19 నాటౌట్

19 నాటౌట్ - Sakshi


ఒలింపిక్స్‌లో 19వ స్వర్ణం నెగ్గిన మైకేల్ ఫెల్ప్స్

పురుషుల 4x100 మీటర్ల ఫ్రీస్టయిల్ రిలేలో

అమెరికాకు అగ్రస్థానం


రియో డి జనీరో: రెండేళ్ల క్రితం తాను తీసుకున్న రిటైర్మెంట్ ఉపసంహరణ నిర్ణయం సరైనదేనని అమెరికా స్విమ్మింగ్ దిగ్గజం మైకేల్ ఫెల్ప్స్ నిరూపించాడు. లండన్ ఒలింపిక్స్‌లో ముగించిన పసిడి వేటను రియో ఒలింపిక్స్‌లో మళ్లీ మొదలుపెట్టాడు. పురుషుల 4ఁ100 మీటర్ల ఫ్రీస్టయిల్ రిలేలో మైకేల్ ఫెల్ప్స్, సెలెబ్ డ్రెసెల్, రియాన్ హెల్డ్, నాథన్ ఆడ్రియన్‌లతో కూడిన అమెరికా బృందం 3 నిమిషాల 09.52 సెకన్లలో గమ్యానికి చేరి స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. వరుసగా ఐదో ఒలింపిక్స్‌లో బరిలోకి దిగిన 31 ఏళ్ల ఫెల్ప్స్‌కిది 19వ పసిడి పతకం కావడం విశేషం. ఓవరాల్‌గా అతనికిది 23వ ఒలింపిక్ పతకం. నాలుగేళ్ల క్రితం లండన్‌లోనే ఒలింపిక్స్ క్రీడల చరిత్రలో అత్యధిక పతకాలు నెగ్గిన రికార్డు తన పేరిట లిఖించుకున్న ఫెల్ప్స్ ఖాతాలో మరో మూడు పతకాలు చేరే అవకాశం ఉంది. రియో ఒలింపిక్స్‌లో ఈ అమెరికా స్టార్ 100, 200 మీటర్ల బటర్‌ఫ్లయ్, 200 మీటర్ల వ్యక్తిగత మెడ్లే రేసుల్లో పోటీపడాల్సి ఉంది.


జొకోవిచ్‌కు షాక్

టెన్నిస్ ఈవెంట్‌లో సంచలన ఫలితాలు నమోదయ్యాయి. పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టాడు. 2 గంటల 27 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో డెల్ పొట్రో (అర్జెంటీనా) 7-6 (7/4), 7-6 (7/2)తో జొకోవిచ్‌ను బోల్తా కొట్టించాడు. 2012 లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక పోరులోనూ డెల్ పొట్రో చేతిలోనే జొకోవిచ్ ఓడిపోయాడు. ఓటమి అనంతరం జొకోవిచ్ రోదిస్తూ కోర్టు నుంచి వెళ్లిపోయాడు.


సెరెనా జంటకు చుక్కెదురు...

మరోవైపు మహిళల డబుల్స్‌లో సెరెనా-వీనస్ విలియమ్స్ (అమెరికా) జోడీకి తొలి రౌండ్‌లోనే ఊహించని పరాజయం ఎదురైంది. సఫరోవా-బార్బరా స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్) జంట 6-3, 6-4తో టాప్ సీడ్ సెరెనా-వీనస్ ద్వయంపై సంచలన విజయం సాధించింది. ఇంతకుముందు జంటగా ఆడిన మూడు ఒలింపిక్స్ (సిడ్నీ, బీజింగ్, లండన్) క్రీడల్లోనూ సెరెనా-వీనస్ జంట స్వర్ణ పతకాలను గెలుపొందడం గమనార్హం.


కొసోవో దేశానికీ కనకం

తొలిసారి ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న కొసొవో పసిడి పతకంతో బోణీ చేసింది. మహిళల జూడో 52 కేజీల విభాగంలో మజ్లిందా కెల్మెండి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. 2008లో సెర్బియా నుంచి విడిపోయిన కొసోవో దేశానికి 2014లో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నుంచి గుర్తింపు లభించింది.


