ఫిట్‌నెస్‌ కోసం చికెన్‌కు దూరమయ్యా : ధోని

MS Dhoni Reveals His Fitness Mantra - Sakshi

ముంబై : ఫిట్‌నెస్‌ కోసం తనకిష్టమైన చికెన్‌, మిల్క్‌షేక్స్‌, చాక్లెట్స్‌కు దూరమయ్యానని టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని తెలిపారు. ఈ 36 ఏళ్ల సీనియర్‌ క్రికెటర్‌తో ఫిట్‌నెస్‌ విషయంలో 20 ఏళ్ల యువ ఆటగాళ్లు సైతం పోటీ పడలేరు. ఈ విషయం చాలా సందర్భాల్లో రుజువైంది. ఇటీవల ఐపీఎల్‌ సందర్భంగా తన సహచర ఆటగాడు డ్వేన్‌ బ్రేవోతో త్రీ రన్స్‌ ఛాలెంజ్‌లో ధోనినే నెగ్గిన విషయం తెలిసిందే. గతంలో ప్రాక్టీస్‌ సందర్భంగా సరదాగా టీమిండియా యువ ఆల్‌రౌండర్‌ హార్ధిక్‌ పాండ్యాతో పరుగు పందెంలో కూడా ధోనినే నెగ్గాడు. ఇక వికెట్ల మధ్య ధోనితో పరుగెత్తాలన్నా సహచర ఆటగాళ్లుకు సవాలే. ఫిట్‌గా ఉంటేనే ఆడగలమని నమ్మె ధోని.. ఫిట్‌నెస్‌ కోసం ఎన్నో త్యాగం చేశానని తెలిపాడు. ఓ అవార్డు కార్యక్రమంలో పాల్గొన్న ధోని తన ఫిట్‌నెస్‌ రహస్యాన్ని పంచకున్నాడు.

‘మెరుగైన ఫలితాలు సాధించాలంటే తప్పక మారాలి. 2004లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసినప్పుడు నా ఆహారపు అలవాట్లను కొంత మార్చుకున్నాను. బట్టర్‌ చికెన్‌, నాన్‌, మిల్క్‌ షేక్స్‌, చాక్లెట్స్‌, సాఫ్ట్‌ డ్రింక్స్‌ తీసుకునేవాడిని. ఎప్పుడైతే నాకు 28 ఏళ్లు వచ్చాయో.. అప్పటి నుంచి చాక్లెట్లు, మిల్క్‌షేక్స్‌ తీసుకోవడం మానేశా. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు సాఫ్ట్‌ డ్రింక్స్‌కు దూరమయ్యా. 2015లో టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు ప్రకటించినప్పటి నుంచి ఆరోగ్యంపై మరింత ప్రత్యేక శ్రద్ధ పెట్టాను. ఆరోగ్యాన్నిచ్చే పదార్థాలతో పాటు కబాబ్స్‌ మాత్రమే తీసుకుంటున్నాను’ అని ధోని తెలిపాడు.

రోయింగ్‌ మెషిన్‌ కీలకపాత్ర..
తన ఫిట్‌నెస్‌లో రోయింగ్‌ మెషిన్‌ కూడా కీలక పాత్ర పోషించిందని ధోని చెప్పుకొచ్చాడు. ‘ నా ఫిట్‌నెస్‌ పెంపొందించడంలో రోయింగ్‌ మిషన్‌ కూడా ఉపయోగపడింది. ఐపీఎల్‌లో ఆడే సమయంలో నా గదిలో ఒక రోయింగ్‌ మెషిన్‌ ఏర్పాటు చేసుకున్నాను. నిద్ర లేచిన అనంతరం బ్రేక్‌ఫాస్ట్‌ పంపించాల్సిందిగా సిబ్బందికి తెలిపేవాడిని. వారు తీసుకువచ్చేలోగా నేను రోయింగ్‌మిషన్‌పై కసరత్తులు చేస్తూ ఉండేవాడిని’ అని ధోని ఫిట్‌నెస్‌ మంత్రం గురించి వివరించాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top