టాస్‌ ఓడిన టీమిండియా..

New Zealand Won The Toss Elected To Bat First In Semis Against India - Sakshi

మాంచెస్టర్‌: వన్డే వరల్డ్‌కప్‌లో ఫేవరెట్‌ జట్లలో ఒకటిగా బరిలోకి దిగిన టీమిండియా తమ అంచనాలను నిజం చేస్తూ సెమీ ఫైనల్‌ పోరుకు సిద్ధమైంది.  ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ మైదానంలో మంగళవారం జరుగుతున్న మ్యాచ్‌లో భారత జట్టు.. న్యూజిలాండ్‌తో తలపడనుంది. లీగ్‌ దశలో ఈ రెండు జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయింది. దీంతో ఈ వరల్డ్‌కప్‌లో ఎవరిది పైచేయో ఈ పోరులో తేలనుంది. భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌ పటిష్ఠంగా కనిపిస్తున్నా, ఎప్పటి లాగే మిడిలార్డర్‌ బలహీనత వెంటాడుతోంది. కివీస్‌ను ఎదుర్కోవాలంటే మాత్రం అలసత్వం పనికిరాదు. మూకుమ్మడిగా భారత్‌ ఎదురుదాడికి దిగాలి. 

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన కివీస్‌ ముందుగా బ్యాటింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన వెంటనే న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ మరో మాట లేకుండా బ్యాటింగ్‌ చేసేందుకు మొగ్గు చూపాడు. టాస్‌ గెలిస్తే భారత్‌ కూడా ముందుగా బ్యాటింగ్‌ చేసేది. ఈ విషయాన్ని టాస్‌ ఓడిన తర్వాత టీమిండియా కెప్టెన్‌ కోహ్లి స్పష్టం చేశాడు. తాము టాస్‌ గెలిచి ఉంటే తొలుత బ్యాటింగ్‌ చేసేవాళ్లమని తెలిపాడు. మరి టాస్‌ ఫలితం భారత్‌కు అనుకూలంగా రాకపోవడంతో కివీస్‌ను సాధ్యమైనంత వరకూ తక్కువ స్కోరుకే కట్టడి చేయాల్సిన బాధ్యత బౌలర్లపైనే ఉంది.( ఇక్కడ చదవండి: భారత్‌ ఫైనల్‌ చేరింది.. ఇక మా వాళ్లే)

తాజా ప్రపంచకప్‌లో ఇప్పటిదాకా భారత బ్యాటింగ్‌ బలమంతా టాపార్డర్‌ అనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రధానంగా తొలి పది ఓవర్లలో కోహ్లి గ్యాంగ్‌ నిదానంగా బ్యాటింగ్‌ చేస్తోంది. క్రీజ్‌లో కుదురుకున్న తర్వాత ఓపెనర్‌ రోహిత్‌ శర్మ దూకడు ప్రత్యర్థులను భయపెడుతోంది. ఇప్పటివరకూ రోహిత్‌ ఐదు శతకాల సాయంతో 647 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా ఉన్నాడు. కివీస్‌పైనా కూడా రోహిత్‌ ఆడితే భారత్‌ పైచేయి సాధించే అవకాశం ఉంది.  ఇక కెప్టెన్‌ కోహ్లి నుంచి భారీ ఇన్నింగ్స్‌ బాకీ ఉంది. వరుసగా ఐదు అర్ధసెంచరీలు సాధించినా శతకంగా మలచలేకపోయాడు. ఈ మ్యాచ్‌లోనైనా మిడిలార్డర్‌ మెరుగుపడాలని ప్రతీ అభిమాని కోరుకుంటున్నాడు. అన్నింటికీ మించి డెత్‌ ఓవర్లలో ధోని మునుపటి ఫామ్‌ను అందుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.

ఇక కాగితంపై పటిష్ఠంగానే కనిపిస్తున్న కివీస్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ ఈ టోర్నీలో మాత్రం దారుణంగా విఫలమవుతోంది, ఓపెనర్లు గప్టిల్‌, మన్రో రాణించలేకపోతున్నారు. మన్రో స్థానంలో వచ్చిన నికోల్స్‌ది కూడా అదే దారి. కెప్టెన్‌ విలియమ్సన్‌ ఒక్కడే ఆపద్బాంధవుడి పాత్ర పోషిస్తున్నాడు. మరొకవైపు కీలక ఆటగాడు రాస్‌ టేలర్‌ వైఫల్యం చివరి 3మ్యాచ్‌ల్లో ఆ జట్టుకు ప్రతికూల ఫలితాన్నిచ్చింది. అయితే బౌలర్లు మాత్రం ఆశలు రేకెత్తిస్తున్నారు. ముఖ్యంగా 11-40 ఓవర్ల మధ్యలో అత్యంత పొదుపుగా పరుగులిచ్చి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశారు. బౌల్ట్‌, ఫెర్గూసన్‌, హెన్రీ త్రయం తమ పేస్‌తో అదరగొడుతున్నారు.

ఇప్పటిదాకా కివీస్‌ ఏడుసార్లు ప్రపంచకప్‌ సెమీస్‌ ఆడితే.. ఒక్కసారే (2015) గెలిచింది. భారత్‌ ఆరుసార్లు సెమీస్‌లో ఆడి మూడుసార్లు నెగ్గింది. ఓవరాల్‌గా ఇరు జట్ల మధ్య 101 వన్డేలు జరగ్గా అందులోభారత్‌ 55 విజయాలు సాధించగా, కివీస్‌ 45 విజయాలు అందుకుంది. ఒక మ్యాచ్‌ టైగా ముగిసింది. ప్రస్తుతం సెమీస్‌ చేరాలన్న లక్ష్యాన్ని టీమిండయా సునాయాసంగానే సాధించగా, అసలు సిసలైన నాకౌట్‌ సమరంలో సత్తా చాటి ఫైనల్‌ లక్ష్యాన్ని చేరుతుందని ఆశిద్దాం.

తుది జట్లు

భారత్‌
విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, రోహిత్‌ శర్మ, రిషభ్‌ పంత్‌, హార్దిక్‌ పాండ్యా, ఎంఎస్‌ ధోని, దినేశ్‌ కార్తీక్‌, రవీంద్ర జడేజా, భువనేశ్వర్‌ కుమార్‌, బుమ్రా, చహల్‌

న్యూజిలాండ్‌
కేన్‌ విలియమ్సన్‌(కెప్టెన్‌), మార్టిన్‌ గప్టిల్‌, హెన్రీ నికోలస్‌, రాస్‌ టేలర్‌, టామ్‌ లాథమ్‌, జేమ్స్‌ నీషమ్‌, గ్రాండ్‌ హోమ్‌, మిచెల్‌ సాంత్నార్‌, ఫెర్గ్యుసన్‌, మ్యాట్‌ హెన్రీ, ట్రెంట్‌ బౌల్ట్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top