‘ఆంక్షల’ ఆట..!

Rafael Marquez cannot drink from the same bottles as his Mexico teammates - Sakshi

మెక్సికో స్టార్‌ మార్కెజ్‌పై నిషేధాజ్ఞలు 

అతను వరుసగా ఐదోసారి ప్రపంచ కప్‌లో తన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న దిగ్గజ ఆటగాడు. కానీ జట్టు ప్రాక్టీస్‌ సమయంలో తాను అందరిలాంటి దుస్తులు వేసుకోవడానికి లేదు. విరామంలో వారంతా తాగే డ్రింక్స్‌ ముట్టుకోవడానికి లేదు. ప్రయాణం చేయాలన్నా విమానం వేరేది ఉండాలి. అద్భుతంగా ఆడినా మీడియా ముందుకు వచ్చి మాట్లాడటానికి లేదు. ఇదంతా మెక్సికో స్టార్‌ ప్లేయర్‌ రాఫెల్‌ మార్కెజ్‌పై కొనసాగుతున్న నిషేధాల జాబితా! డ్రగ్‌ సరఫరాదారులతో సంబంధాలు ఉన్నాయని, రౌల్‌ హెర్నాండెజ్‌ అనే డ్రగ్స్‌ వ్యాపారికి బినామీగా వ్యవహరిస్తున్నాడంటూ 39 ఏళ్ల మార్కెజ్‌ పేరును అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్‌ తమ ‘బ్లాక్‌లిస్ట్‌’ జాబితాలో చేర్చింది. అమెరికాకు చెందిన సంస్థలు అతనితో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దని ఆంక్షలు విధించింది.

ఫలితంగా ప్రపంచకప్‌లో అతను దాదాపు ఒంటరి పక్షిలా ఉండాల్సి వస్తోంది. ముఖ్యంగా స్పాన్సర్లలో ఎక్కువగా అమెరికా కంపెనీలే (వీసా, మెక్‌డొనాల్డ్‌ తదితర) ఉండటంతో అతడి కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకోవాల్సి వచ్చింది. మెక్సికో టీమ్‌ ప్రాక్టీస్‌ డ్రెస్‌పై కోకాకోలా లోగో ఉంటుంది. కాబట్టి అతను వేసుకోరాదు. కోకాకోలాకే చెందిన ఎనర్జీ డ్రింక్‌ ‘పవరేడ్‌’ ఆటగాళ్లంతా తాగుతారు తప్ప మార్కెజ్‌ ముట్టడు. ఇంటర్వ్యూలు ఇచ్చే చోట అమెరికా లోగోలే ఎక్కువగా ఉంటాయి కాబట్టి అతను ఇంటర్వ్యూ ఇవ్వలేడు. అమెరికాకు చెందిన విమాన సంస్థలో ప్రయాణం చేయలేడు కాబట్టి ప్రత్యేక ఏర్పాట్లు, చివరకు అమెరికాతో ఎలాంటి సంబంధాలు లేని హోటల్‌లో అతనికి గది కేటాయించాల్సి వచ్చింది. అయితే ఇవన్నీ తెలిసి కూడా ‘ఫిఫా’తో చర్చించిన తర్వాతే మెక్సికో అతడిని జట్టులోకి ఎంపిక చేసింది. కాబట్టి దానికి అనుగుణంగా ‘ఫిఫా’ కూడా సహకారం అందించడం వల్లే మార్కెజ్‌ ప్రపంచకప్‌ బరిలో నిలిచాడు. మరోవైపు అతనిపై ఆరోపణలు ఇంకా రుజువు కాలేదు. తాను ఎలాంటి తప్పూ చేయలేదని అతను న్యాయ పోరాటం కూడా చేస్తున్నాడు.    

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top