ఎన్ని గెలవగలడు..?

ఎన్ని గెలవగలడు..?


►అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లపై నాదల్‌ గురి 

►ఫెడరర్, నాదల్‌ మధ్య 3 టైటిల్స్‌ తేడా




అమితంగా ఇష్టపడే ఎర్ర మట్టి ఫ్రెంచ్‌ ఓపెన్‌లో జొకోవిచ్‌ చేతిలో పరాజయం... వింబుల్డన్‌ రెండో రౌండ్‌లో క్వాలిఫయర్‌ డస్టిన్‌ బ్రౌన్‌ దెబ్బకు ఖేల్‌ ఖతం... యూఎస్‌ ఓపెన్‌ మూడో రౌండ్‌లోనే ఫాగ్‌నినీ జోరుకు ఓటమి... ఆ తర్వాత ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో వెర్డాస్కో ఆటకు తొలి రౌండ్‌లోనే ఇంటి ముఖం... 2015, 2016లో వరుసగా నాలుగు గ్రాండ్‌స్లామ్‌లలో రాఫెల్‌ నాదల్‌ ప్రదర్శనను చూస్తే ఇక అతని టెన్నిస్‌ కెరీర్‌ ముగిసినట్లే అనిపించింది. గాయాలు, వైఫల్యాలతో అతని పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారింది. 2014 ఫ్రెంచ్‌ ఓపెన్‌ తర్వాత నాదల్‌ మళ్లీ గ్రాండ్‌స్లామ్‌ సాధించడమే గగనంగా మారిపోయింది.



మణికట్టుకు, మోకాలికి జరిగిన శస్త్ర చికిత్సలు ఇక రాకెట్‌ పట్టడమే కష్టమంటున్నాయి. వరుసగా రెండేళ్ల పాటు పరాజయాలు వెంటాడిన స్థితిలో 2017 సంవత్సరం నాదల్‌కు పునరుజ్జీవనాన్ని అందించింది. ప్రపంచ టెన్నిస్‌లో తన దిగ్గజ హోదాను నిలబెట్టుకుంటూ ఈ ఏడాది ఫెడరర్‌ రెండు గ్రాండ్‌స్లామ్‌లతో చెలరేగితే... నేనేమీ తక్కువ కాదంటూ మిగతా రెండు గ్రాండ్‌స్లామ్‌లను తన ఖాతాలో వేసుకొని నాదల్‌ సత్తా చాటాడు. ఇకపై వీరిద్దరు ఒకరితో మరొకరు పోటీ పడి ఎన్ని స్లామ్‌లు గెలవగలరు... ఫెడరర్‌ను నాదల్‌    అందుకోగలడా...ఆపై అధిగమించగలడా!  




ఫెడరర్‌తో జరిగిన ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఫైనల్లో చివరి సెట్‌లో 3–1తో ఆధిక్యంలో ఉన్న దశలో వెనుకబడి నాదల్‌ మ్యాచ్‌ను, టైటిల్‌ను కోల్పోయాడు. అయితే ఈ పరాజయం అతడిని నిరాశపర్చలేదు. తనను అభిమానించే వారికి నాదల్‌ తన అసలు ఆట ఏమిటో ఆ తర్వాత చూపించాడు. ఇక పనైపోయిందనుకున్నవాడు మళ్లీ కొత్త తరహా ఆటతో కదం తొక్కాడు. క్లే కోర్టులపై తనకు ఎంత ప్రేమ ఉందో అతడు మరోసారి దానిని ప్రదర్శించాడు. వింబుల్డన్‌లో ఓడినా... హార్డ్‌కోర్ట్‌పై కూడా తాను ఎంతటి ప్రమాదకారినో యూఎస్‌ ఓపెన్‌లో ఏకపక్ష విజయాలతో నాదల్‌ నిరూపించాడు. అతని ఆటలో లోపాలు ఉండవచ్చు. కానీ పరాజయాలు ఎదురైనా ఎలా పోరాడాలో, ఓటమిని అంగీకరించకుండా పడి లేచిన కెరటంలా ఎలా దూసుకురావాలనేదానికి 2017లో నాదల్‌ ప్రదర్శన ఉదాహరణగా నిలిచింది.  



