శ్రమించి నెగ్గిన శ్రీకాంత్, సాయిప్రణీత్‌

kidambi srikanth sai praneeth Advance To Second Round  In Thailand Open - Sakshi

ప్రిక్వార్టర్స్‌లోకి సైనా, కశ్యప్, ప్రణయ్‌

సౌరభ్, సమీర్‌ వర్మ పరాజయం

థాయ్‌లాండ్‌ ఓపెన్‌ టోర్నీ

ఈ ఏడాది తొలి టైటిల్‌ కోసం నిరీక్షిస్తోన్న భారత బ్యాడ్మింటన్‌ అగ్రశ్రేణి క్రీడాకారులు కిడాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్, ప్రణయ్, పారుపల్లి కశ్యప్‌ థాయ్‌లాండ్‌ ఓపెన్‌ టోర్నీలో కష్టమ్మీద తొలి రౌండ్‌ గట్టెక్కారు. పురుషుల సింగిల్స్‌లో ఏకంగా ఏడుగురు భారత ఆటగాళ్లు మెయిన్‌ ‘డ్రా’లో బరిలోకి దిగగా... ఐదుగురు ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లారు. మరో ఇద్దరు తొలి రౌండ్‌లోనే నిష్క్రమించారు.

బ్యాంకాక్‌: తొలి రౌండ్‌లోనే గట్టిపోటీ ఎదుర్కొన్నా... కీలక దశలో పైచేయి సాధించిన భారత అగ్రశ్రేణి ఆటగాళ్లు కిడాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్, కశ్యప్, హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ థాయ్‌లాండ్‌ ఓపెన్‌లో ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించారు. అయితే భారత్‌కే చెందిన ‘వర్మ బ్రదర్స్‌’ సౌరభ్, సమీర్‌లకు తొలి రౌండ్‌లోనే నిరాశ ఎదురైంది. మహిళల సింగిల్స్‌ విభాగంలో సైనా నెహ్వాల్‌ శుభారంభం చేయగా... ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి చుక్కా సాయి ఉత్తేజిత రావు తొలి రౌండ్‌లో నిష్క్రమించింది. 

పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో ఐదో సీడ్‌ శ్రీకాంత్‌ 21–13, 17–21, 21–19తో రెన్‌ పెంగ్‌ బో (చైనా)పై, సాయిప్రణీత్‌ 17–21, 21–17, 21–15తో కాంతాపోన్‌ వాంగ్‌చరోయిన్‌ (థాయ్‌లాండ్‌)పై, కశ్యప్‌ 18–21, 21–8, 21–14తో మిషా జిల్బర్‌మన్‌ (ఇజ్రాయెల్‌)పై, ప్రణయ్‌ 21–16, 22–20తో వింగ్‌ వోంగ్‌ కి విన్సెంట్‌ (హాంకాంగ్‌)పై విజయం సాధించారు. సౌరభ్‌ వర్మ 21–23, 19–21, 21–5తో కాంటా సునెయామ (జపాన్‌) చేతిలో... సమీర్‌ వర్మ 23–21, 11–21, 5–21తో లీ జి జియా (మలేసియా) చేతిలో ఓడిపోయారు. 
మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో సైనా నెహ్వాల్‌ 21–17, 21–19తో ఫిత్యాపోర్న్‌ చైవన్‌ (థాయ్‌లాండ్‌)పై నెగ్గగా... సాయి ఉత్తేజిత 17–21, 7–21తో చెన్‌ జియో జిన్‌ (చైనా) చేతిలో పరాజయం పాలైంది.   

సిక్కి రెడ్డి జంట ముందంజ... 
మిక్స్‌డ్‌ డబుల్స్‌ తొలి రౌండ్‌లో తెలంగాణ అమ్మాయి నేలకుర్తి సిక్కి రెడ్డి–ప్రణవ్‌ చోప్రా (భారత్‌) ద్వయం 21–16, 21–13తో కొహి గోండో–అయానె కురిహారా (జపాన్‌) జోడీపై గెలిచి ప్రిక్వార్టర్‌ ఫైనల్‌కు చేరింది. మరో మ్యాచ్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌–అశ్విని పొన్నప్ప (భారత్‌) జంట 21–18, 18–21, 21–17తో ఐదో సీడ్‌ చాన్‌ పెంగ్‌ సూన్‌–గో లియు యింగ్‌ (మలేసియా) జోడీని ఓడించి ముందంజ వేసింది.      

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top