హాఫ్‌ సెంచరీతో ఆదుకున్నాడు..

Pujara stands tall amongst the ruins - Sakshi

అడిలైడ్‌: ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో భాగంగా మొదటి ఇన్నింగ్స్‌లో వరుస వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ భారత జట్టును చతేశ్వర పుజారా ఆదుకున్నాడు. కీలక సమయంలో నిలకడైన ఆట తీరుతో హాఫ్‌ సెంచరీ సాధించాడు. 153 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో పుజారా అర్థ శతకం నమోదు చేశాడు.ఒకవైపు వికెట్లు పడుతున్నప్పటికీ పుజారా మాత్రం తనదైన మార్కు ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే భారత్‌ స్కోరును 150 పరుగులు దాటించాడు. ఆసీస్‌ బౌలర్ల నుంచి దూసుకొచ్చిన పదునైన బంతులకు ఎదురొడ్డి నిలబడ్డ పుజారా మరొకసారి తన విలువేంటో చూపించాడు. ఇది పుజారా కెరీర్‌లో 20వ టెస్టు హాఫ్‌ సెంచరీ.


టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 127 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి చిక్కుల్లో పడింది. లోకేష్‌ రాహుల్‌ (2), మురళీ విజయ్‌ (11), విరాట్‌ కోహ్లీ (3), అజింక్యా రహానె(13), రోహిత్‌ శర్మ(37), రిషబ్‌ పంత్‌(25)లు పెవిలియన్‌కు చేరారు. 41 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన తరుణంలో రోహిత్‌ శర్మ-రిషబ్‌ పంత్‌లు కాసేపు మరమ్మత్తులు చేశారు. ఆపై వీరిద్దరూ సైతం వెనుదిరగడంతో టీమిండియా మరింత కష్టాల్లోకి వెళ్లింది. టీమిండియా కోల్పోయిన ఆరు వికెట్లలో హాజిల్‌వుడ్‌, నాథన్‌ లియాన్‌లు తలో రెండు వికెట్లు సాధించగా,  స్టార్క్‌, కమిన్స్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు.

ఆసీ​స్‌ బౌలర్ల ధాటికి టీమిండియా టాప్‌ ఆర్డర్‌ కుప్పకూలింది. కంగారూ బౌలర్లు పదునైన బంతులు సంధించడంతో టీమిండియా త్వరగా వికెట్లు నష్టపోయింది. 15 పరుగుల​కే ఓపెనర్లు రాహుల్‌, విజయ్‌ పెవిలియన్‌కు చేరారు. తర్వాత వచ్చిన కెప్టెన్‌ కోహ్లి వెంటనే అవుటయ్యాడు. రహానే కూడా తక్కువ స్కోరుకే పెవిలియన్‌ చేరాడు. టెస్ట్‌ స్పెషలిస్ట్‌ పుజారా, రోహిత్‌తో కలిసి కాసేపు పోరాడాడు. ఈ జోడిని లియాన్‌ విడదీశాడు. కుదురుకుంటున్న రోహిత్‌ను పెవిలియన్‌ను పంపాడు. ఆపై కాసేపటికి రిషబ్‌ పంత్‌ను కూడా లియాన్‌ ఔట్‌ చేసి భారత్‌కు మరో షాకిచ్చాడు. పుజారాకు జతగా అశ్విన్‌(10 బ్యాటింగ్‌; 38 బంతుల్లో) క్రీజ్‌లో ఉన్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top