అత్యుత్తమ క్రికెటరెవరో చెప్పిన కపిల్‌ దేవ్‌

Kapil Dev Heaped Praise On Mahendra Singh Dhoni - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: భారత క్రికెట్ చరిత్రలో గొప్ప ఆటగాళ్ల జాబితాలోనూ అదేవిధంగా దిగ్గజ సారథులు జాబితాలోనూ తప్పకుండా ఉండే పేరు మహేంద్ర సింగ్ ధోని. టీమిండియా ఈ మిస్టర్‌ కూల్‌ కెప్టెన్సీలోనే అన్ని ఐసీసీ ట్రోఫీలను గెల్చుకున్న విషయం తెలిసిందే. అతడి ఆటను, సారథ్యాన్ని, గొప్ప మనసును పొగడని వారుండరు. తాజాగా టీమిండియాకు తొలి ప్రపంచకప్‌ అందించిన సారథి కపిల్‌ దేవ్‌ ఈ జార్ఖండ్‌ డైనమైట్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. బుధవారం స్థానికంగా ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో పాల్గొన్న కపిల్‌ దేవ్‌ వద్ద ఓ రిపోర్టర్‌ ధోని ప్రస్తావనను తీసుకరావడంతో ఆయన తన అభిప్రాయాలను వ్యక్తం చేశాడు.   

‘టీమిండియా తరపున 90 టెస్టులకు ప్రాతినిథ్యం వహించిన ధోని యువ ఆటగాళ్లను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ఆ ఫార్మట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. అలా ఆలోచించడమే ధోని గొప్పతనం. నిస్వార్దంగా దేశం కోసం పాటుపడే క్రికెటర్ ధోనీ. భారత క్రికెటర్లలో మహేంద్ర సింగ్ ధోనీయే అత్యుత్తమ ఆటగాడు.  ధోనీ నేతృత్వంలో టీమిండియా 2011 ప్రపంచ కప్‌లో అద్భుతమైన ప్రదర్శన చేసి టైటిల్‌ను సొంతం చేసుకుంది. అంతకుముందు ధోనీ సారథ్యంలోనే టీ20 ప్రపంచ కప్‌ను గెలుపొందింది. క్రికెట్‌ చరిత్రలో ధోని తనకంటూ ఓ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్నాడు. వచ్చే ఏడాది జరగనున్న ప్రపంచ కప్‌లోనూ ధోనీ ఆడాలనే కోరకుంటున్నా’ అంటూ ధోనిని కపిల్‌ దేవ్‌ పొగడ్తలతో ముంచెత్తాడు. 

టెస్టులకు గుడ్‌బై చెప్పిన ధోని పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాత్రమే కొనసాగుతున్నాడు. అయితే ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌కు సెలక్టర్లు ధోనిని పక్కకు పెట్టారు. దీంతో ధోని కెరీర్‌ ముగిసినట్టేనని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కనీసం వచ్చే ఏడాది జరగనున్న ప్రపంచకప్‌ వరకైనా అతడిని కొనసాగించాలని మాజీ క్రికెటర్లు, అభిమానులు కోరుకుంటున్నారు.     
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top