బుమ్రాకు ఏం కాలేదు : ముంబై ఇండియన్స్‌

Mumbai Indians Says Jasprit Bumrah Injury Nothing Serious - Sakshi

నెక్ట్స్‌ మ్యాచ్‌కు సిద్దం

ముంబై : టీమిండియా పేసర్‌, డెత్‌ ఓవర్‌ స్పెషలిస్ట్‌ జస్ప్రీత్‌ బుమ్రా గాయంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఐపీఎల్‌లో అతను ప్రాతినిధ్యం వహిస్తున్న ముంబై ఇండియన్స్‌ జట్టు ప్రకటించింది. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బుమ్రా ఫీల్డింగ్‌ చేస్తూ గాయపడిన విషయం తెలిసిందే. ఢిల్లీ ఇన్నింగ్స్‌ చివరి బంతికి పంత్‌ కొట్టిన షాట్‌ను ఆపే ప్రయత్నం చేయగా బుమ్రా ఎడమ చేయి సహకరించలేదు. నొప్పితో తన ఎడమ భుజాన్ని పట్టుకున్న అతను బాధతో విలవిల్లాడాడు. తమ ఇన్నింగ్స్‌లో మరో నాలుగు బంతులు మిగిలినా బుమ్రా బ్యాటింగ్‌కు రాకపోవడంతో అతని గాయంపై మరిన్ని సందేహాలు వ్యక్తమయ్యాయి. ప్రపంచకప్‌ ముందు బుమ్రాకు గాయం కావడంపై సర్వత్రా ఆందోళన నెలకొంది. అయితే బుమ్రాకు ఏం కాలేదని, అతని గాయం గురించి భయపడాల్సిన అవసరం లేదని ముంబై ఇండియన్స్‌ స్పష్టం చేసింది.

‘బుమ్రా ఫిట్‌గా ఉన్నాడు. జస్ట్‌ అతని భుజం కుదించికుపోయిందంతే. అతని గాయం అంత సీరియస్‌ ఏం కాదు. అతడు భారత జట్టు, ముంబై ఇండియన్స్‌ జట్టులో కీలక ఆటగాడు. పైగా మరో నెలలో ప్రపంచకప్‌ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలోనే టీమ్‌ మేనేజ్‌మెంట్‌ బ్యాటింగ్‌కు పంపించలేదు. కానీ అతనికెలాంటి ఇబ్బంది లేదు. తరువాతి మ్యాచ్‌కు బుమ్రా అందుబాటులోకి వస్తాడు.’అని ఓ ప్రకటనలో పేర్కొంది. ఇక ముంబై ఇండియన్స్‌ ఈ సీజన్‌ ఐపీఎల్‌ను ఓటమితో మొదలు పెట్టింది. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 37 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌ ఓటమిపాలైంది. ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున బరిలోకి దిగిన రిషభ్‌ పంత్‌ (27 బంతుల్లో 78 నాటౌట్‌; 7 ఫోర్లు, 7 సిక్సర్లు) అద్భుత అర్ధసెంచరీతో సత్తా చాటాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top