శ్రమించిన సింధు, సైనా

PV Sindhu, Saina Nehwal advances to the second round - Sakshi

ఇండోనేసియా మాస్టర్స్‌ టోర్నీలో ప్రిక్వార్టర్స్‌కు భారత్‌ స్టార్స్‌

జకార్తా: కొత్త సీజన్‌లో తొలి విజయం సాధించడానికి భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు తీవ్రంగా శ్రమించింది. సింధుతోపాటు సైనా నెహ్వాల్‌ కూడా ఇండోనేసియా మాస్టర్స్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500 టోర్నమెంట్‌లో బోణీ చేసింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్‌ సింధు 22–24, 21–8, 21–17తో ప్రపంచ మాజీ నంబర్‌వన్, 2012 లండన్‌ ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత లీ జురుయ్‌ (చైనా) గెలిచింది. 54 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధు తొలి గేమ్‌ను చేజార్చుకున్నా... ఆ తర్వాత పుంజుకొని వరుసగా రెండు గేమ్‌లను సొంతం చేసుకుంది. మరో మ్యాచ్‌లో ఎనిమిదో సీడ్‌ సైనా 7–21, 21–16, 21–11తో దినార్‌ అయుస్తిన్‌ (ఇండోనేసియా)పై గెలిచేందుకు 49 నిమిషాలు తీసుకుంది. నేడు జరిగే ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో గ్రెగోరియా మరిస్కా (ఇండోనేసియా)తో సింధు; ఫిత్రియాని (ఇండోనేసియా)తో సైనా తలపడతారు. 

పోరాడి ఓడిన శుభాంకర్‌ 
పురుషుల సింగిల్స్‌ మెయిన్‌ ‘డ్రా’లో భారత్‌ నుంచి నలుగురు ఆటగాళ్లు బరిలోకి దిగగా... కిడాంబి శ్రీకాంత్‌ మినహా మిగతా అందరూ తొలి రౌండ్‌లోనే నిష్క్రమించారు. క్వాలిఫయింగ్‌ నుంచి మెయిన్‌ ‘డ్రా’కు అర్హత పొందిన శుభాంకర్‌ డే 14–21, 21–19, 15–21తో ప్రపంచ మాజీ చాంపియన్, నంబర్‌వన్‌ విక్టర్‌ అక్సెల్‌సన్‌ (డెన్మార్క్‌) చేతిలో పోరాడి ఓడిపోయాడు. ఇతర మ్యాచ్‌ల్లో పారుపల్లి కశ్యప్‌ 12–21, 16–21తో ఆంథోనీ జిన్‌టింగ్‌ (ఇండోనేసియా) చేతిలో... సాయిప్రణీత్‌ 12–21, 16–21తో రియో ఒలింపిక్స్‌ చాంపియన్‌ చెన్‌ లాంగ్‌ (చైనా) చేతిలో ఓటమి చవిచూశారు. కిడాంబి శ్రీకాంత్‌ 21–12, 21–8తో చోంగ్‌ వె ఫెంగ్‌ (మలేసియా)పై గెలిచి నేడు జరిగే ప్రిక్వార్టర్‌ ఫైనల్లో కెంటో నిషిమోటో (జపాన్‌)తో పోరుకు సిద్ధమయ్యాడు.  పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో సుమీత్‌ రెడ్డి–మనూ అత్రి (భారత్‌) ద్వయం 14–21, 21–19, 21–15తో మ్యాడ్స్‌ కోల్డింగ్‌–నిక్లాస్‌ నోర్‌ (డెన్మార్క్‌) జోడీపై నెగ్గింది. మహిళల డబుల్స్‌ తొలి రౌండ్‌లో నేలకుర్తి సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్‌) జంట 14–21, 14–21తో జోంగ్‌కొల్పాన్‌–ప్రజోంగ్జయ్‌ (థాయ్‌లాండ్‌) ద్వయం చేతిలో పరాజయం పాలైంది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top