మంధాన మెరిసినా.. ఓడిన భారత్‌

New Zealand Womens Won by 23 runs Against India - Sakshi

అర్థ సెంచరీతో రాణించిన స్టార్‌ ఓపెనర్‌

మిగతా బ్యాటర్స్‌ దారుణ వైఫల్యం

గెలిచే మ్యాచ్‌లో ఓడిన భారత్‌

వెల్లింగ్టన్‌ : గెలిచే మ్యాచ్‌ను భారత మహిళలు చేజేతులారా చేజార్చుకున్నారు. బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో భారత మహిళలు 23 పరుగుల తేడాతో ఓటమిపాలయ్యారు. భారత స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన (58:34 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఫస్ట్‌ డౌన్‌ బ్యాటర్‌ జెమీమా రోడ్రిగ్స్‌ (39: 33 బంతుల్లో 6 ఫోర్లు)లు రాణించినప్పటికి మిగతా బ్యాటర్స్‌ దారుణంగా విఫలమవ్వడంతో.. భారత మహిళలు గెలిచే మ్యాచ్‌లో ఓటమి పాలయ్యారు. 160 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక 136 పరుగులకే ఆలౌట్‌ అయ్యారు.

అంతకు ముందు టాస్‌ గెలిచిన భారత్‌ ఫీల్డింగ్‌ ఎంచుకోంది. ఈ మ్యాచ్‌ ద్వారా అంతర్జాతీయ టీ20ల్లోకి ప్రియా పూనియా అరంగేట్రం చేయగా.. సీనియర్‌ క్రికెటర్‌ మిథాలీ రాజ్‌కు తుదిజట్టులో అవకాశం దక్కలేదు. తొలుత బ్యాటింగ్‌ చేసిన కివీస్‌.. డెవైన్‌ (62), కెప్టెన్‌ సట్టెర్‌వెయిట్‌ (33), కేజే మార్టిన్‌(27)లు రాణించడంతో ​నిర్ణీత 20 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. భారత మహిళల్లో అరుంధతి రెడ్డి, రాధా యాదవ్‌, పూనమ్‌ యాదవ్‌, దీప్తి శర్మలకు తలో వికెట్‌ దక్కింది.

మెరిసిన మంధాన..
160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హర్మన్‌ సేనకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. అరంగేట్ర బ్యాటర్‌ ప్రియా(4) తీవ్రంగా నిరాశపర్చింది. అనంతరం జెమీమాతో కలిసి స్టార్‌ ఓపెనర్‌ మంధాన చెలరేగింది. 24 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో వేగవంతమైన అర్థ సెంచరీ నమోదు చేసి అసలు సిసలు టీ20 మజాను చూపించింది. రెండో వికెట్‌కు 98 పరుగుల జోడించిన అనంతరం అద్భుత క్యాచ్‌కు​ మంధాన (58:34 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) వెనుదిరిగింది. ఆ సమయం జట్టు స్కోర్‌ 102 పరుగుల కాగా.. భారత విజయానికి 51 బంతుల్లో 58 పరుగులే అవసరం. ఈ పరిస్థితుల్లో భారత విజయం లాంఛనమేనని అందరూ భావించారు. కానీ కివీస్‌ బౌలర్లు చెలరేగడంతో భారత బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు.

జెమీమా రోడ్రిగ్స్‌ (38), హేమలత (3), అనూజ పాటిల్‌(0), అరుంధతి రెడ్డి(2), హర్మన్‌ప్రీత్‌ కౌర్‌(17), దీప్తి శర్మ(5), తానియ బాటియా(1), పూనమ్‌(3)ల వికెట్లు వరుసగా కోల్పోవడంతో హర్మన్‌సేన 136 పరుగులకే కుప్పకూలింది. కివీస్‌ బౌలర్లలో తాహుహు 3 వికెట్లతో చెలరేగగా.. కస్పెరెక్‌, కేర్‌లు రెండేసి వికెట్లు పడగొట్టారు. డివైన్‌, మేర్‌, సట్టర్‌వైట్‌లకు తలో వికెట్‌ దక్కింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top