మొదలైంది వేట

PV Sindhu, Saina Nehwal and Kidambi Srikanth go to pre quater finals - Sakshi

ప్రిక్వార్టర్‌ ఫైనల్లో సింధు, సైనా

డబుల్స్‌లో ముగిసిన పోరు

ప్రపంచ చాంపియన్‌షిప్‌  

గత ఐదు ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో భారత్‌కు పతకాలు అందించిన స్టార్‌ క్రీడాకారిణులు పూసర్ల వెంకట (పీవీ) సింధు, సైనా నెహ్వాల్‌ మరోసారి పతకాల వేట ప్రారంభించారు. తొలి రౌండ్‌లో ‘బై’ పొంది నేరుగా రెండో రౌండ్‌ మ్యాచ్‌ ఆడిన సింధు, సైనా అలవోక విజయాలతో ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ బెర్త్‌లను ఖాయం చేసుకున్నారు. మరోవైపు డబుల్స్‌ విభాగంలో భారత జోడీల పోరాటం ముగిసింది.   

బాసెల్‌ (స్విట్జర్లాండ్‌): అందని ద్రాక్షగా ఉన్న పసిడి పతకం అందుకోవాలనే లక్ష్యంతో ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో బరిలోకి దిగిన ఐదో సీడ్‌ పీవీ సింధు, ఎనిమిదో సీడ్‌ సైనా నెహ్వాల్‌ శుభారంభం చేశారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌ రెండో రౌండ్‌ మ్యాచ్‌ల్లో సింధు 21–14, 21–15తో పాయ్‌ యు పో (చైనీస్‌ తైపీ)పై... సైనా 21–10, 21–11తో సొరాయ డివిష్‌ (నెదర్లాండ్స్‌)పై విజయం సాధించారు. పాయ్‌ యు పోతో జరిగిన మ్యాచ్‌లో సింధుకు అంతగా ప్రతిఘటన ఎదురుకాలేదు. తొలి గేమ్‌ ఆరంభంలో 11–7తో ఆధిక్యంలోకి వెళ్లిన సింధు ఆ తర్వాత అదే జోరును కొనసాగించింది.

రెండో గేమ్‌లో పాయ్‌ యు పో తేరుకునే ప్రయత్నం చేసినా సింధు దూకుడు పెంచి విజయాన్ని ఖాయం చేసుకుంది. నేడు జరిగే ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో తొమ్మిదో సీడ్‌ బీవెన్‌ జాంగ్‌ (అమెరికా)తో సింధు; 12వ సీడ్‌ మియా బ్లిచ్‌ఫెల్ట్‌ (డెన్మార్క్‌)తో సైనా నెహ్వాల్‌ తలపడతారు. పురుషుల డబుల్స్‌ రెండో రౌండ్‌ మ్యాచ్‌ల్లో సుమీత్‌ రెడ్డి–మనూ అత్రి (భారత్‌) 16–21, 19–21తో హాన్‌ చెంగ్‌ కాయ్‌–హావో డాంగ్‌ జౌ (చైనా) చేతిలో... అర్జున్‌–శ్లోక్‌ 14–21, 13–21తో లియు చెంగ్‌–నాన్‌ జాంగ్‌ (చైనా) చేతిలో ఓడిపోయారు. మహిళల డబుల్స్‌ రెండో రౌండ్‌లో సిక్కి రెడ్డి–అశ్విని 20–22, 16–21తో ఏడో సీడ్‌ డు యువె–లిన్‌ యిన్‌ హుయ్‌ (చైనా) చేతిలో... మేఘన–పూర్వీషా  8–21, 18–21తో షిహో తనాక–కొహారు (జపాన్‌) చేతిలో ఓడారు.   

శ్రీకాంత్‌ ముందంజ...
పురుషుల సింగిల్స్‌ విభాగంలో ఏడో సీడ్‌  శ్రీకాంత్‌ (భారత్‌) ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. మిషా జిల్బెర్‌మన్‌ (ఇజ్రాయెల్‌)తో జరిగిన రెండో రౌండ్‌లో శ్రీకాంత్‌ 13–21, 21–13, 21–16తో నెగ్గాడు. నేడు జరిగే ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో కెంటో మొమోటా (జపాన్‌)తో ప్రణయ్‌; ఆంథోని (ఇండోనేసియా)తో సాయిప్రణీత్‌; కాంతాపోన్‌(థాయ్‌లాండ్‌)తో శ్రీకాంత్‌ పోటీపడతారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top