ఓటమి దిశగా వెస్టిండీస్‌

In the last Test England are headed for a big win - Sakshi

ఇంగ్లండ్‌తో మూడో టెస్టు

గ్రాస్‌ ఐలెట్‌: వెస్టిండీస్‌తో జరుగుతున్న చివరి టెస్టులో ఇంగ్లండ్‌ భారీ విజయం దిశగా దూసుకుపోతోంది. 485 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ బరిలోకి దిగిన విండీస్‌ కడపటి వార్తలందేసరికి 5 వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది. క్యాంప్‌బెల్‌ (0), కార్లోస్‌ బ్రాత్‌వైట్‌ (8), డారెన్‌ బ్రేవో (0) పది పరుగుల స్కోరు వద్దే వెనుదిరగ్గా... షై హోప్‌ (14), హెట్‌మైర్‌ (19) ఆ తర్వాత ఔటయ్యాడు. ఛేజ్‌ (38 బ్యాటింగ్‌), డౌరిచ్‌ (14 బ్యాటింగ్‌) క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు ఇంగ్లండ్‌ తమ రెండో ఇన్నింగ్స్‌ను 5 వికెట్ల నష్టానికి 361 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. కెప్టెన్‌ జో రూట్‌ (225 బంతుల్లో 122; 10 ఫోర్లు) కెరీర్‌లో 16వ సెంచరీ పూర్తి చేసుకోవడం విశేషం. రూట్‌కు స్టోక్స్‌ (48 నాటౌట్‌), బట్లర్‌ (56) అండగా నిలిచారు. గాబ్రియెల్‌కు 2 వికెట్లు దక్కాయి.  

‘గే’లా ఉండటం తప్పు కాదు! 
మ్యాచ్‌ మూడో రోజు సోమవారం రూట్, డెన్లీ క్రీజ్‌లో ఉన్న సమయంలో విండీస్‌ పేసర్‌ షెనాన్‌ గాబ్రియెల్‌తో మాటల యుద్ధం జరిగింది. రూట్‌ను సరిగ్గా గాబ్రియెల్‌ ఏమన్నాడో ఎక్కడా బయట పడలేదు. అయితే రూట్‌ మాత్రం ఆ తర్వాత... ‘గే’ కావడంలో తప్పేమీ లేదు. మరొకరిని అవమానించేందుకు ఆ పదాన్ని వాడాల్సిన అవసరం లేదు’ అని గాబ్రియెల్‌తో చెప్పడం మాత్రం స్టంప్‌ మైక్‌లో రికార్డయింది. అయితే అంతకుముందు తమ మధ్య ఏం జరిగిందో, గాబ్రియెల్‌ ఏమన్నాడో చెప్పేందుకు మాత్రం రూట్‌ నిరాకరించాడు. ‘గాబ్రియెల్‌ తాను అన్న మాటల గురించి తర్వాత కచ్చితంగా బాధ పడతాడు.

అయితే కొన్ని విషయాలు మైదానానికే పరిమితం కావాలి. అతను నిజానికి మంచి వ్యక్తి. ఎలాగైనా మ్యాచ్‌ గెలవాలనే కసితో ఆడతాడు. ఈ క్రమంలో భావోద్వేగాలు దాచుకోలేకపోయాడు. సిరీస్‌ చాలా బాగా జరిగింది. తమ ప్రదర్శన పట్ల అతను గర్వపడాల్సిన క్షణమిది’ అంటూ ప్రత్యర్థి బౌలర్‌ గురించి రూట్‌ సానుకూలంగా మాట్లాడటం విశేషం. మరోవైపు మైదానంలో గాబ్రియెల్‌ను అంపైర్లు మందలించిన అనంతరం మరో చర్య లేకుండా వివాదం ముగిసిపోయింది.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top