మెరిసిన గేల్‌

Kings Opener Gayle Shines with Fifty Against Rajastan - Sakshi

జైపూర్‌: ఐపీఎల్‌లో భాగంగా రాజస్తాన్‌ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్‌ పంజాబ్‌ ఆటగాడు క్రిస్‌ గేల్‌ హాఫ్‌ సెంచరీ సాధించాడు. 33 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అర్థ శతకం నమోదు చేశాడు. మ్యాచ్‌ ఆరంభంలో నెమ్మదిగా ఆడిన గేల్‌.. కుదురుకున్న తర్వాత బ్యాట్‌ ఝుళిపించాడు. ప్రధానంగా ఉనాద్కత్‌ వేసిన 12 ఓవర్‌లో మూడు ఫోర్లు, 1 సిక‍్సర్‌ కొట్టాడు. ఆ ఓవర్‌లో 19 పరుగుల్ని గేల్‌ సాధించాడు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కింగ్స్‌ ఆదిలోనే కేఎల్‌ రాహుల్‌(4) వికెట్‌ను కోల్పోయింది. ఆ తరుణంలో మయాంక్‌ అగర్వాల్‌-గేల్‌ జోడి సమయోచితంగా బ్యాటింగ్‌ చేసింది. వీరిద్దరూ 56 పరుగులు జోడించిన తర్వాత మయాంక్‌(22) రెండో వికెట్‌గా ఔటయ్యాడు. ఆపై సర్పరాజ్‌ ఖాన్‌తో ఇన్నింగ్స్‌ను గేల్‌ ముందుకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకున్నాడు.

అదే సమయంలో ఐపీఎల్‌లో నాలుగు వేల పరుగులు సాధించిన రెండో విదేశీ ఆటగాడిగా గేల్‌  రికార్డు సాధించాడు. గతంలో డేవిడ్‌ వార్నర్‌ ఈ ఘనతను అందుకున్నాడు. అంతేకాకుండా  అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో నాలుగు వేల పరుగుల అందుకున్న ఆటగాడిగా సరికొత్త రికార్డును నెలకొల్పాడు. క్రిస్‌గేల్‌ 112 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత అందుకున్నాడు. ఇక ఈ జాబితాలో డేవిడ్‌ వార్నర్‌(114), విరాట్‌ కోహ్లి(128), సురేష్‌ రైనా, గంభీర్‌(140)లు తర్వాత స్థానాల్లో ఉన్నారు.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top