సమరానికి ముందే సవాళ్లు 

Pace bowling is weakening and the implications for the team - Sakshi

పేస్‌ బలహీనపడటంతో టీమిండియాకు చిక్కులు

ఇషాంత్‌ త్రయం ఏం చేస్తుందో?

ఇంగ్లండ్‌ గడ్డపై  బ్యాట్స్‌మెన్‌పైనే పూర్తి భారం

మొన్నటివరకు గెలుపుపై కొంత ఆశలున్నాయి. నిన్నటివరకు పోటా పోటీ ఖాయమనిపించింది. ఇప్పుడు మాత్రం ఒక్కసారిగా ఓ విధమైన నిరుత్సాహం! ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌కు ముందు భారత జట్టు పరిస్థితిది. వన్డే సిరీస్‌ను చేజార్చుకున్న ఫలితమో, కీలక పేసర్లు భువనేశ్వర్, బుమ్రా దూరమైన ప్రభావమో కాని ప్రత్యర్థితో పోలిస్తే బలాబలాల్లో టీమిండియాది ఓ అడుగు వెనుకే అనిపిస్తోంది. ఒక్కసారిగా ఎందుకీ నిర్వేదం? తేడా ఎక్కడ వచ్చింది? కోహ్లి సేన ముందున్న సవాళ్లేమిటి?  

సాక్షి క్రీడా విభాగం : సన్నాహాల సంగతి పక్కన బెడితే... సుదీర్ఘ టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియాకు శకునమే సరిగా లేనట్లుంది. ఐర్లాండ్‌తో రెండు టి20లు, ఇంగ్లండ్‌తో టి20, వన్డే సిరీస్‌ల కోసం చాలా ముందుగానే ప్రత్యర్థి గడ్డపై అడుగిడినా, అసలు సిసలు లక్ష్యమైన టెస్టు సిరీస్‌కు వచ్చేసరికి కోహ్లి సేనకు చిక్కులు ఎదురవుతున్నాయి. ఇంగ్లిష్‌ వాతావరణం ఆకళింపు సంగతి అటుంచి, ఆరంభ మ్యాచ్‌లకు ఎంతో కీలకమైన ఇద్దరు ప్రధాన పేసర్ల సేవలను కోల్పోయి మానసికంగా వెనుకబడింది. ఎప్పటిలానే బలమైన బ్యాటింగ్‌ లైనప్‌నకు తోడు పదునైన బౌలింగ్‌తో మొన్నటి వరకు సమతూకంగా కనిపించిన జట్టు... ఇప్పుడు పూర్తిగా బ్యాటింగ్‌నే నమ్ముకోవాల్సిన స్థితికి వచ్చింది. ఇందులో కొంత స్వయంకృతం కాగా మరికొంత  దురదృష్టం. ఈ నేపథ్యంలో మన బ్యాట్స్‌మెన్‌ స్వింగ్‌కు ఎదురునిలిచి... షమీ, ఇషాంత్‌ శర్మ, ఉమేశ్‌ యాదవ్‌ త్రయం పేస్‌ ప్రతాపం చూపితేనే ప్రారంభ విఘ్నాల నుంచి గట్టెక్కగలం! 

కౌంటీ అనుభవం అక్కరకొస్తుందా? 
మిగతా ఏ దేశంలోనూ లేనివిధంగా ముందుగానే వెళ్లి పిచ్‌లకు అలవాటు పడే అవకాశం ఇంగ్లండ్‌లో కౌంటీల రూపంలో లభిస్తుంది. చేదు జ్ఞాపకాలను మర్చిపోయేందుకు కోహ్లి స్థాయి ఆటగాడే దీనిని వినియోగించుకోవాలని భావించాడు. చివరకు తాను వైదొలగినా టీమిండియా అడ్డుగోడ పుజారా, ప్రధాన పేసర్‌ ఇషాంత్‌ శర్మ ప్రాతినిధ్యం వహించారు. యార్క్‌షైర్‌ తరఫున పుజారా ఒక సెంచరీ, రెండు అర్ధ సెంచరీలతో ప్రారంభ మ్యాచ్‌ల్లో మెరిశాడు. అయితే ఇవి లిస్ట్‌ ‘ఎ’ (దేశవాళీ వన్డే) మ్యాచ్‌లు. తర్వాత నాలుగు ఫస్ట్‌క్లాస్‌ ఇన్నింగ్స్‌ (నాలుగు రోజుల మ్యాచ్‌లు) సహా, నాలుగు లిస్ట్‌ ‘ఎ’ ఇన్నింగ్స్‌ల్లో కనీసం అర్ధ శతకం కూడా చేయలేకపోయాడు. ఇందులో మరీ ముఖ్యంగా రెండు ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌ల్లో తన స్కోర్లు 0, 32, 23, 17 కావడం గమనార్హం. ససెక్స్‌కు ఆడిన పేసర్‌ ఇషాంత్‌ మాత్రం ఫర్వాలేదనిపించాడు. మూడు ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ల్లో 10, ఆరు లిస్ట్‌ ‘ఎ’ మ్యాచ్‌ల్లో 8 వికెట్లు పడగొట్టాడు. ఇక ఓపెనర్‌ మురళీ విజయ్‌ భారత్‌ ‘ఎ’ జట్టు తరఫున ఇంగ్లండ్‌ ‘ఎ’పై ఆడినా వైఫల్యమే ఎదురైంది. తొలి ఇన్నింగ్స్‌లో 8 పరుగులకే వెనుదిరిగాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఖాతానే తెరవలేదు. ఇక్కడ ఉపశమనం కలిగించే అంశం ఏమంటే ఇదే మ్యాచ్‌లో ‘ఎ’ జట్టు తరఫున ఆడిన అజింక్య రహానే 49, 48 పరుగులతో రాణించడం. మరోవైపు టి20లు, వన్డేలతో కోహ్లి సహా మిగతా బ్యాట్స్‌మెన్‌ ఫామ్‌ ఎలా ఉందో తెలిసొచ్చింది. సాధికారికంగా ఆడుతూ కెప్టెన్‌ ఆశావహంగానే కనిపించాడు. అయితే, ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ ఔటవుతున్న తీరు విమర్శకులకు పని కల్పిస్తోంది. ఇంగ్లండ్‌తో రెండో టి20లో, మంచి టచ్‌లో ఉండి కూడా సిరీస్‌ ఫలితం తేల్చే మూడో వన్డేలో పేలవంగా రనౌటయ్యాడు. ఈ లోపాన్ని సవరించుకుని విజయ్‌తో కలిసి తను మంచి ప్రారంభం అందించాల్సిన అవసరం ఉంది. తర్వాత పుజారా, కోహ్లి, రహానే, దినేశ్‌ కార్తీక్‌ తలో చేయి వేసినా సరిపోతుంది. లేదంటే, పరాజయంతో పాటు పరాభవమూ తప్పదు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top