టీమిండియా కోచ్‌కు కొత్త నిబంధనలు!

Next India Head Coach Should Be Below 60 and Have Minimum Two Year International Experience - Sakshi

ముంబై : టీమిండియా హెడ్‌ కోచ్‌, సహాయక బృందానికి భారత క్రికెట్‌ నియంత్ర మండలి(బీసీసీఐ) దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ సారి కొత్తగా వయసు, అనుభవం నిబంధనలు తీసుకొచ్చింది. అభ్యర్థులకు కనీసం రెండేళ్ల అంతర్జాతీయ అనుభవంతో పాటు 60 ఏళ్ల వయసు మించరాదని పేర్కొంది. ప్రధాన కోచ్‌ సహా బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌, బౌలింగ్‌, స్ట్రెంగ్త్‌ అండ్‌ కండీషనింగ్‌ కోచ్‌, ఫిజియో థెరపిస్టు, అడ్మినిస్ట్రేటివ్‌ మేనేజర్‌ను తిరిగి నియమించుకోనుంది. జులై 30, సాయంత్రం ఐదు గంటల్లోగా దరఖాస్తులు అందజేయాలని సూచించింది. అయితే ప్రస్తుతం కొనసాగుతున్న కోచింగ్‌ బృందానికి నియామకాల ప్రక్రియలో నేరుగా ప్రవేశం ఉంటుందని బీసీసీఐ ప్రకటించింది. ప్రస్తుత హెడ్‌కోచ్‌ రవిశాస్త్రిని నియమించక ముందు 2017 జులైలో కోచ్‌ల ఎంపికకు తొమ్మిది మార్గదర్శకాలు నిర్దేశించిన ఇదే బీసీసీఐ.. వాటిపై దృష్టి పెట్ట‍కపోగా స్పష్టతనూ ఇవ్వలేదు. ఈ సారి అలా కాకుండా అన్ని పదవులకు కేవలం మూడు మార్గదర్శకాలనే నిర్దేశించింది. 

హెడ్‌ కోచ్‌ అభ్యర్థికి టెస్టు హోదా కలిగిన దేశానికి కనీసం రెండేళ్లు కోచ్‌గా చేసిన అనుభవం లేదా అసోసియేట్‌ సభ్యదేశం/ ఏ-జట్టు/ఐపీఎల్‌ జట్టుకు మూడేళ్లు పనిచేసిన అనుభవం ఉండాలని పేర్కొంది. అలాగే కనీసం 30 టెస్టులు లేదా 50 వన్డేలు ఆడిన అనుభవం కూడా అవసరమని సూచించింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ కోచ్‌లకూ కూడా పై నిబంధనలే వర్తిస్తాయని, కానీ ఆడిన మ్యాచ్‌ల సంఖ్యను మాత్రం తగ్గించింది. 10 టెస్టులు లేక 25 వన్డేలు ఆడిన అనుభవం ఉంటే సరిపోతుందని, వయసు 60కు మించరాదని పేర్కొంది.

ప్రస్తుత హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి, బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌, బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌, ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్‌ శ్రీధర్‌కు ప్రపంచకప్‌ ముగిసే నాటికి పదవీకాలం ముగిసింది. అయితే వెస్టిండీస్‌ సిరీస్‌ను దృష్టిలో పెట్టుకొని బీసీసీఐ వీరికి 45 రోజుల గడువును పెంచింది. వీరంతా కోచ్‌ బృందంలో చేరే అవకాశం ఉన్నప్పటికీ.. ప్రపంచకప్‌ నిష్క్రమణ అనంతరం ఫిజియో ప్యాట్రిక్‌ ఫర్హార్ట్‌, స్ట్రెంగ్త్‌ అండ్‌ కండీషనింగ్‌ కోచ్‌ శంకర్‌ బసు వెళ్లిపోవడంతో వారి స్థానాల్లో కొత్తవారు రానున్నారు. అయితే 60 ఏళ్ల వయసు నిబంధన ప్రస్తుత కోచ్‌ రవిశాస్త్రి పదవికి ఎసరుపెట్టనుంది. ప్రస్తుతం అతని వయసు 57 ఏళ్లు కాగా శాస్త్రిని ఎంపిక చేస్తే 2023 ప్రపంచకప్‌ వరకు కొనసాగిస్తారా లేదా అనే విషయంపై స్పష్టత రావాల్సుంది. వివాదస్పద రీతిలో కోచ్‌ బాధ్యతల నుంచి అనిల్‌ కుంబ్లే తప్పుకున్న అనంతరం 2017లో రవిశాస్త్రి భారత హెడ్‌కోచ్‌గా నియమితులైన విషయం తెలిసిందే. అయితే అతని పర్యవేక్షణలో భారత ప్రపంచకప్‌ సాధించలేకపోయింది. కానీ ఆస్ట్రేలియా గడ్డపై ఈ ఏడాది తొలి టెస్ట్‌సిరీస్‌ నెగ్గింది. రవిశాస్త్రి 2014-2016లో టీమిండియా డైరెక్టర్‌గా కూడా పనిచేశారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top