నాకు సహాయం చేయరా ప్లీజ్‌! 

Please do not help me! - Sakshi

బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ 12 ర్యాంకర్‌ బీవెన్‌ జాంగ్‌ నిధుల సేకరణ   

 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు పాట్లు

బీవెన్‌ జాంగ్‌... ఈ ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీలో జరిగిన ఇండియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ క్వార్టర్‌ ఫైనల్లో సైనా నెహ్వాల్‌ను, ఫైనల్లో పీవీ సింధును ఓడించి విజేతగా నిలిచిన అమెరికా షట్లర్‌. అంతకుముందు 2016 ఫ్రెంచ్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌లో కూడా ఆమె రన్నరప్‌గా నిలిచింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అత్యుత్తమంగా 9వ ర్యాంక్‌కు చేరిన ఆమె ప్రస్తుతం 12వ ర్యాంక్‌లో ఉంది. జులై 30 నుంచి జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌కు ఇటీవలే బీవెన్‌ అర్హత సాధించింది. అయితే ఈ టోర్నీకి సన్నద్ధమయ్యేందుకు, ఇతర ఖర్చులకు తన వద్ద తగినన్ని డబ్బులు లేవంటూ ఆమె డబ్బులు సేకరించేందుకు సిద్ధమైంది. ‘గో ఫండ్‌ మి’ అనే సైట్‌ ద్వారా తనకు సహాయం చేయమంటూ ఆమె అభ్యర్థిస్తోంది. ఈ వెబ్‌సైట్‌లో తన గురించి తాను పరిచయం చేసుకున్న బీవెన్‌... శిక్షణ, విమాన టికెట్లు, హోటల్, టోర్నమెంట్‌ రిజిస్ట్రేషన్‌ కోసం తనకు డబ్బులు కావాలని విజ్ఞప్తి చేస్తోంది. కనీసం 5,500 డాలర్లు (రూ. సుమారు 3.68 లక్షలు) కావాలని ఆమె అడిగింది. దీనికి స్పందించిన కొందరు అభిమానులు 10 డాలర్ల నుంచి 100 డాలర్ల వరకు పంపిస్తే తొలి రోజు ఆమె ఖాతాలో 1641 డాలర్లు (రూ. సుమారు 1.10 లక్ష) చేరాయి. 

బీవెన్‌ జాంగ్‌ నేపథ్యం ఆసక్తికరం. చైనాలో పుట్టిన ఈమె అక్కడి తీవ్ర పోటీలో ఎదగలేనని భావించి 13 ఏళ్ల వయసులో సింగపూర్‌కు వెళ్లిపోయింది. సింగపూర్‌ తరఫున అనేక విజయాలు సాధించి అక్కడ నంబర్‌వన్‌గా గుర్తింపు తెచ్చుకున్న తర్వాత ఐదేళ్ల క్రితం అమెరికాకు వలస వెళ్లి అదే దేశం నుంచి పోటీల్లో పాల్గొనడం ప్రారంభించింది. మారిన బీడబ్ల్యూఎఫ్‌ నిబంధనల ప్రకారం యూఎస్‌ పాస్‌పోర్ట్‌ లేకపోయినా తొలిసారి అమెరికా తరఫున వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే అవకాశం లభించింది. అమెరికాలో బ్యాడ్మింటన్‌లో పెద్దగా గుర్తింపు లేకపోవడంతో బీవెన్‌కు కోచ్, మేనేజర్, ఫిజియో సౌకర్యం, అక్కడి ప్రభుత్వం నుంచి సహాయం లేదు. దాంతో సొంత డబ్బులతోనే ఆమె ఒంటరిగా ప్రతీ టోర్నీకి హాజరవుతూ ఉంటుంది. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ స్నేహితుల ఇళ్లల్లో ఉంటుంది. ఒకే ఒక పార్ట్‌నర్‌తో ఆమె యూఎస్‌లో సాధన చేస్తూ వచ్చింది. ఇండియా ఓపెన్‌తో పాటు బీవెన్‌ ఖాతాలో ఒక గ్రాండ్‌ప్రి గోల్డ్‌ టోర్నీ, ఆరు గ్రాండ్‌ప్రి టోర్నీ విజయాలు ఉన్నాయి. ఆధునిక బ్యాడ్మింటన్‌లో పెద్దగా గుర్తింపు లేని యువ షట్లర్లకు కూడా ఎంతో మంది అండగా నిలుస్తున్న చోట వరల్డ్‌ 12 ర్యాంకర్‌కు కనీస స్పాన్సర్‌ లేకపోవడం ఆశ్చర్యమే కాదు... జనాన్ని డబ్బులు కోరితే తప్ప ఆడలేని పరిస్థితి ఉండటం విషాదం కూడా!    

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top