చెన్నైకి ముంబై చెక్‌

 Mumbai Indians beat Chennai Super Kings by 46 runs - Sakshi

సూపర్‌కింగ్స్‌ను చిత్తు చేసిన ముంబై

సమష్టిగా రాణించిన బౌలర్లు

రోహిత్‌ శర్మ అర్ధసెంచరీ

డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఈ ఐపీఎల్‌ సీజన్‌లో సొంతగడ్డపై తొలి పరాజయాన్ని చవిచూసింది. ముందు ఆశించినన్ని పరుగులు చేయలేకపోయినా... తర్వాత అదరగొట్టే బౌలింగ్‌ తో ముంబై ఇండియన్స్‌ జట్టు చెన్నై పనిపట్టింది. ముంబై బౌలర్లంతా సమష్టిగా రాణించి చెన్నై పరుగుల వేటను అడ్డుకున్నారు. తమ కెప్టెన్‌ రోహిత్‌ పోరాటానికి బౌలింగ్‌తో న్యాయం చేశారు. ఐపీఎల్‌ చరిత్రలో చెన్నై పరుగుల పరంగా రెండో అతి పెద్ద ఓటమిని  మూటగట్టుకుంది. 

చెన్నై: కీలకమైన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ చెలరేగింది. చెన్నై సూపర్‌కింగ్స్‌ను చిత్తుగా ఓడించింది. శుక్రవారం జరిగిన పోరులో 46 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన ముంబై ఇండియన్స్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 155 పరుగులు చేసింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (48 బంతుల్లో 67; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఈ సీజన్‌లో తొలి అర్ధసెంచరీ సాధించాడు. సాన్‌ట్నర్‌ 2 వికెట్లు తీశాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన చెన్నై సూపర్‌కింగ్స్‌ 17.4 ఓవర్లలో 109 పరుగులే చేసి ఆలౌటైంది. మురళీ విజయ్‌ (35 బంతుల్లో 38; 3 ఫోర్లు, 1 సిక్స్‌) మె రుగ్గా ఆడాడు. మలింగ 4 వికెట్లు పడగొట్టాడు. రోహిత్‌ శర్మకు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. 

కెప్టెన్‌ పోరాటం... 
టాస్‌ నెగ్గిన చెన్నై ఫీల్డింగ్‌ ఎంచుకోగా... ముంబై బ్యాటింగ్‌కు శ్రీకారం చుట్టిన రోహిత్, డికాక్‌ వేగం పెంచుతున్న దశలోనే వికెట్‌ను చేజార్చుకుంది. మూడో ఓవర్లో సిక్స్, ఫోర్‌ కొట్టిన డికాక్‌ (9 బంతుల్లో 15; 1 ఫోర్, 1 సిక్స్‌)ను దీపక్‌ చహర్‌ ఔట్‌ చేశాడు. తర్వాత లూయిస్‌ రాగా... పవర్‌ప్లేలో ముంబై 45/1 స్కోరు చేసింది. హర్భజన్‌ 8వ ఓవర్లో రోహిత్‌ సిక్సర్‌లతో మెరిపించగా, తాహిర్‌ 9వ ఓవర్లో లూయిస్‌ 6, 4తో జోరు పెంచాడు. మధ్యలో బ్రేవో, సాన్‌ట్నర్‌ మెరుగ్గా బౌలింగ్‌ చేయడంతో ఈ వేగం ముందుకు సాగలేకపోయింది. లూయిస్‌ (30 బంతుల్లో 32; 3 ఫోర్లు, 1 సిక్స్‌)ను సాన్‌ట్నర్‌... కృనాల్‌ (1)ను తాహిర్‌ ఔట్‌ చేశాడు. 37 బంతుల్లో ఫిఫ్టీ చేసిన రోహిత్‌ 16వ ఓవర్లో బ్యాట్‌ ఝళిపించాడు. తాహిర్‌ బౌలింగ్‌లో 2 ఫోర్లు, ఒక సిక్స్‌ బాదాడు. దీంతో 16 పరుగులు లభించాయి. కానీ ఈ జోరుకు తర్వాతి ఓవర్లోనే చుక్కెదురైంది. అతన్ని పెవిలియన్‌ చేర్చిన సాన్‌ట్నర్‌ కేవలం ఆ ఓవర్లో 1 పరుగు మాత్రమే ఇచ్చాడు. ‘హార్డ్‌ హిట్టర్‌’ పొలార్డ్‌ క్రీజులోకి వచ్చినా... చెప్పుకోదగ్గ స్థాయిలో స్కోరైతే పెరగలేదు. 18వ ఓవర్‌ వేసిన బ్రేవో  పొదుపుగానే బౌలింగ్‌ చేసి 6 పరుగులే ఇచ్చాడు. చహర్‌ 19వ ఓవర్లో 10 పరుగులొచ్చాయి. కొద్దోగొప్పో ఆఖరి ఓవర్‌ మెరుపులతో ముంబై 150 పరుగులు దాటింది. పొలార్డ్‌ బౌండరీ కొట్టగా, హార్దిక్‌ ఫోర్, సిక్సర్‌తో 17 పరుగులు జతయ్యాయి.  

