ (బి) అరూప్‌ దాస్‌ 24; అక్షత్‌ రెడ్డి (బి) అరూప్‌ దాస్‌ 5; మెహదీ హసన్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) రజాకుద్దీన్‌ అహ్మద్‌ 0; సుమంత్‌ (బి) అరూప్‌ దాస్‌ 0; సందీప్‌ (బి) రాహుల్‌ 84; అంబటిరాయుడు (సి) రాహుల్‌ 83; రవితేజ (రనౌట్‌) 31; ఆకాశ్‌ భండారి (బ్యాటింగ్‌) 43; రవికిరణ్‌ (బి) రాహుల్‌ సింగ్‌ 9; ముదస్సర్‌ (బ్యాటింగ్‌) 1; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (84 ఓవర్లలో 8 వికెట్లకు) 289.

వికెట్ల పతనం: 1–11, 2–12, 3–23, 4–32, 5–189, 6–212, 7–243, 8–279.  

బౌలింగ్‌: అరూప్‌ దాస్‌ 25–3–90–3, రజాకుద్దీన్‌ అహ్మద్‌ 10–1–65–1, ప్రీతమ్‌ దాస్‌ 15–1–39–0, రజత్‌ ఖాన్‌ 4–0–26–0, రాహుల్‌ సింగ్‌ 27–6–54–3, గోకుల్‌ శర్మ 3–0–7–0.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top