రంజింపచేయడానికి రెడీ!

jadeja

బరిలో పలువురు స్టార్‌ క్రికెటర్లు ∙ ఆయా వేదికల్లో నేటి నుంచి రంజీ ట్రోఫీ లీగ్‌ మ్యాచ్‌లు  

న్యూఢిల్లీ: టీమిండియా బిజీ షెడ్యూల్లో భాగమయ్యేందుకు ఎదురు చూస్తున్న ఆటగాళ్లకు చక్కని అవకాశం రానేవచ్చింది. వర్ధమాన క్రికెటర్లతో పాటు ఫామ్‌ కోల్పోయిన స్టార్‌ ఆటగాళ్లు రంజీ ట్రోఫీ బరిలోకి దిగేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా, ఓపెనర్‌ మురళీ విజయ్, బ్యాట్స్‌మన్‌ చతేశ్వర్‌ పుజారా, టెస్టు కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా, పేసర్లు మొహమ్మద్‌ షమీ, ఇషాంత్‌ శర్మలు రంజింపచేసేందుకు సిద్ధంగా ఉన్నారు. తొలి రౌండ్‌ మ్యాచ్‌లు వివిధ రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి జరుగుతాయి.

గత సీజన్‌లో ప్రయోగాత్మకంగా నిర్వహించిన తటస్థ వేదికల మ్యాచ్‌లను రద్దు చేశారు. ఆటగాళ్ల ప్రయాణ బడలిక, 28 జట్లకు సదుపాయాల కల్పన పనికి మించిన భారం కావడంతో బీసీసీఐ మళ్లీ పాత పద్ధతివైపే మొగ్గు చూపింది. అంటే ఇరు జట్లు ఇంటా బయటా మ్యాచ్‌ల్లో తలపడతాయి. భారత క్రికెట్‌లో రాహుల్‌ ద్రవిడ్‌ వారసుడిగా కితాబు అందుకుంటున్న చతేశ్వర్‌ పుజారా సౌరాష్ట్ర సారథిగా వ్యవహరించనున్నాడు. ఇదే జట్టులో జడేజా కూడా ఉండటం సౌరాష్ట్రను మరింత పటిష్టపరిచింది. తమిళనాడుకు ఇటు బ్యాటింగ్‌లో మురళీ విజయ్, బౌలింగ్‌లో రవిచంద్రన్‌ అశ్విన్‌ బలమయ్యారు. వృద్ధిమాన్‌ సాహా, షమీ బెంగాల్‌ జట్టును నడిపించేందుకు సై అంటున్నారు. ఇషాంత్‌ శర్మ పేస్‌ బౌలింగ్‌ ఢిల్లీకి అందుబాటులో ఉంది. తెలుగు జట్లు హైదరాబాద్‌ గ్రూప్‌ ‘ఎ’లో ఆంధ్ర ‘సి’లో పోటీపడతాయి. శుక్రవారం తమ తొలి లీగ్‌ మ్యాచ్‌ల్లో మహారాష్ట్రతో హైదరాబాద్‌; తమిళనాడుతో ఆంధ్ర తలపడతాయి. డిఫెండింగ్‌ చాంపియన్‌ గుజరాత్‌ తమ తొలి మ్యాచ్‌లో కేరళతో ఆడుతుంది.

ఫార్మాట్‌ ఇది...పాయింట్లు ఇవి...

మొత్తం 28 జట్లు ఏడు చొప్పున నాలుగు గ్రూపుల్లో (ఏ, బీ, సీ, డీ) ఇంటా బయట వేదికల్లో తలపడతాయి. ఇన్నింగ్స్‌ లేదా 10 వికెట్ల విజయం సాధిస్తే 7 పాయింట్లు... సాధారణ విజయానికి 6 పాయింట్లు... ‘డ్రా’ అయితే తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యమున్న జట్టుకు 3 పాయింట్లు కేటాయిస్తారు. ఒక్కో గ్రూప్‌ నుంచి టాప్‌–2 జట్లు క్వార్టర్‌ ఫైనల్‌కు చేరతాయి.