వికెట్లు టపటపా... 
ఏ ఇద్దరు నిలబడినా ఛేదించగలిగే లక్ష్యంపై.. చెన్నై బ్యాట్స్‌మెన్‌ నిర్లక్ష్యం వహించారు. క్రమం తప్పకుండా వికెట్లను సమర్పించుకొని సగం ఓవర్లకు ముందే ఓటమికి సరెండర్‌ అయ్యారు. మురళీ విజయ్‌తో కలిసి ఇన్నింగ్స్‌ ఓపెన్‌ చేసిన వాట్సన్‌ (8; 2 ఫోర్లు) మలింగ తొలి ఓవర్లో రెండు ఫోర్లు కొట్టి ఔటయ్యాడు. క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ రైనా (2) హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌లో పేలవమైన షాట్‌ కొట్టి నిష్క్రమించాడు. మరో వైపు విజయ్‌ ఫోర్, సిక్స్‌తో జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. కానీ అవతలివైపు నుంచి కనీస సహకారమే కరువైంది. రాయుడు (0) ఖాతా తెరువకుండానే కృనాల్‌ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. పవర్‌ ప్లే ముగిసేసరికి చెన్నై స్కోరు 40/3. తర్వాత ఓవర్లు గడుస్తున్న కొద్దీ వికెట్లను చేజార్చుకుంటూ లక్ష్యానికి దూరమైంది. పిచ్‌ పూర్తిగా బౌలర్ల ఆధీనంలోకి రావడంతో కేదార్‌ జాదవ్‌ (6), ధ్రువ్‌ షోరే (5)లు ఎక్కువసేపు నిలబడలేదు. 10 ఓవర్లలో 5 వికెట్లను కోల్పోయిన చెన్నై 60 పరుగులు చేసింది. ఆరంభం నుంచి అందరికంటే మెరుగ్గా ఆడుతున్న విజయ్‌ని బుమ్రా ఔట్‌ చేయడంతో చెన్నై దారులు పూర్తిగా మూసుకుపోయాయి. కొండంతైన లక్ష్యం ముందు చేసేదేమీ లేక బ్రేవో (17 బంతుల్లో 20; 2 ఫోర్లు) మలింగకే రిటర్న్‌క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. సాన్‌ట్నర్‌ (22; 2 సిక్స్‌లు) కాసేపు ఆడి ఆఖరి వికెట్‌గా వెనుదిరగడంతో చెన్నై 109 పరుగులకే ఆలౌటైంది. బుమ్రా, కృనాల్‌ పాండ్యా చెరో 2 వికెట్లు తీశారు. 

ధోనికి జ్వరం... 
ఈ మ్యాచ్‌లో ‘కెప్టెన్‌ కూల్‌ ధోని’ ఆడలేదు. జ్వరంతో మ్యాచ్‌కు దూరం కాగా జట్టు పగ్గాలు రైనా చేపట్టాడు. ఈ సీజన్‌లో మ్యాచ్‌కు దూరం కావడం ధోనికిది రెండోసారి. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో కూడా మహి ఆడలేదు. అతనే కాదు... రవీంద్ర జడేజా, డు ప్లెసిస్‌లూ బరిలోకి దిగలేదు. దీంతో ధ్రువ్‌ షోరే, మురళీ విజయ్, సాన్‌ట్నర్‌ చెన్నై జట్టులోకి వచ్చారు. ముంబై రెండు మార్పులు చేసింది. కటింగ్, మయాంక్‌ మార్కండేలను తప్పించి లూయిస్, అనుకూల్‌ రాయ్‌లను తుది జట్టులోకి తీసుకుంది. ఈ మ్యాచ్‌తో రాయ్‌ ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top