కొరియా ‘గురి’ అదిరింది...

మహిళల ఆర్చరీ టీమ్ ఈవెంట్‌లో దక్షిణ కొరియా వరుసగా ఎనిమిదోసారి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. 1988 సియోల్ ఒలింపిక్స్‌లో ఆర్చరీని ప్రవేశపెట్టగా... అప్పటి నుంచి ఇప్పటిదాకా మహిళల టీమ్ ఈవెంట్‌లో దక్షిణ కొరియాకే పసిడి పతకం దక్కింది. టీమ్ ఫైనల్లో చాంగ్ హై జిన్, చోయ్ మిసున్, కి బో బేలతో కూడిన కొరియా జట్టు 5-1తో రష్యా జట్టుపై విజయం సాధించింది.


రెండు ప్రపంచ రికార్డులు

మహిళల 400 మీటర్ల ఫ్రీస్టయిల్‌లో అమెరికా స్విమ్మర్ కాథ్లీన్ లెడెకి... పురుషుల 100 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్‌లో ఆడమ్ పీటీ (బ్రిటన్) కొత్త ప్రపంచ రికార్డులు సృష్టించి స్వర్ణ పతకాలను సొంతం చేసుకున్నారు. లెడెకి ఫైనల్ రేసును 3ని:56.46 సెకన్లలో ముగించి 3ని:58.37 సెకన్లతో తన పేరిటే ఉన్న ప్రపంచ రికార్డు బద్దలు కొట్టింది. మరోవైపు ఆడమ్ పీటీ 57.13 సెకన్లలో రేసును పూర్తి చేసి 28 ఏళ్ల తర్వాత బ్రిటన్‌కు స్విమ్మింగ్‌లో పసిడి పతకాన్ని అందించాడు. రెండు రోజుల వ్యవధిలో ఆడమ్ రెండుసార్లు ప్రపంచ రికార్డు సృష్టించడం విశేషం. హీట్స్‌లో 57.55 సెకన్లతో సాధించిన ప్రపంచ రికార్డును ఫైనల్లో అతను తిరగరాశాడు.


అగ్రస్థానంలోకి అమెరికా

రియో డి జనీరో: స్విమ్మర్లు వేట మొదలు పెట్టడంతో అమెరికా పతకాల పట్టికలో మొత్తం 12 పతకాలతో అగ్రస్థానానికి చేరుకుంది. చైనా, ఇటలీ, ఆస్ట్రేలియా కూడా మూడేసి స్వర్ణాలు సాధించి అమెరికాకు దీటైన జవాబు ఇచ్చాయి. సోమవారం చైనా ఖాతాలో మరో రెండు స్వర్ణాలు చేరగా... ఇటలీ ఏకంగా మూడు పసిడి పతకాలను దక్కించుకుంది. కాంప్రియాని (షూటింగ్), డానియెలా గరోజో (ఫెన్సింగ్), ఫాబియో బాసిలి (జూడో) ఇటలీకి ఒక్కో స్వర్ణాన్ని అందించారు.


మహిళల డైవింగ్ సింక్రనైజ్డ్ మూడు మీటర్ల స్ప్రింగ్‌బోర్డు ఈవెంట్‌లో వు-షి ద్వయం... పురుషుల 56 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో కింగ్‌క్వాన్ లాంగ్ చైనాకు స్వర్ణాలు అందించారు. మహిళల ట్రాప్ ఈవెంట్‌లో ఆస్ట్రేలియా షూటర్  స్కినెర్ స్వర్ణం  సాధించింది. మహిళల స్విమ్మింగ్ 100 మీటర్ల బటర్‌ఫ్లయ్ విభాగంలో  స్ట్రోమ్ విజేతగా నిలిచి స్వీడన్‌కు  తొలి బంగారు పతకాన్ని అందించింది. మహిళల వెయిట్‌లిఫ్టింగ్ 53 కేజీల విభాగంలో చైనీస్ తైపీకి చెందిన షు చింగ్ సు విజేతగా నిలిచింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top