రూ. 452 కోట్లు ఇప్పించండి

PCB complains to India on ICC - Sakshi

భారత్‌పై ఐసీసీకి పీసీబీ ఫిర్యాదు

లాహోర్‌:  ఇరు దేశాల మధ్య నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో భారత్‌తో ఇప్పట్లో ద్వైపాక్షిక సిరీస్‌లు జరిగే అవకాశం లేకపోవడంతో పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) కనీసం నష్టపరిహారమైనా రాబట్టుకోవాలని పట్టుదలగా ఉంది. ఆ దిశగా వరుసగా విఫల ప్రయత్నాలు చేసిన పాక్‌.. చివరకు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ)ని ఆశ్రయించింది. ‘ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడించండి లేదా మాకు బీసీసీఐ నుంచి రూ. 452 కోట్ల నష్టపరిహారాన్ని ఇప్పించండి’ అని పాక్‌ బోర్డు ఐసీసీని కోరింది. కొంతకాలంగా వివిధ వేదికలపై తన నిరసన తెలుపుతున్న పీసీబీ ప్రయోగిస్తున్న చిట్టచివరి అస్త్రం ఇది. 2014 నవంబర్, 2015 డిసెంబర్‌లో రెండుసార్లు భారత–పాకిస్తాన్‌ దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌కోసం బీసీసీఐ–పీసీబీ అంగీకరించాయి. ఈ మేరకు 2014 ఏప్రిల్‌లో ఇరుబోర్డుల మధ్య ఒప్పందం కుదిరింది. దీంతోపాటుగా 2015 డిసెంబర్‌ నుంచి 2022 డిసెంబర్‌ వరకు ఆరు సిరీస్‌లు ఆడాలని ఈ ఒప్పందంలో ఉంది. 

వివిధ కారణాలతో ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతినటంతో క్రికెట్‌ సిరీస్‌లు అటకెక్కాయి. అయితే బీసీసీఐ తీరు కారణంగానే సిరీస్‌లు రద్దయ్యాయని పీసీబీ వాదిస్తోంది. దీని కారణంగా తాము 70 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.452కోట్లు) నష్టపోయామంటూ ఐసీసీకి చేసిన ఫిర్యాదులో పేర్కొంది. ఇందుకోసం 2014 ఏప్రిల్‌లో కుదుర్చుకున్న ఒప్పందాన్నీ తెరపైకి తెచ్చింది. ఇటీవల చాలాసార్లు ఇరుబోర్డుల ప్రతినిధులు కలిసి చర్చించినప్పటికీ ఫలితం తేలలేదు. మరో వైపు 2018 క్యాలెండర్‌ను నిర్ణయించేందుకు డిసెంబర్‌ 7న ఐసీసీ సమావేశం కానున్న నేపథ్యంలో బీసీసీఐ తమతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని గౌరవిస్తేనే ఈ క్యాలెండర్‌ మార్పులపై సంతకం చేస్తామ ని హెచ్చరించింది. మరో వైపు భారత మాజీ కెప్టెన్‌ బిషన్‌ సింగ్‌ బేడీ మాట్లాడుతూ...‘క్రికెట్‌ను ఎందుకు రాజకీయం చేస్తారు? క్రికెట్‌ ఆడకపోవటం ద్వారా ఉగ్రవాదాన్ని అంతం చేశారా?  అని ఆయన ప్రశ్నించారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top