ఆ విషయంలో నో కాంప్రమైజ్‌: రవిశాస్త్రి

Ravi Shastri Says Never Compromises On Team Punctuality - Sakshi

ఈ విషయంలో సౌరవ్‌ గంగూలీనే శిక్షించా

హైదరాబాద్ : ఆటగాళ్ల సమయపాలన విషయంలో తాను ఎప్పటికి కాంప్రమైజ్‌ కానని టీమిండియా హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి తెలిపారు. గౌరవ్‌ కపూర్‌ బ్రేక్‌ఫాస్ట్‌ విత్‌ చాంపియన్స్‌ షోలో పాల్గొన్న ఆయన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఓ సందర్భంలో ఆలస్యం చేసిన అప్పటి కెప్టెన్‌ గంగూలీని సైతం వదిలి వెళ్లామని గుర్తు చేసుకున్నాడు. 

‘క్రమశిక్షణగా ఉండటం నా అలవాటు. ఈ అలవాటుతో నేను గర్వంగా ఫీలవుతున్నాను. ఎంతటి వారైనా ఈ విషయంలో వదిలిపెట్టను. సమయపాలన కలిగి ఉండటం ప్రతి వ్యక్తికి అవసరం. ముఖ్యంగా ఓ జట్టులో ఉన్నప్పుడు ఇది మరీ అవసరం. బస్సు 9కి బయలు దేరాలంటే ఆ సమయానికి బయలు దేరాల్సిందే. నేను తొలిసారి 2007 బంగ్లాదేశ్‌ పర్యటనకు మేనేజర్‌గా వ్యవహరించినప్పుడు.. ప్రాక్టీస్‌ సెషన్‌ కోసం చిట్టగాంగ్‌ వెళ్లాలి. బస్సు 9కి బయలుదేరాలి. అందరూ ఆటగాళ్లు వచ్చారు. కానీ కెప్టెన్‌ గంగూలీ రాలేదు. నేను వెంటనే దాదా కారులో వస్తాడులే. బస్సు వెళ్లనివ్వమని డ్రైవర్‌కు చెప్పా. అప్పటి నుంచి ఎక్కడికెళ్లినా దాదా ఓ పది నిమిషాలు ముందుండేవాడు.’ అని నాటి రోజులను రవిశాస్త్రి గుర్తు చేసుకున్నాడు.

2015 ప్రపంచకప్‌ అనంతరం అప్పటి భారత్‌ కోచ్‌ డంకెన్‌ ఫ్లేచర్‌ స్థానంలో అనిల్‌ కుంబ్లే కోచ్‌గా నియమితులైన విషయం తెలిసిందే. అయితే ఈ స్థానం కోసం కుంబ్లేతో సహా రవిశాస్త్రి సైతం పోటీపడ్డారు. వీరిని సచిన్‌, గంగూలీ, వీవీఎస్‌ లక్ష్మణ్‌లు అడ్వైజరీ కమిటీ ఇంటర్వ్యూలు చేసింది. ఈ కమిటీ అనిల్‌ కుంబ్లేకు మొగ్గు చూపడంతో రవిశాస్త్రి గంగూలీపై బాహటంగానే అప్పట్లో విమర్శలు చేశారు. అనంతరం ఆటగాళ్లకు కుంబ్లే మధ్య మనస్పర్థలు రావడం.. కెప్టెన్‌ కోహ్లి కోచ్‌గా రవిశాస్త్రే కావాలని పట్టుబట్టడంతో ఆయన టీమిండియా కోచ్‌గా నియమితులైన విషయం తెలిసిందే.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top