'వరల్డ్ క్రికెట్ కు ' రవిశాస్త్రి వార్నింగ్!

'వరల్డ్ క్రికెట్ కు ' రవిశాస్త్రి వార్నింగ్!


ముంబై:ప్రస్తుతం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)లో  చోటు చేసుకున్న సంక్షోభాన్ని అడ్వాంటేజ్ గా తీసుకోవద్దని వరల్డ్ క్రికెట్  బోర్డులను టీమిండియా మాజీ డైరెక్టర్ రవిశాస్త్రి హెచ్చరించాడు. బీసీసీఐలో ఏర్పడిన సంక్షోభం తాత్కాలికమేనన్న విషయం గుర్తిస్తే మంచిదని హితవు పలికాడు. ఈ మేరకు బీసీసీఐలోని తాజా పరిణామాలను దృష్టిలో పెట్టుకుని దూకుడును ప్రదర్శిస్తున్న కొన్ని బోర్డులకు రవిశాస్త్రి పరోక్షంగా చురకలంటించాడు.


'ప్రపంచంలోని పలు క్రికెట్ బోర్డులు బీసీసీఐలోని సంక్షోభాన్ని ఆసరాగా తీసుకునే యత్నం చేస్తున్నాయి. ప్రస్తుతం బీసీసీఐలోని సమస్య అనేది తాత్కాలికమే. ఎవరైతే భారత క్రికెట్ బోర్డును వెనక్కునెట్టాలని యత్నిస్తున్నారో వారికి ఇదే నా వార్నింగ్. ప్రపంచ క్రికెట్ లో అత్యధిక ఆదాయం కల్గిన బీసీసీఐపై పైచేయి సాధించాలనుకోవడం ఆయా బోర్డుల అవివేకం. బీసీసీఐలో చోటు చేసుకున్న ఇబ్బందులు శాశ్వతం కాదు. తొందర్లోనే సమస్య పరిష్కారం కావడం, బీసీసీఐ మళ్లీ తన పూర్వపు వైభవాన్ని సంతరించుకోవడం ఖాయం' అని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు.బీసీసీఐ నుంచి 80 శాతం ఆదాయం ఐసీసీకి సమకూరుతున్నప్పుడు అన్ని బోర్డులకు సమాన వాటా ఉండాలనే తాజా నిర్ణయంతో రవిశాస్త్రి విభేదించాడు. కేవలం బీసీసీఐ అడిగేది ఎక్ప్ట్రా షేరే కానీ, ఆ 80 శాతాన్ని ఇమ్మని అడగడం లేదు కదా అని నిలదీశాడు. ఒకవేళ ఐసీసీ రెవెన్యూలో భారత్ ను పక్కన పెడితే, ఎంత ఆదాయం వస్తుందో ఒకసారి చూడాలనుకుంటున్నట్లు రవిశాస్త్రి వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. బీసీసీఐకు ఒక్క శ్రీలంక మాత్రమే అండగా నిలవగా, బంగ్లాదేశ్, జింబాబ్వే వంటి  చిన్న క్రికెట్ బోర్డులు కూడా మద్దతుగా నిలవకపోవడం ఆశ్చర్యానికి గురి చేసిందన్నాడు. భారత క్రికెట్ ను చంపడానికి జరుగుతున్న ప్రయత్నంలా ఇది కనిపిస్తుందని అభిప్రాయపడ్డ రవిశాస్త్రి... ఈ విషయాన్ని ఐసీసీ తెలుసుకోని పక్షంలో బంగారు గుడ్డులు పెట్టే బాతును చంపేసినట్లు అవుతుందన్నాడు.


ప్రపంచ క్రికెట్‌లో అత్యంత ధనిక బోర్డుగా పేరు తెచ్చుకున్న భారత క్రికెట్‌ నియంత్రణ మండలి ఆధిపత్యానికి చెక్ పెట్టే యత్నాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇటివల  ఐసీసీ తమ సభ్య దేశాలకు పంపిణీ చేసే ఆదాయ ఫార్ములాలో విప్లవాత్మకమైన మార్పులకు ఓటేసింది. ఈ ప్రతిపాదనను బీసీసీఐ వ్యతిరేకించింది. ఈ విషయంలో భారత్‌కు కేవలం శ్రీలంక నుంచి మాత్రమే మద్దతు లభించింది. జింబాబ్వే ఓటింగ్‌కు దూరంగా ఉంది. ఇక పాకిస్తాన్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా ఆదాయ పంపిణీలో మార్పులతో పాటు పరిపాలనా వ్యవస్థలో మార్పులకు మద్దతుగా ఓటింగ్‌లో పాల్గొన్నాయి.ఏప్రిల్‌లో జరిగే ఐసీసీ బోర్డు సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారు.

Back to Top