ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌కు రాయుడు వీడ్కోలు 

Rayudu retires from first-class cricket - Sakshi

పరిమిత ఓవర్ల మ్యాచ్‌లపై దృష్టి పెట్టేందుకేనని ప్రకటన

సాక్షి, హైదరాబాద్‌: టీమిండియా వన్డే బ్యాట్స్‌మన్, హైదరాబాదీ క్రికెటర్‌ అంబటి తిరుపతి రాయుడు ఒకింత ఆశ్చర్యకర నిర్ణయం తీసుకున్నాడు. టి20, వన్డే ఫార్మాట్‌లపై మరింత దృష్టి పెట్టేందుకు... ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) శనివారం పత్రిక ప్రకటన విడుదల చేసింది. ‘రాయుడు రంజీ ట్రోఫీ సహా బహుళ రోజుల మ్యాచ్‌లకు వీడ్కోలు పలికాడు. అంతర్జాతీయ, దేశవాళీల్లో వన్డేలు, టి20లు మాత్రమే ఆడతాడు. తనకు సహకరించిన బీసీసీఐతో పాటు హైదరాబాద్, ఆంధ్ర, బరోడా, విదర్భ క్రికెట్‌ సంఘాలకు అతడు కృతజ్ఞతలు తెలిపాడు’ అని ఆ ప్రకటనలో పేర్కొంది. 

ఫిట్‌నెస్‌ను కాపాడుకునేందుకే... 
ఇటీవలే జాతీయ జట్టులోకి పునరాగమనం చేసి, చక్కటి ఆటతీరుతో స్థానం సుస్థిరం చేసుకుంటున్న 33 ఏళ్ల రాయుడు ఫిట్‌నెస్‌ను కాపాడుకునే ఉద్దేశంలోనే ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ నుంచి తప్పుకొన్నట్లు తెలుస్తోంది. అతడి దృష్టిలో చూస్తే ఇది సహేతుకంగానే కనిపిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌ రంజీ కెప్టెన్‌గానూ ఉన్న అంబటి... ఈ సీజన్‌లో అటు ప్రధాన బ్యాట్స్‌మన్‌గానూ జట్టును నడిపించాల్సి ఉంది. వచ్చే ఫిబ్రవరి వరకు రంజీ సీజన్‌ జరుగుతుంది. ఇదే సమయంలో టీమిండియా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో వన్డే సిరీస్‌లు ఆడాల్సి ఉంది. కొన్ని మ్యాచ్‌లు మినహా రంజీ సీజన్‌కు దాదాపు అందుబాటులో ఉండని పరిస్థితి. మరోవైపు టీమిండియాలో నాలుగో స్థానంలో కుదురుకున్న అతడికి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ప్రపంచ కప్‌ జట్టులోనూ చోటు దక్కడం దాదాపు ఖాయమైంది. ఈ నేపథ్యంలో అటు జాతీయ జట్టుకు, ఇటు రంజీల్లో ఆడుతూ ఫిట్‌నెస్‌ను నిలబెట్టుకోవడం కష్టమని భావించే ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటికే ఒకసారి యోయో పరీక్షలో విఫలమై కీలకమైన ఇంగ్లండ్‌ పర్యటనకు దూరమైన రాయుడు... మళ్లీ అలాంటి పరిస్థితి తలెత్తకుండా చూసుకోవాలని భావించినట్లున్నాడు. 

ఆట వెంటే...  
హైదరాబాద్‌ తరఫున 2001–02 సీజన్‌లో రంజీ అరంగేట్రం చేసిన రాయుడు... 17 ఏళ్లలో 97 మ్యాచ్‌లు ఆడి 6,151 పరుగులు చేశాడు. ఇందులో 16 సెంచరీలు, 34 అర్ధ సెంచరీలున్నాయి. అత్యధిక స్కోరు 210. తొలినాళ్లలోనే ఆంధ్రపై ఒకే మ్యాచ్‌లో డబుల్‌ సెంచరీ, సెంచరీ చేసి భారత జట్టు భవిష్యత్‌ తారగా పేరు తెచ్చుకున్నాడు. తర్వాత వివిధ కారణాలతో రాయుడి ఆట దెబ్బతిన్నది. 2005–06 సీజన్‌లో ఆంధ్ర జట్టుకు ఆడినా ఫలితం లేకపోయింది. 2007లో తిరుగుబాటు లీగ్‌ ఐసీఎల్‌లో చేరడంతో కెరీర్‌ ఇబ్బందుల్లో పడింది. బీసీసీఐ క్షమాభిక్షతో 2009లో ప్రధాన స్రవంతి క్రికెట్‌లోకి వచ్చాడు. 2010 నుంచి 2016 వరకు బరోడా జట్టుకు ఆడిన రాయుడు 2016–2017లో విదర్భ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. గతేడాది హైదరాబాద్‌ జట్టులోకి పునరాగమనం చేశాడు. 2013లో వన్డే, 2014లో టి20 జాతీయ జట్లకు ఎంపికయ్యాడు. అయితే, టీమిండియా టెస్టు అవకాశం మాత్రం అందని ద్రాక్షే అయింది. ఇప్పుడిక ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌కు వీడ్కోలుతో ప్రతి క్రికెటర్‌ కలలు కనే సంప్రదాయ ఫార్మాట్‌లో ఈ హైదరాబాదీ దేశానికి ప్రాతినిధ్యం వహించే వీలు లేనట్లే. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top