ధోని రికార్డుపై కోహ్లి గురి

Kohli Close To Equalling Dhonis Test Captaincy Record - Sakshi

ఆంటిగ్వా:  వరుస రికార్డులతో దూసుకుపోతున్న టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మరో ఘనతపై కన్నేశాడు.  ఇప్పటికే విండీస్‌ పర్యటనలో టీ20, వన్డేల సిరీస్‌లను గెలుచుకున్న టీమిండియా.. ఇక టెస్టు సిరీస్‌ను సాధించడంపై గురి పెట్టింది. విండీస్‌తో జరగునున్న టెస్టు సిరీస్‌ను టీమిండియా గెలిస్తే కోహ్లి అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంటాడు. వెస్టిండీస్‌లో రెండు టెస్టుల సిరీస్‌ను గెలిచిన తొలి భారత సారథిగా అతడు రికార్డు సృష్టిస్తాడు. 2016లో వెస్టిండీస్‌తో జరిగిన నాలుగు టెస్టు మ్యాచుల సిరీస్‌లో కోహ్లీసేన 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది.

అంతేకాకుండా ధోని రికార్డుపై కూడా కోహ్లి కన్నేశాడు. టెస్టుల్లో ధోని 60  మ్యాచ్‌లకు గాను 27 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా కోహ్లి 46 మ్యాచ్‌ల్లోనే 26 మ్యాచ్‌లు గెలిచాడు. మరో మ్యాచ్‌ విజయం సాధిస్తే  ధోని రికార్డును ఈ రికార్డుల రారాజు సమం చేస్తాడు.  ఒకవేళ సిరీస్‌ను 2-0తో గెలిస్తే ధోని రికార్డును కోహ్లి బ్రేక్‌ చేస్తాడు. 2014 డిసెంబర్‌లో టెస్టు సారథి బాధ్యతలను అందుకున్న కోహ్లి..  2016 నుంచి ఇప్పటివరకు 38 మ్యాచ్‌లు గాను 23 గెలిచి, 8 మ్యాచుల్లో ఓటమిని చవిచూశాడు.

మరొకవైపు సుదీర్ఘ ఫార్మాట్‌లో వెస్టిండీస్‌పై టీమిండియాదే పైచేయి.  2002 నుంచి చూస్తే విండీస్‌ చేతిలో భారత్‌ ఒక్క టెస్టు సిరీస్‌ కూడా కోల్పోలేదు. దాంతో విండీస్‌తో పోరుకు ఆత్మవిశ్వాసం సిద్ధమవుతోంది. ఇది టెస్టు చాంపియన్‌షిప్‌తోనే సిరీస్‌ మొదలవ్వడంతో ఇరు జట్లకు ఎంతో కీలకం. ఈరోజు(గురువారం) భారత్‌-విండీస్‌ జట్ల మధ్య తొలి టెస్టు ఆరంభం కానుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top