‘వన్డే ప్రపంచకప్‌లో ఆశ్చర్యపరిచే జట్లు ఇవే’

Kapil Dev Picks His Surprise Package For The Tournament - Sakshi

న్యూఢిల్లీ: వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా సత్తా చాటుతుందని మాజీ కెప్టెన్‌ కపిల్‌దేవ్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. విరాట్‌ కోహ్లి సేన టాప్‌ జట్లలో ఒకటిగా నిలిచే అవకాశముందని అంచనా వేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘యువకులు, అనుభవజ్ఞులతో టీమిండియా సమతూకంగా ఉంది. నా అభిప్రాయం ప్రకారం ధోని, కోహ్లి జట్టులో ఉండటం మరింత కలిసొచ్చే అంశం. భారత జట్టు కచ్చితంగా టాప్‌ 4లో నిలుస్తుంది. విజేతగా ఏ జట్టు నిలుస్తుందో ఇప్పుడే చెప్పలేమ’ని కపిల్‌దేవ్‌ అన్నారు.

ఏయే జట్లు సెమీస్‌ చేరతాయన్న దానిపై స్పందిస్తూ.. భారత్‌, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా టీమ్‌లకు అవకాశముందన్నారు. నాలుగో బెర్త్‌ కోసం న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌, దక్షిణాఫ్రికా పోటీ పడే ఛాన్స్‌ ఉందని అభిప్రాయపడ్డారు. వన్డే వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్‌, వెస్టిండీస్‌ జట్లు ఆశ్చర్యకర ఫలితాలు (సర్‌ప్రైజ్‌ ప్యాకేజీ) సాధిస్తాయని పేర్కొన్నారు. టీమిండియాకు ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా కచ్చితంగా ప్లస్‌ అవుతాడని, అతడిని అధిక ఒత్తిడికి గురిచేయకుండా సహజంగా ఆడనివ్వాలన్నారు. జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమీ చక్కగా బౌలింగ్‌ చేస్తున్నారని, టీమ్‌లో వీరిద్దరూ కూడా కీలకమని కపిల్‌దేవ్‌ తెలిపారు. వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా జూన్‌ 5న సౌతాంప్టన్‌లో దక్షిణాఫ్రికాతో టీమిండియా తొలి మ్యాచ్‌ ఆడనుంది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top