జోరు కొనసాగించేనా?

జోరు కొనసాగించేనా?


నేటి నుంచి ఆస్ట్రేలియన్‌

ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ టోర్నీ

బరిలో శ్రీకాంత్, సాయిప్రణీత్,    సింధు, సైనా
సిడ్నీ: ఇటీవలే సింగపూర్‌ ఓపెన్‌ నెగ్గిన సాయిప్రణీత్, గతవారం ఇండోనేసియా ఓపెన్‌లో విజేతగా నిలిచిన కిడాంబి శ్రీకాంత్‌... మాజీ నంబర్‌వన్‌ లీ చోంగ్‌ వీ (మలేసియా), రియో ఒలింపిక్స్‌ చాంపియన్‌ చెన్‌ లాంగ్‌ (చైనా)ను ఓడించి అద్భుతమైన ఫామ్‌లో ఉన్న హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ మరో టైటిల్‌ వేటకు సిద్ధమయ్యారు. మంగళవారం మొదలయ్యే ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్స్‌ శ్రీకాంత్, ప్రణయ్, సాయిప్రణీత్, అజయ్‌ జయరామ్, సైనా నెహ్వాల్, పీవీ సింధు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.పారుపల్లి కశ్యప్, సిరిల్‌ వర్మ, శ్రేయాన్‌‡్ష జైస్వాల్, రుత్విక శివాని క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌లు ఆడనున్నారు. తొలి రోజు క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌లు జరుగుతాయి. బుధవారం మెయిన్‌ ‘డ్రా’ మ్యాచ్‌లు మొదలవుతాయి. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి, మనూ అత్రి–సుమీత్‌ రెడ్డి, కోనా తరుణ్‌–ఫ్రాన్సిస్‌ ఆల్విన్‌ జోడీలు బరిలో ఉన్నాయి.పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో క్వాలిఫయర్‌తో ఆడనున్న శ్రీకాంత్‌కు ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్‌ సన్‌ వాన్‌ హో (కొరియా) ఎదురవుతాడు. ఇతర మ్యాచ్‌ల్లో టామీ సుగియార్తో (ఇండోనేసియా)తో సాయిప్రణీత్, యూరోపియన్‌ చాంపియన్‌ రాజీవ్‌ ఉసెఫ్‌ (ఇంగ్లండ్‌)తో ప్రణయ్, ఏడో సీడ్‌ ఎన్జీ కా లాంగ్‌ అంగుస్‌ (హాంకాంగ్‌)తో జయరామ్‌ ఆడతారు. మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ఇండోనేసియా ఓపెన్‌ విజేత సయాకా సాటో (జపాన్‌)తో సింధు; నాలుగో సీడ్‌ సుంగ్‌ జీ హున్‌ (కొరియా)తో సైనా తలపడతారు.ఏప్రిల్‌లో సాయిప్రణీత్‌ సింగపూర్‌ ఓపెన్‌లో... ఆదివారం కిడాంబి శ్రీకాంత్‌ ఇండోనేసియా ఓపెన్‌లో విజేతగా నిలిచారు. భారత్‌కే చెందిన హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ ఇండోనేసియా ఓపెన్‌లో మాజీ నంబర్‌వన్‌ లీ చోంగ్‌ వీ (మలేసియా), రియో ఒలింపిక్స్‌ చాంపియన్‌ చెన్‌ లాంగ్‌ (చైనా)లను ఓడించి పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

Back to Top