కేఎల్‌ రాహుల్‌పై విమర్శలు..బాసటగా బంగర్‌

KL Rahul Trolled by Fans - Sakshi

సిడ్నీ: టెస్టు సిరీస్‌కు ముందు సిడ్నీ వేదికగా క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవన్ జట్టుతో టీమిండియా ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతోంది. గురువారం ఆరంభమైన వార్మప్ మ్యాచ్‌లో ఐదుగురు భారత ఆటగాళ్లు హాఫ్ సెంచరీలతో రాణించారు. దాంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు తన మొదటి ఇన్నింగ్స్‌లో 358 పరుగులకి ఆలౌటైంది. ప‍్రధానంగా భారత్ టాపార్డర్ పరుగుల మోత మోగించారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవన్ జట్టు బౌలింగ్‌ తీసుకుంది. దాంతో కోహ్లి సేన బ్యాటింగ్‌కు దిగింది. ఇటీవల ఆసీస్‌పై టీ20 సిరీస్‌లో ఘోరంగా విఫలమైన కేఎల్ రాహుల్.. పృథ్వీ షా‌తో కలిసి భారత్ ఇన్నింగ్స్ ఆరంభించాడు. ఈ మ్యాచ్‌లోనూ రాహుల్ (3) మరోసారి నిరాశపరిచాడు.

వార్మప్ మ్యాచ్ స్కోరును బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ వేదికగా అప్‌డేట్ చేసింది. ఈ క్రమంలోనే కేఎల్ రాహుల్ 3 పరుగులకే అవుట్ అయ్యాడంటూ చేసిన ట్వీట్‌పై నెటిజన్లకు విరుచుకుపడ్డారు. 'అతను క్రికెటర్‌యే కాదు. అసలు జట్టులోకి ఎందుకు తీసుకున్నారు. 'దయచేసి జట్టులోంచి తీసేయండి. భవిష్యత్ సూపర్ స్టార్ పృథ్వీ షా.. కేఎల్ రాహుల్ కంటే మెరుగ్గా ఆడుతున్నాడు. కేఎల్ రాహుల్ ఔటవడంలో ఆశ్చర్యమేమి లేదు’ అని అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు.

తప్పులను సరిచేసుకునే పనిలో..

ఒకవైపు రాహుల్‌ విపరీతమైన విమర్శలు వచ్చిన నేపథ్యంలో అతనికి బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌ మద్దతుగా నిలిచాడు. స్వీయ తప్పిదాలతో ఔట్‌ అవుతున్న రాహుల్‌ తన తప్పులను సరిదిద్దుకోవడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తున్నాడంటూ పేర్కొన్నాడు. ‘ రాహుల్‌ గాడిలో పడతాడనే ఆశిస్తున్నా. ఒక చక్కటి షేప్‌తో బ్యాటింగ్‌ చేస్తున్నాడు. కాకపోతే బంతిని శరీరంపైకి లాక్కొని తరచుగా ఔటవుతున్నాడు. దాన్ని చక్కదిద్దుకునే పనిలో ఉన్నాడు. అతనేమీ యువ క్రికెటర్‌ కాదు.. ఒక సీనియర్‌ క్రికెటర్‌. ఆస్ట్రేలియా పర్యటనకు రెండోసారి వచ్చాడు. ఇప‍్పటికే 30 టెస్టులు ఆడాడు. అతని నుంచి బాధ్యతాయుతమైన ఆటను మేము ఆశిస్తున్నాం. రాహుల్‌ కచ్చితంగా జట్టుకు ఉపయోగపడే బ్యాట్స్‌మన్‌. రాబోవు రోజుల్లో అతని నుంచి మంచి ఇన్నింగ్స్‌ను చూస్తాం’ అని బంగర్‌ తెలిపాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top