కేఎల్‌ రాహుల్‌.. ఇక చాలు!

Netizens Urge BCCI To Drop Rahul After Failure - Sakshi

పెర్త్‌: టీమిండియా క్రికెట్‌ జట్టులో వరుసగా వైఫల్యంగా చెందుతూ ఇంకా జట్టులో కొనసాగుతున్న ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే అది కేఎల్‌ రాహుల్‌ మాత్రమే. ఓపెనర్‌గా దిగి ఒక మంచి భాగస్వామ్యాన్ని జట్టుకు అందించడంలో రాహుల్‌ సక్సెస్‌ కాలేకపోతున్నాడు. ఎక్కడో అడపా దడపా ఇన్నింగ్స్‌లు తప్పితే రాహుల్‌ ఆత్మవిశ్వాసంతో చేసిన పరుగులు ఇటీవల కాలంలో దాదాపు లేవనే చెప్పాలి. గత 11 ఇన్నింగ్స్‌ల్లో రాహుల్‌ ఎల్బీడబ్యూలు, బౌల్డ్‌ రూపంలో తొమ్మిదిసార్లు నిష్ర్కమించడం అతని ఫుట్‌వర్క్‌ సరిగా లేదనడానికి అద్దం పడుతోంది.

తాజాగా ఆస్ట్రేలియాతో పెర్త్‌లో జరుగుతున్న రెండో టెస్టులో రాహుల్‌ మరోసారి నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో రాహుల్‌(2) బంతిని అంచనా వేయడంలో పొరబడి వికెట్‌ను సమర్పించుకున్నాడు. హజల్‌వుడ్‌ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. ఫలితంగా మరోసారి రాహుల్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు నెటిజన్లు. ఇక రాహుల్‌ ఆట చాలు అంటూ  భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ)కి విజ్ఞప్తి చేశారు. రాహుల్‌పై విమర్శలు గుప్పించిన వాటిలో కొన్ని చూద్దాం.

‘నీ ఫుట్‌వర్క్‌ సరిగా లేదనే సంగతి తెలిసిన నువ్వు.. ఓపెనర్‌గా రావడానికి ఎలా సిద్ధమవుతున్నావ్‌’ అని ఒక అభిమాని ట్వీట్‌ చేయగా, ‘చాలా అవకాశాలు తీసుకుంటున్నావ్‌.. కానీ ప్రతీసారి విఫలమవుతూనే ఉన్నావ్‌’ అని అభిమాని మండిపడ్డాడు. మరొక అభిమాని కేఎల్‌ రాహుల్‌ చేసిన రెండు పరుగుల్ని, మురళీ విజయ్‌ డకౌట్‌గా వెనుదిరగడాన్ని ఉదహరిస్తూ..‘రాహుల్‌ ప్లస్‌ విజయ్‌ 2.0’ అంటూ సెటైర్‌ వేశాడు. టీమిండియా ఓపెనర్లు అయిన రాహుల్‌-విజయ్‌లు కనీసం ట్విట్టర్‌లోనైనా మీ ప్రతిభను చూపెట్టండి’ అంటూ మరొకరు ట్వీట్‌ చేశారు. ‘  రాహుల్‌..ఇక చాలు’ అంటూ ఒక అభిమాని అసంతృప్తి వ్యక్తం చేశాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top