అంపైర్‌ నిర్ణయాల వల్లే పరాజయం: శ్రీకాంత్‌

Kidambi Srikanth calls umpiring ridiculous after too many service faults - Sakshi

బర్మింగ్‌హమ్‌: ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌షిప్‌ ప్రికార్టర్‌ ఫైనల్లో తన ఓటమికి అంపైర్‌ తీసుకున్న అసంబద్ధ నిర్ణయాలే కారణమని కిడాంబి శ్రీకాంత్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. తన సర్వీస్‌లో పదే పదే తప్పిదాలను చూపించడం వల్లే పరాజయం చెందానన్నాడు.

మొదటి మ్యాచ్‌ ఆడిన క్రమం‍లో కనిపించని సర్వీస్‌ తప్పిదాలు.. రెండో మ్యాచ్‌లో అంపైర్‌కు ఎలా కనిపించాయో అంటూ మ్యాచ్‌ తర్వాత శ్రీకాంత్‌ వాపోయాడు. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో శ్రీకాంత్‌ 11-21, 21-14, 20-22 స్కోరుతో చైనాకు చెందిన హాంగ్‌ యు జియాంగ్‌ చేతిలో పరాజయం పాలయ్యాడు. 'తొలి గేమ్‌లో ఎన్నో సర్వీస్‌ తప్పిదాలను అంపైర్‌ ప్రకటించాడు. మొదటిరోజు నా సర్వీస్‌లో అంపైర్‌కు ఎలాంటి తప్పులు కనిపించలేదు. కానీ రెండోరోజు బాధ్యతలు నిర్వర్తించిన అంపైర్‌కు మాత్రం నా సర్వీస్‌లో ఎన్నో లోపాలు కనిపించాయి. ఇది సరికాదు' అని శ్రీకాంత్‌ పేర్కొన్నాడు.

ఇటీవల బ‍్యాడ్మింటన్‌లో బీడబ్యూఎఫ్‌ కొత్త నిబంధన ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. సర్వీస్ సమయంలో షటిల్‌ను రాకెట్‌ తాకేటప్పుడు కోర్టు నుంచి 1.15 మీటర్ల ఎత్తు మించి ఉండకూడదు. ఈ కొత్త రూల్‌ను జర్మన్‌ ఓపెన్‌లో ప్రయోగాత్మంగా చేపట్టగా, ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌షిప్‌లో అమలు చేశారు. దీనివల్ల ఎత్తుగా ఉండే ఆటగాళ్లకు సర్వీస్‌ చేసే సమయంలో ఇబ్బందులు తలెత్తె అవకాశం ఉంది.  ఈ నిబంధన కారణంగానే శ్రీకాంత్‌ సర్వీస్‌లో అంపైర్‌ పదే పదే తప్పులు చూపించాడు. కాగా, తొలి మ్యాచ్‌లో ఇదే తరహాలో సర్వీస్‌ చేశానని, రెండో మ్యాచ్‌లో మాత్రమే సర్వీస్‌ తప్పిదాల్ని అంపైర్‌ వేలెత్తిచూపాడాన్ని శ్రీకాంత్‌ ప్రశ్నిస్తున్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top