సింధు... ఈసారి వదలొద్దు

PV Sindhu Enters World Championships Final - Sakshi

వరుసగా మూడోసారి ప్రపంచ చాంపియన్‌షిప్‌ ఫైనల్లోకి భారత స్టార్‌

సెమీఫైనల్లో మూడో ర్యాంకర్‌ చెన్‌ యుఫెపై అలవోక విజయం

నేడు మాజీ విశ్వవిజేత ఒకుహారాతో ‘పసిడి’ పోరు

ముఖాముఖి రికార్డులో 8–7తో ఆధిక్యంలో తెలుగు తేజం

ఫైనల్స్‌ మధ్యాహ్నం గం. 3.30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం

ఇంకొక్క విజయమే... నాలుగు దశాబ్దాలుగా ఊరిస్తోన్న పసిడి కల నెరవేరడానికి... భారత బ్యాడ్మింటన్‌ చరిత్రలో ఎవరికీ సాధ్యంకాని ఘనతను అందుకోవడానికి! ఇంకొక్క విజయమే... ముచ్చటగా మూడో ప్రయత్నంలో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకం రంగు మార్చడానికి... విశ్వవేదికపై మువ్వన్నెలు రెపరెపలాడటానికి! ఇంకొక్కవిజయమే... సింధు పేరు భారత క్రీడాచరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేందుకు... గతంలో పాల్గొన్న ఐదు ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో నాలుగు పతకాలు గెల్చుకున్న తెలుగు తేజం సింధు పసిడి కాంతులు మాత్రం విరజిమ్మలేకపోయింది. రెండుసార్లు కాంస్యాలతో సరిపెట్టుకోగా... మరో రెండుసార్లు ‘రజత’ హారం మెడలో వేసుకుంది. రెండు ఫైనల్స్‌లో ఓడిన అనుభవం నుంచి గుణపాఠం నేర్చుకొని... మూడోసారి పతక వర్ణాన్ని పసిడిగా మార్చాలని ఆశిస్తూ... విజయీభవ సింధు...!  

బాసెల్‌ (స్విట్జర్లాండ్‌): జగజ్జేతగా అవతరించడానికి భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు విజయం దూరంలో నిలిచింది. గత ప్రదర్శన ఆధారంగా... ఈసారీ భారీ అంచనాలతో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో అడుగు పెట్టిన ఈ ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి... ఒక్కో అడ్డంకిని అధిగమిస్తూ వరుసగా మూడోసారి ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌లో ఆఖరి సమరానికి అర్హత సాధించింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్‌ సింధు 40 నిమిషాల్లో 21–7, 21–14తో ప్రపంచ మూడో ర్యాంకర్, ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌ చెన్‌ యుఫె (చైనా)పై అద్వితీయ విజయం సాధించింది.

తద్వారా వరుసగా మూడోసారి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఫైనల్లోకి దూసుకెళ్లింది. నేడు జరిగే ఫైనల్లో 2017 ప్రపంచ చాంపియన్, ప్రపంచ నాలుగో ర్యాంకర్‌ నొజోమి ఒకుహారా (జపాన్‌)తో సింధు ఆడుతుంది. రెండో సెమీఫైనల్లో ఒకుహారా 83 నిమిషాల్లో 21–17, 18–21, 21–15తో 2013 ప్రపంచ చాంపియన్‌ ఇంతనోన్‌ రచనోక్‌ (థాయ్‌లాండ్‌)పై గెలిచింది. ఒకుహారాతో ముఖాముఖి రికార్డులో సింధు 8–7తో ఆధిక్యంలో ఉంది. ఈ ఏడాది వీరిద్దరు రెండుసార్లు తలపడగా.. చెరో మ్యాచ్‌లో గెలిచారు. 2017 ప్రపంచ చాంపియన్‌షిప్‌ ఫైనల్లో ఒకుహారా చేతిలో ఎదురైన పరాజయానికి సింధు ఈసారి ప్రతీకారం తీర్చుకొని పసిడి పతకం మెడలో వేసుకుంటుందో లేదో వేచి చూడాలి.  

ఆరంభం నుంచే...
రెండో ర్యాంకర్‌ తై జు యింగ్‌తో జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో గొప్ప పోరాటపటిమ కనబరిచి అద్భుత విజయాన్ని అందుకున్న సింధు సెమీఫైనల్లో మాత్రం ఆరంభం నుంచే పైచేయి సాధించింది. ఈ ఏడాది ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌ టైటిల్‌ నెగ్గిన చెన్‌ యుఫెను ఏమాత్రం తక్కువ అంచనా వేయకుండా పక్కా ప్రణాళికతో ఆడింది. క్లిష్టమైన కోణాల్లో షటిల్స్‌ను పంపిస్తూ చెన్‌ యుఫె సత్తాకు పరీక్ష పెట్టింది. అవకాశం వచ్చినపుడల్లా చెన్‌ యుఫె బలహీన రిటర్న్‌ షాట్‌లను అంతేవేగంగా రిటర్న్‌ చేస్తూ పాయింట్లు గెల్చుకుంది.

