ఎలీస్‌ పెర్రీ డబుల్‌ సెంచరీ

Perry double puts hosts in charge - Sakshi

సిడ్నీ: ఇంగ్లండ్‌ మహిళల జట్టుతో జరుగుతున్న మహిళల యాషెష్‌ సిరీస్‌ ఏకైక టెస్టులో ఆస్ట్రేలియా క్రికెటర్‌ ఎలీస్‌ పెర్రీ (374 బంతుల్లో 213 నాటౌట్‌; 27 ఫోర్లు, ఒక సిక్స్‌) డబుల్‌ సెంచరీతో అదరగొట్టింది. మూడో రోజు ఓవర్‌నైట్‌ వ్యక్తిగత స్కోరు 70 పరుగులతో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన పెర్రీ 226 బంతుల్లో సెంచరీని... 370 బంతుల్లో డబుల్‌ సెంచరీని పూర్తి చేసుకుంది.

పెర్రీ అద్భుత బ్యాటింగ్‌ కారణంగా ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌ను 166 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 448 పరుగులవద్ద డిక్లేర్‌ చేసి 168 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఇంగ్లండ్‌ ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టపోకుండా 40 పరుగులు సాధించింది. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 280 పరుగులకు ఆలౌటైంది.  

ఏడో క్రికెటర్‌గా...
ఈ మ్యాచ్‌కు ముందు ఎలీస్‌ పెర్రీ కెరీర్‌లో ఆరు టెస్టులు ఆడి మొత్తం 219 పరుగులే చేసింది. కానీ ఈ ఒక్క మ్యాచ్‌లోనే ఆమె 213 పరుగులు చేయడం విశేషం. ఈ క్రమంలో మహిళల టెస్టు క్రికెట్‌లో డబుల్‌ సెంచరీ చేసిన ఏడో క్రికెటర్‌గా ఆమె గుర్తింపు పొందింది. గతంలో కిరణ్‌ బలూచ్‌ (242–పాకిస్తాన్‌; విండీస్‌పై 2004లో), మిథాలీ రాజ్‌ (204–భారత్‌; ఇంగ్లండ్‌పై 2002లో), కరెన్‌ రోల్టన్‌ (209 నాటౌట్‌–ఇంగ్లండ్‌; ఆస్ట్రేలియాపై 2001లో), మిచెల్లి గోస్‌కో (204–ఆస్ట్రేలియా; ఇంగ్లండ్‌పై 2001లో), కిర్‌స్టీ బాండ్‌ (204–న్యూజిలాండ్‌; ఇంగ్లండ్‌పై 1996లో), జోనీ బ్రాడ్‌బెంట్‌ (200–ఆస్ట్రేలియా; ఇంగ్లండ్‌పై 1998లో) ఈ ఘనత సాధించారు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top