పంత్‌ను కొనసాగించడానికి అదే కారణం: గంభీర్‌

Pant Needs To Be More Consistent With The Bat, Gambhir - Sakshi

న్యూఢిల్లీ: టీమిండియా యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ మరింత నిలకడైన ప్రదర్శన చేయాలని మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ సూచించాడు. అప్పుడడప్పుడు మాత్రమే మెరుస్తున్న పంత్‌ సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడే విషయంపై దృష్టి పెట్టాలన్నాడు. సెలక్టర్లు పెట్టుకున్న నమ్మకాన్ని పంత్‌ నిలబెట్టుకోవాలన్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో పంత్‌ 71 పరుగులు  సాధించి వన్డే ఫార్మాట్‌లో తన తొలి అర్థ శతకాన్ని నమోదు చేశాడు. ఈ నేపథ్యంలో గంభీర్‌ మాట్లాడుతూ.. ‘ ఎంఎస్‌ ధోని ఎంత నిలకడగా జట్టు అవసరాలకు తగ్గట్టు ఆడేవాడో అదే తరహాలో రాణించడానికి పంత్‌ యత్నించాలి.

ప్రధానంగా 60 నుంచి 70 పరుగుల వ్యక్తిగత స్కోరును సెంచరీగా మలచుకోవాలి. అన్ని ఫార్మాట్లలో పంత్‌ను టీమిండియా మేనేజ్‌మెంట్‌ ఎందుకు ఎంపిక చేస్తుందో అతను అర్థం చేసుకోవాలి. పంత్‌పై నమ్మకంతోనే అన్ని ఫార్మాట్లలో పంత్‌కు అవకాశాలు ఇస్తుంది. ఇటీవల కాలంలో టెస్టు తుది జట్టులో  పంత్‌ ఆడనప్పటికీ కనీసం రిజర్వ్‌ ఆటగాడిగానైనా పంత్‌ను కొనసాగిస్తుంది. అందుకు కారణం పంత్‌పై ఉన్న విపరీతమైన నమ్మకమే కారణం. దాన్ని కాపాడుకోవాలి. ఇక్కడ భారీ సెంచరీలు అవసరం లేదు.. ఎక్కువ సమయం క్రీజ్‌లో ఉండటానికి యత్నించాలి’ అని గంభీర్‌ తెలిపాడు.

ఎంఎస్‌ ధోని వారసుడిగా జట్టులోకి వచ్చిన అనతి కాలంలోనే పంత్‌ ఆకట్టుకున్నప్పటికీ తర్వాత కాలంలో విఫలమై విమర్శల పాలయ్యాడు. వరుస వైఫల్యాల తర్వాత వెస్టిండీస్‌తో మొదటి వన్డేలో పంత్‌ కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. శ్రేయస్‌ అయ్యర్‌తో కలిసి 114 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top