రోహిత్‌ను దాటేసిన ధోని

MS Dhoni Hits His 216th ODI Six to Break Rohit Sharma Record - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మూడు నెలల క్రితం టీమిండియా సీనియర్‌ క్రికెటర్‌ మహేంద్రసింగ్‌ ధోని భారత జట్టులో ఉంటాడా లేడా అనే సందిగ్ధం నెలకొంది. సరైన ఫామ్‌లేక విమర్శలు ఎదుర్కొంటూ సతమతమయ్యాడు. మరోవైపు యువ ఆటగాళ్లు రిషభ్‌ పంత్‌, దినేశ్‌ కార్తీక్‌ల నుంచి గట్టి పోటీ ఎదురుకావడంతో జట్టులో ధోని చోటుపై తీవ్ర చర్చ జరిగింది. కానీ ధోని ఆసీస్‌ పర్యటనతో జట్టులో తన పాత్ర ఏంటిదో గుర్తుచేశాడు. విమర్శకులకు తన బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు. గతేడాదంతా గడ్డుకాలం గడిపిన ధోని.. ఈ ఏడాది ప్రారంభమై మూడునెలల్లోనే వరుస హాఫ్ సెంచరీలతో రెచ్చిపోయి వన్డే సిరీస్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. స్వదేశంలో ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో ధోని మరోసారి సత్తా చాటాడు. క్లిష్ట పరిస్థితుల్లో అజేయ హాఫ్ సెంచరీ(59 నాటౌట్) చేసి జట్టుకు విజయాన్నందించాడు. కేదార్ జాదవ్‌తో ఐదో వికెట్‌కు 141 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ రికార్డును ధోని అధిగమించాడు. 

వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత బ్యాట్స్‌మెన్‌గా ధోని రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో కొట్టిన సిక్సర్‌తో ధోని సిక్సర్ల సంఖ్య 216కి చేరింది. దీంతో రోహిత్(215) రికార్డును అధిగమించాడు. రోహిత్ శర్మ 202 వన్డేల్లో 215 సిక్సులు కొట్టగా.. ధోని 336 వన్డేల్లో 216 సిక్సులు కొట్టాడు. ఈ జాబితాలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(195), సౌరవ్ గంగూలీ(190), యువరాజ్(153), వీరేంద్ర సెహ్వాగ్(131) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. పాకిస్తాన్ ఆల్‌రౌండర్ షాహిద్ ఆఫ్రిది 351 సిక్సర్లతో ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top