చెన్‌ యుఫె కొట్టిన షాట్‌ బయటకు వెళ్లడంతో తొలి గేమ్‌లో విరామానికి 11–3తో ఆధిక్యంలోకి వెళ్లిన సింధు ఆ తర్వాత కేవలం నాలుగు పాయింట్లు కోల్పోయి గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లో చైనా ప్లేయర్‌పై ఒత్తిడిని కొనసాగిస్తూ సింధు ఆరంభంలోనే 11–7తో ఆధిక్యంలోకి వెళ్లింది. సుదీర్ఘంగా సాగిన పలు ర్యాలీల్లో సింధు పైచేయి సాధిస్తూ తన ఆధిక్యాన్ని 17–9కి పెంచుకుంది. క్రాస్‌కోర్ట్‌ స్మాష్‌తో 20–12తో విజయానికి పాయింట్‌ దూరంలో నిలిచిన సింధు ఆ తర్వాత రెండు పాయింట్లు కోల్పోయింది. అయితే చెన్‌ యుఫె కొట్టిన షాట్‌ బయటకు వెళ్లిపోవడంతో ఈసారి సింధు ఖాతాలో పాయింట్‌తోపాటు గేమ్, విజయం చేరాయి.  

ఫైనల్‌ చేరారిలా...సింధు
తొలి రౌండ్‌: బై
రెండో రౌండ్‌: పాయ్‌ యు పో (చైనీస్‌ తైపీ)పై
42 నిమిషాల్లో 21–14, 21–15తో గెలుపు
మూడో రౌండ్‌: బీవెన్‌ జాంగ్‌ (అమెరికా)పై
34 నిమిషాల్లో 21–14, 21–6తో గెలుపు    
క్వార్టర్‌ ఫైనల్‌: తై జు యింగ్‌ (చైనీస్‌ తైపీ)పై
71 నిమిషాల్లో 12–21, 23–21, 21–19తో గెలుపు    
సెమీఫైనల్‌: చెన్‌ యుఫె (చైనా)పై 40 నిమిషాల్లో
21–7, 21–14తో గెలు
పు    

ఒకుహారా
తొలి రౌండ్‌: బై
రెండో రౌండ్‌: ఎవగెనియా కొసెత్‌స్కాయ (రష్యా)పై
34 నిమిషాల్లో 21–12, 21–14తో విజయం
మూడో రౌండ్‌: సుంగ్‌ జీ హున్‌ (కొరియా)పై
47 నిమిషాల్లో 21–18, 21–13తో విజయం
క్వార్టర్‌ ఫైనల్‌: హి బింగ్‌ జియావో (చైనా)పై
43 నిమిషాల్లో 21–7, 21–18తో విజయం
సెమీఫైనల్‌: రచనోక్‌ (థాయ్‌లాండ్‌)పై
83 నిమిషాల్లో 21–17, 18–21, 21–15తో విజయం   

చెన్‌ యుఫెతో మ్యాచ్‌కు పక్కాగా సిద్ధమై వచ్చాను. తొలి క్షణం నుంచే అనుకున్న వ్యూహాలను ఆచరణలో పెట్టాను. ఆరంభం నుంచే ఆధిక్యంలోకి వెళ్లి అంతే వేగంతో తొలి గేమ్‌ను ముగించాను. రెండో గేమ్‌లో అనవసర తప్పిదాలు చేశాను. వరుస పాయింట్లు కోల్పోయాక మళ్లీ పుంజుకొని ఆధిక్యంలోకి వచ్చాను. దాంతో పూర్తి ఆత్మవిశ్వాసంతో ఆడుతూ మ్యాచ్‌ను ముగించాను. నేడు జరిగే ఫైనల్లోనూ బాగా ఆడతానని ఆశిస్తున్నాను. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌లో నా లక్ష్యం ఇంకా నెరవేరలేదు. సంతోషంగా ఉన్నా పూర్తి సంతృప్తిగా లేను. ఫైనల్‌ మ్యాచ్‌ మిగిలి ఉంది. ఆ మ్యాచ్‌లోనూ గెలిచి స్వర్ణం సాధించాలనే పట్టుదలతో ఉన్నాను. ఒకుహారాతో తుది పోరు తేలికేం కాదు. ఒకరి ఆటతీరుపై ఒకరికి పూర్తి అవగాహన ఉంది.  కీలకదశల్లో ఏకాగ్రతతో, నిగ్రహం కోల్పోకుండా సంయమనంతో ఆడాలి. నేనైతే నా అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శిస్తా. తుది ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.    
– పీవీ సింధు
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top