థీమ్‌ చేతిలో నాదల్‌కు షాక్‌ 

Rafael Nadal drops first match on clay in a year with loss - Sakshi

21 విజయాల తర్వాత 

స్పెయిన్‌ స్టార్‌కు తొలి ఓటమి

వరుసగా 50 సెట్‌లు గెలిచి  ప్రపంచ రికార్డు

ఫెడరర్‌కు నంబర్‌వన్‌ ర్యాంక్‌ కోల్పోనున్న నాదల్‌

మాడ్రిడ్‌: ప్రపంచ రికార్డు సృష్టించి 24 గంటలు గడవకముందే స్పెయిన్‌ టెన్నిస్‌ స్టార్‌ రాఫెల్‌ నాదల్‌కు అనూహ్య ఓటమి ఎదురైంది. మాడ్రిడ్‌ ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌ టోర్నమెంట్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ నాదల్‌ క్వార్టర్‌ ఫైనల్లో నిష్క్రమించాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ ఏడో ర్యాంకర్‌ డొమినిక్‌ థీమ్‌ (ఆస్ట్రియా) 7–5, 6–3తో టాప్‌ సీడ్, ప్రపంచ నంబర్‌వన్‌ రాఫెల్‌ నాదల్‌ను ఓడించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. ఈ పరాజయంతో నాదల్‌ 21 వరుస విజయాల పరంపరకు తెర పడింది. అంతేకాకుండా వచ్చే సోమవారం విడుదలయ్యే ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నాదల్‌ తన నంబర్‌వన్‌ ర్యాంక్‌ను ఫెడరర్‌ (స్విట్జర్లాండ్‌)కు కోల్పోనున్నాడు. నాదల్‌తో గతంలో ఎనిమిదిసార్లు ఆడి రెండు సార్లే నెగ్గిన థీమ్‌ ఈసారి పక్కా ప్రణాళికతో ఆడి అద్భుత ఫలితాన్ని సాధించాడు. గంటా 56 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో థీమ్‌ నాదల్‌ సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్‌ చేశాడు.  

మెకన్రో రికార్డు బద్దలు... 
భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి దాటాక జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్లో నాదల్‌ 6–3, 6–4తో డీగో ష్వార్ట్‌జ్‌మన్‌ (అర్జెంటీనా)పై గెలుపొందాడు. ఈ క్రమంలో నాదల్‌ క్లే కోర్టులపై వరుసగా 50 సెట్‌లు గెలిచిన ఏకైక ప్లేయర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఇప్పటిదాకా ఈ రికార్డు జాన్‌ మెకన్రో (అమెరికా) పేరిట ఉండేది. మెకన్రో 1984లో క్లే కోర్టులపై వరుసగా 49 సెట్‌లు గెలిచాడు. 

హలెప్‌ ఓటమి 
ఇదే వేదికపై జరుగుతున్న మహిళల విభాగం టోర్నమెంట్‌లో ప్రపంచ నంబర్‌వన్, టాప్‌ సీడ్‌ సిమోనా హలెప్‌ (రొమేనియా) పోరాటం ముగిసింది. క్వార్టర్‌ ఫైనల్లో కరోలినా ప్లిస్కోవా (చెక్‌ రిపబ్లిక్‌) 6–3, 6–4తో హలెప్‌ను బోల్తా కొట్టించింది. దాంతో వరుసగా మూడోసారి ఈ టైటిల్‌ సాధించాలని ఆశించిన హలెప్‌కు నిరాశ ఎదురైంది.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top