సెరెనా నన్ను ద్వేషించింది!

సెరెనా నన్ను ద్వేషించింది!


షరపోవా మనసులో మాట  న్యూయార్క్‌: గత దశాబ్ద కాలంలో మహిళల టెన్నిస్‌లో సెరెనా విలియమ్స్‌ (అమెరికా), మరియా షరపోవా (రష్యా) మధ్య జరిగిన మ్యాచ్‌లు ఎక్కువ మందిని ఆకర్షించాయి. 21 మ్యాచ్‌లలో 19 గెలిచి సెరెనా ఏకపక్షంగా ఆధిపత్యం ప్రదర్శించినా... వీరి పోరుపై ఆసక్తి ఏమాత్రం తగ్గలేదు. అనేక సందర్భాల్లో కోర్టు బయట కూడా వీరిద్దరు పరస్పర విమర్శలతో వార్తల్లో నిలిచారు. తాజాగా విడుదలైన తన ఆటోబయోగ్రఫీ ‘అన్‌ స్టాపబుల్‌ –మై లైఫ్‌ సో ఫర్‌’లో షరపోవా, సెరెనాపై తన విద్వేషాన్ని మరోసారి ప్రదర్శించింది. తన శ్వేత వర్ణం వల్లే సెరెనా తనపై ద్వేషభావం పెంచుకుందని ఆమె వ్యాఖ్యానించింది. 2004 వింబుల్డన్‌ ఫైనల్లో సెరెనాను ఓడించి షరపోవా విజేతగా నిలిచింది. గత 13 ఏళ్లుగా ఈ శత్రుత్వం కొనసాగుతోందని షరపోవా చెప్పింది.‘వింబుల్డన్‌లో అనేక అవాంతరాలను అధిగమించి నాలాంటి ఒక శ్వేత వర్ణపు క్రీడాకారిణి ఆమెను ఓడించడం వల్లే సెరెనా నాపై ద్వేషం పెంచుకుంది. లాకర్‌ రూమ్‌లో ఆమె ఏడవటం కూడా నేను చూశాను. అది ఆమెను మరింతగా బాధపెట్టి ఉంటుంది. ఇన్నేళ్ల పాటు ఆమెను ఓడించడంలో నేను సఫలం కాలేకపోయాను. ఇంకా చెప్పాలంటే తన భారీ, బలమైన శరీరంతోనే ఆమె నన్ను భయపెట్టేసేది’ అని షరపోవా తన పుస్తకంలో రాసింది. పరోక్షంగా తాను అందమైన, సున్నితమైన దానినని చెప్పే ప్రయత్నం చేసింది. అయితే ఆమె మాటలపై ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో విమర్శలు వినిపించాయి. 23 గ్రాండ్‌స్లామ్‌లు గెలిచిన సెరెనాతో 5 గ్రాండ్‌స్లామ్‌లు నెగ్గిన షరపోవాకు అసలు పోలికే లేదని వారంతా ఘాటుగా వ్యాఖ్యానించారు. సెరెనాను విమర్శించే క్రమంలో ఈ పుస్తకంలో ఏకంగా 106 సార్లు ఆమె పేరును షరపోవా ప్రస్తావించడాన్ని కూడా వారు వ్యంగ్యంగా గుర్తు చేస్తున్నారు!  

Back to Top