ఆర్సీబీకి తప్పని మరో ఓటమి

Rajasthan Royals Register First Victory In IPL 2019 Against RCB - Sakshi

రాజస్తాన్‌ ఖాతాలో తొలి విజయం

ఆర్సీబీ అభిమానులకు మరోసారి నిరాశే

జైపూర్‌ : మెరుపుల్లేని బ్యాటింగ్‌.. పసలేని బౌలింగ్‌.. చెత్త ఫీల్డింగ్‌ ఇవన్నీ కలసి రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఖాతాలో మరో ఓటమి నమోదయింది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)-12లో భాగంగా స్థానిక సవాయ్‌ మాన్‌సింగ్‌ మైదానంలో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌ 19.5 ఓవర్లలో కేవలం మూడు వికెట్లను కోల్పోయి ఛేదించింది. ఛేదనలో బట్లర్‌(59) మరోసారి బ్యాట్‌ ఝుళిపించాడు. బట్లర్‌తో పాటు స్మిత్‌(38), త్రిపాఠి(34)లు రాణించడంతో రాజస్తాన్‌ సునాయసంగా విజయం సాధించింది. ఆర్సీబీ చెత్త ఫీల్డింగ్‌ కూడా రాజస్తాన్‌కు కలిసొచ్చింది. ఆర్సీబీ బౌలర్లలో చహల్‌(2/17), సిరాజ్‌(1/25)లు మాత్రమే ఆకట్టుకున్నారు. 

అంతకముందు పార్థివ్‌ పటేల్‌(67; 41 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్సర్‌) మినహా ఎవరూ రాణించకపోవడంతో ఆర్సీబీ సాధారణ స్కోరుకే పరిమితమైంది.  టాస్‌ ఓడి మొదటి బ్యాటింగ్‌ చేపట్టిన ఆర్సీబీ ఇన్నింగ్స్‌ను విరాట్‌ కోహ్లి, పార్థివ్‌ పటేల్‌లు ఆరంభించారు. అయితే జట్టు స్కోరు 49 పరుగుల వద్ద కోహ్లి(23) తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. కోహ్లి మంచి టచ్‌లో కనిపించనప్పటికీ శ్రేయస్‌ గోపాల్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు. మరో 22 పరుగుల వ్యవధిలో ఏబీ డివిలియర్స్‌(13) కూడా ఔటయ్యాడు.

ఆపై వెంటనే హెట్‌మెయిర్‌(1) సైతం పెవిలియన్‌ బాట పట్టాడు. దాంతో 73 పరుగులకే ఆర్సీబీ మూడు వికెట్లు కోల్పోయింది. తొలి మూడు వికెట్లను శ్రేయస్‌ గోపాల్‌ సాధించి ఆర్సీబీని కష్టాల్లోకి నెట్టాడు.  ఒకవైపు పార్థివ్‌ పటేల్‌ నిలకడగా ఆడి జట్టు స్కోరును చక్కదిద్దాడు. అయితే ఆర్సీబీ స్కోరు 126 పరుగుల వద్ద పార్థివ్‌ నాల్గో వికెట్‌గా ఔటయ్యాడు. ఇక చివర్లో స్టోయినిస్‌(31 నాటౌట్‌), మొయిన్‌ అలీ(18 నాటౌట్‌) ఫర్వాలేదనిపించడంతో ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top