రంజీ ట్రోఫీలో అత్యధిక స్కోరు, అత్యల్ప స్కోరు చేసిన రికార్డు హైదరాబాద్‌ జట్టు పేరిటే ఉండటం విశేషం. 1994 సీజన్‌లో ఆంధ్రతో సికింద్రాబాద్‌ జింఖానాలో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ తొలి ఇన్నింగ్స్‌లో 211 ఓవర్లు ఆడి 6 వికెట్లకు 944 పరుగులు చేసింది. ఆ మ్యాచ్‌లో ఎంవీ శ్రీధర్‌ (366) ట్రిపుల్‌ సెంచరీ చేయగా... వివేక్‌ జయసింహ (211), నోయల్‌ డేవిడ్‌ (207 నాటౌట్‌) డబుల్‌ సెంచరీలు సాధించారు.  
ఇక 2010లో రాజస్తాన్‌తో జరిగిన ప్లేట్‌ డివిజన్‌ లీగ్‌ మ్యాచ్‌లో హైదరాబాద్‌ తొలి ఇన్నింగ్స్‌లో 15.3 ఓవర్లు ఆడి కేవలం 21 పరుగులకే ఆలౌటైంది. రాజస్తాన్‌ బౌలర్‌ దీపక్‌ చహర్‌ ఆ ఇన్నింగ్స్‌లో 7.3 ఓవర్లు వేసి 10 పరుగులిచ్చి 8 వికెట్లు తీశాడు.  
ఒకే సీజన్‌లో అత్యధిక పరుగులు, అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు హైదరాబాద్‌ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ పేరిట ఉంది. 1999–2000 సీజన్‌లో లక్ష్మణ్‌ 8 సెంచరీలతో కలిపి మొత్తం 1,415 పరుగులు సాధించాడు.

గ్రూప్‌లు... జట్లు...

గ్రూప్‌ ‘ఎ’: అస్సాం, ఢిల్లీ, హైదరాబాద్, కర్ణాటక, మహారాష్ట్ర, రైల్వేస్, ఉత్తరప్రదేశ్‌.
గ్రూప్‌ ‘బి’: గుజరాత్, హర్యానా, జమ్మూకశ్మీర్, జార్ఖండ్, కేరళ, రాజస్తాన్, సౌరాష్ట్ర.
గ్రూప్‌ ‘సి’: ఆంధ్రప్రదేశ్, బరోడా, మధ్యప్రదేశ్, ముంబై, ఒడిశా, తమిళనాడు, త్రిపుర.
గ్రూప్‌ ‘డి’: బెంగాల్, ఛత్తీస్‌గఢ్, గోవా, హిమా చల్‌ప్రదేశ్, పంజాబ్, సర్వీసెస్, విదర్భ.
రంజీ ట్రోఫీ విజేత జట్టుకు బీసీసీఐ తరఫున రూ. 2 కోట్ల ప్రైజ్‌మనీ లభిస్తుంది. రన్నరప్‌గా నిలిచిన జట్టుకు రూ. కోటి అందజేస్తారు.

 ఇప్పటివరకు 83 సార్లు రంజీ ట్రోఫీ జరుగగా... ముంబై జట్టు 41 సార్లు టైటిల్‌ను దక్కించుకుంది. కర్ణాటక ఎనిమిదిసార్లు, ఢిల్లీ ఏడుసార్లు, బరోడా ఐదుసార్లు చాంపియన్‌లుగా నిలిచాయి.

 రంజీ ట్రోఫీ చరిత్రలో ఇప్పటిదాకా కేవలం ఒక మ్యాచ్‌ (1946లో సదరన్‌ పంజాబ్, బరోడా జట్ల మధ్య) మాత్రమే ‘టై’ అయింది.

 రంజీ ట్రోఫీ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో ఇద్దరు బ్యాట్స్‌మెన్‌ ట్రిపుల్‌ సెంచరీలు చేసిన ఘటన ఒకేసారి జరిగింది. 1988–1989 సీజన్‌లో గోవాతో జరిగిన మ్యాచ్‌లో తమిళనాడు బ్యాట్స్‌మెన్‌ డబ్ల్యూవీ రామన్‌ (313), అర్జన్‌ కృపాల్‌ సింగ్‌ (302 నాటౌట్‌) ట్రిపుల్‌ సెంచరీలు చేశారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top