పృథ్వీ షా రంజీల్లోనే ఆడాలి!

Prithvi Shaw playing in Ranjits!

భారత అండర్‌–19 జట్టుకు ఎంపిక చేయని సెలక్టర్లు

న్యూఢిల్లీ: కెరీర్‌లో తొలి రంజీ ట్రోఫీ, తొలి దులీప్‌ ట్రోఫీ మ్యాచ్‌లలోనే సెంచరీలు సాధించి సత్తా చాటిన 17 ఏళ్ల ముంబై సంచలన బ్యాట్స్‌మన్‌ పృథ్వీ షా విషయంలో జూనియర్‌ సెలక్షన్‌ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. అతను మున్ముందు మరింత ఎదగాలంటే రంజీ ట్రోఫీలో ఆడటం ముఖ్యమని భావించింది. అందుకే అండర్‌–19 ఆసియా కప్‌లో పాల్గొనే భారత జట్టులోకి పృథ్వీని ఎంపిక చేయలేదు. సోమవారం ప్రకటించిన ఈ జట్టుకు హిమాన్షు రాణా కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. గత ఆగస్టులో ఇంగ్లండ్‌లో పర్యటించిన భారత అండర్‌–19 జట్టుకు షా కెప్టెన్‌గా ఉన్నాడు. పృథ్వీ షా రంజీల్లో ముంబైకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ‘భారత అండర్‌–19, ‘ఎ’ జట్టు కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌తో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నాం. పృథ్వీ ఈ దశలో రంజీలపై దృష్టి పెట్టడమే సరైనదిగా ఆయన అభిప్రాయపడ్డారు’ అని ఒక సెలక్టర్‌ వెల్లడించారు. నవంబర్‌ 9 నుంచి 20 వరకు మలేసియాలో ఆసియా కప్‌ టోర్నీ జరుగుతుంది.  

జట్టు వివరాలు: హిమాన్షు రాణా (కెప్టెన్‌), అభిషేక్‌ శర్మ (వైస్‌ కెప్టెన్‌), అథర్వ తైడే, మన్‌జోత్‌ కల్రా, సల్మాన్‌ ఖాన్, అనూజ్‌ రావత్, హార్విక్‌ దేశాయ్, రియాన్‌ పరాగ్, అనుకూల్‌ రాయ్, శివ సింగ్, తనుష్‌ కొటియాన్, దర్శన్‌ నల్కండే, వివేకానంద్‌ తివారి, ఆదిత్య థాకరే, మన్‌దీప్‌ సింగ్‌  

సౌత్‌జోన్‌ అండర్‌–19 జట్టు కూడా...
బీసీసీఐ ఇంటర్‌ జోనల్‌ వన్డే టోర్నమెంట్‌లో పాల్గొనే సౌత్‌ జోన్‌ అండర్‌–19 జట్టును ప్రకటించారు. హైదరాబాద్, ఆంధ్ర జట్ల నుంచి ముగ్గురేసి ఆటగాళ్లు ఇందులోకి ఎంపికయ్యారు. హైదరాబాద్‌ తరఫున ఠాకూర్‌ తిలక్‌ వర్మ, సాయి ప్రజ్ఞారెడ్డి, వరుణ్‌ గౌడ్‌లకు స్థానం లభించగా... ఆంధ్ర క్రికెటర్లు కె.మహీప్‌ కుమార్, ఎస్‌ ఎండీ రఫీ, బి.వినయ్‌ కుమార్‌లకు జట్టులో అవకాశం దక్కింది.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top