పటిష్ట స్థితిలో హిమాచల్‌ప్రదేశ్‌

Prashant leads Himachal from the front - Sakshi

  ప్రశాంత్‌ చోప్రా సెంచరీ

  తొలి ఇన్నింగ్స్‌లో 231/4

  హైదరాబాద్‌ బౌలర్లు విఫలం

  రంజీ ట్రోఫీ క్రికెట్‌ టోర్నమెంట్‌

సాక్షి, హైదరాబాద్‌: రంజీ ట్రోఫీలో భాగంగా హిమాచల్‌ ప్రదేశ్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో హైదరాబాద్‌ బౌలర్లు రాణించలేకపోయారు. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియంలో బుధవారం ప్రారంభమైన ఎలైట్‌ గ్రూప్‌ ఎ అండ్‌ బి లీగ్‌ మ్యాచ్‌లో రోజంతా ఆడి కేవలం 4 వికెట్లు మాత్రమే పడగొట్టగలిగారు. దీంతో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న హిమాచల్‌ ప్రదేశ్‌ తొలిరోజు ఆటముగిసే సమయానికి 90 ఓవర్లలో 4 వికెట్లకు 231 పరుగులతో నిలిచింది. ప్రశాంత్‌ చోప్రా (190 బంతుల్లో 110; 16 ఫోర్లు, 1 సిక్స్‌) అద్భుత శతకంతో చెలరేగగా, ప్రియాన్షు ఖండూరి (202 బంతుల్లో 59; 5 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. హైదరాబాద్‌ బౌలర్లలో రవికిరణ్, టి. రవితేజ, మెహిదీ హసన్, తనయ్‌ త్యాగరాజన్‌ తలా ఓ వికెట్‌ దక్కించుకున్నారు. అయితే తొలి రోజు ఆటలో హైదరాబాద్‌ బౌలర్లు మొత్తం 25 మెయిడెన్‌ ఓవర్లు వేయడం విశేషం.  

అదరగొట్టిన ఓపెనింగ్‌ జోడీ...

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న హిమాచల్‌ ప్రదేశ్‌కు అద్భుత ఆరంభం దక్కింది. ఓపెనర్లు ప్రియాన్షు, ప్రశాంత్‌ చోప్రా చక్కని సమన్వయంతో పరుగులు రాబట్టారు. చోప్రా వేగంగా ఆడుతూ స్ట్రయిక్‌ రొటేట్‌ చేయగా, ఖండూరి అతనికి సహకారం అందించాడు. దీంతో 16 ఓవర్లలోనే హిమాచల్‌ ప్రదేశ్‌ స్కోరు 50 పరుగులకు చేరింది. ఈ క్రమంలో 65 బంతుల్లోనే చోప్రా అర్ధసెంచరీ సాధించాడు. వీరిద్దరూ నిలకడగా రాణించడంతో 107/0 స్కోరుతో హిమాచల్‌ ప్రదేశ్‌ లంచ్‌ విరామానికెళ్లింది. అనంతరం మరింత దూకుడు పెంచిన హిమాచల్‌ ప్రదేశ్‌ ఆటగాళ్లు ప్రియాన్షు 145 బంతుల్లో 50 పరుగులు, ప్రశాంత్‌ 174 బంతుల్లో సెంచరీని పూర్తి చేసుకున్నారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 178 పరుగులు జోడించాక తనయ్‌ బౌలింగ్‌లో ముదస్సర్‌కు క్యాచ్‌ ఇచ్చి చోప్రా పెవిలియన్‌ చేరాడు. తర్వాత వచ్చిన అంకుశ్‌ బైన్స్‌ (13; 1 ఫోర్, 1 సిక్స్‌) త్వరగానే ఔటయ్యాడు. మరికొద్దిసేపటికే క్రీజులో పాతుకు పోయిన ప్రియాన్షుని రవికిరణ్‌ ఔట్‌ చేశాడు. ఇన్నింగ్స్‌ చివరి బంతికి నిఖిల్‌ గాంగ్ట (21; 1 ఫోర్, 1 సిక్స్‌)ను రవితేజ పెవిలియన్‌ పంపడంతో హైదరాబాద్‌ ఖాతాలో నాలుగో వికెట్‌ చేరింది. ప్రస్తుతం సుమీత్‌ వర్మ (60 బంతుల్లో 8, 1 ఫోర్‌) క్రీజులో ఉన్నాడు.  

స్కోరు వివరాలు
హిమాచల్‌ ప్రదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌: ప్రియాన్షు ఖండూరి (సి) సుమంత్‌ (బి) రవికిరణ్‌ 59; ప్రశాంత్‌  చోప్రా (సి) ముదస్సర్‌ (బి) తనయ్‌ 110; అంకుశ్‌ బైన్స్‌ (సి) సుమంత్‌ (బి) మెహిదీ హసన్‌ 13; నిఖిల్‌ గాంగ్ట (బి) రవితేజ 21; సుమీత్‌ వర్మ బ్యాటింగ్‌ 8; ఎక్స్‌ట్రాలు 20; మొత్తం (90 ఓవర్లలో 4 వికెట్లకు) 231.
వికెట్ల పతనం: 1–178, 2–199, 3–205, 4–231.
బౌలింగ్‌: రవికిరణ్‌ 15–5–33–1, ముదస్సర్‌ 14–2–35–0, రవితేజ 13–2–53–1, మెహిదీహసన్‌ 23–8–48–1, తనయ్‌ 25–8–55–1.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top