వారెవ్వా సచిన్‌...

MP Sachin Tendulkar donates his salary to PM's Relief Fund - Sakshi

ఎంపీగా తీసుకున్న జీతభత్యాలన్నీ వితరణకే

పీఎంఆర్‌ఎఫ్‌కు రూ. 90 లక్షలు అందజేత  

న్యూఢిల్లీ: సచిన్‌ టెండూల్కర్‌ ఆటలో గ్రేటెస్ట్‌. వ్యక్తిత్వంలో ఎవరెస్ట్‌. ఇప్పుడు పార్లమెంట్‌ సభ్యుడిగా (ఎంపీ) కూడా బెస్ట్‌ అనిపించుకున్నాడు. ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఆరేళ్ల పదవీ కాలం పూర్తవడంతో రాజీనామా చేసిన ఈ మాజీ ఎంపీ తనకు వచ్చిన జీతభత్యాలు, ఇతరత్రా అలవెన్సులన్నీ ప్రధానమంత్రి సహాయ నిధి (పీఎంఆర్‌ఎఫ్‌)కి విరాళమిచ్చాడు. ఈ ఆరేళ్లలో అన్నీ కలిపి రూ. 90 లక్షలు రాగా... ఆ మొత్తాన్ని పీఎంఆర్‌ఎఫ్‌కు ఇచ్చేశాడు.

ప్రధాని కార్యాలయం (పీఎంఓ) ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ‘ప్రధాని అతని ఔదార్యాన్ని, ఔన్నత్యాన్ని కొనియాడారు. సచిన్‌ వితరణను ఆపన్నులకు అందేలా చూస్తామన్నారు’ అని పీఎంఓ ఒక ప్రకటనలో తెలిపింది. బాలీవుడ్‌ సీనియర్‌ నటి రేఖ, సచిన్‌లు పార్లమెంట్‌కు పదేపదే గైర్హాజరవుతారని విమర్శలు వెల్లువెత్తినప్పటికీ సచిన్‌... ఎంపీ లాడ్స్‌ కింద వచ్చిన రూ. 30 కోట్ల నిధుల్లో రూ. 7.4 కోట్లను దేశంలోని వివిధ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు వెచ్చించారు.

అంతే కాదు ‘సంసద్‌ గ్రామ్‌ ఆదర్శ్‌ గ్రామ్‌ యోజన’ పథకం కింద రెండు గ్రామాల్ని దత్తత తీసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టం రాజు కండ్రిగ (నెల్లూరు జిల్లా), మహారాష్ట్రలోని డోంజా గ్రామాలను సచిన్‌ దత్తత తీసుకుని మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు చొరవ చూపిస్తున్నాడు.  

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top