రేస్‌ షురూ: ఫెడరర్, నాదల్‌ ఇద్దరూ గత కొంత కాలంగా అన్ని ప్రతికూలతలు అధిగమించి టెన్నిస్‌ ప్రపంచంపై తమ పట్టును నిలబెట్టుకున్నారు. 2004 మయామి మాస్టర్స్‌ టోర్నీలో తొలిసారి తలపడ్డ వీరిద్దరు గత 13 ఏళ్లుగా కోర్టులో ఒకరిపై మరొకరు ఆధిపత్యం ప్రదర్శించేందుకు సర్వ శక్తులూ ఒడ్డారు. ఈ క్రమంలో ఎన్నో చిరస్మరణీయ మ్యాచ్‌లను మనకు అందించారు. ఎందరు వచ్చినా, కుర్రాళ్లు చెలరేగిపోతున్న దశలో కూడా ఫెడరర్, నాదల్‌లు గ్రాండ్‌స్లామ్‌లలో ఈ ఏడాది సమఉజ్జీలుగా నిలిచి తమ గొప్పతనాన్ని ప్రదర్శించారు. ఇకనుంచి ఆల్‌టైమ్‌ అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ కోసం వీరి మధ్య కొత్త పోరు మొదలైనట్లే. ప్రస్తుతం ఇద్దరి మధ్య మూడు టైటిల్స్‌ తేడా ఉంది. ‘మూడు గ్రాండ్‌స్లామ్‌లు అంటే చాలా ఎక్కువ. ఇప్పుడే దాని గురించి ఆలోచించడం లేదు’ అని నాదల్‌ చెప్పాడు. అయితే 36 ఏళ్ల ఫెడరర్‌తో పోలిస్తే వయసులో ఐదేళ్లు చిన్నవాడు కావడం నాదల్‌కు కలిసొచ్చే అంశం. 2018 సీజన్‌లో   జొకోవిచ్, ముర్రే తిరిగి రానుండటం కూడా వీరి అవకాశాలపై ప్రభావం చూపించవచ్చు.



ముఖ్యంగా ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడమే అన్నింటికంటే కీలకం.   ఆకలితో ఉన్నాడు: ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ మాట్స్‌ విలాండర్‌ (స్వీడన్‌) ఈ విషయంలో నాదల్‌కే తన ఓటు అని చెబుతున్నాడు. ‘నాదల్‌ తన ఆటను మార్చుకున్నాడు. అతని సర్వీస్‌ గతంలోకంటే ప్రమాదకరంగా తయారైంది. తన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకున్నాడు. ఫెడరర్‌తో పోలిస్తే ఒక రకమైన కసి ఎక్కువగా నాదల్‌లోనే కనిపిస్తోంది. ఈ ఆకలి అతనికి మరిన్ని టైటిల్స్‌ అందిస్తుంది’ అని విలాండర్‌ అంటున్నాడు. యూఎస్‌ ఓపెన్‌లో తన ప్రత్యర్థులపై నాదల్‌ నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డ తీరులో అది ప్రత్యక్షంగా కనిపించింది. ఏడాదిలో నాలుగు గ్రాండ్‌స్లామ్‌లను నాదల్, ఫెడరర్‌ పంచుకోవడం ఇది నాలుగోసారి. కొత్త కుర్రాళ్లను దాటి చెలరేగుతున్న వీరిద్దరు 2011 తర్వాత తొలిసారి వరల్డ్‌ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్, నంబర్‌ టూ స్థానాల్లో నిలిచారు. వచ్చే ఏడాది వీరి మధ్య అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ వేట కొనసాగడం మాత్రం ఖాయం!                                          – సాక్షి క్రీడా విభాగం

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top