ఆడొద్దన్నందుకు రెండో రోజులు తినలేదు

Jeakson once Fasted for more than two days when told to stop playing Football - Sakshi

సాక్షి: భారత్‌కు మొదటి గోల్‌ అందించిన క్రీడకారుడిగా జీక్సన్‌ సింగ్‌ రికార్డు సాధించాడు. ఫిఫా టోర్నిలో చేసిన గోల్‌ భారత్‌కు తొలి గోల్‌గా నిలిచింది. అండర్‌-17 ప్రపంచకప్‌లో ఈ మణిపూర్‌ కుర్రాడు సంచలన సృష్టించాడు. తమ కుమారుడికి ప్రత్యేక గుర్తింపు వచ్చినందుకు తల్లిదండ్రులు చాలా సంతోషం వ్యక్తం చేశారు. జీక్సన్‌ తల్లి బిలాషిని దేవి మాట్లాడుతూ.. చిన్నప్పుడు ఫుట్బాల్‌ ఆడొద్దని చెప్పినందుకు దాదాపుగా రెండురోజుల పాటు ఏమి తినకుండా ఉన్నాడని తెలిపింది. ‘పాఠశాలలో చదివేటప్పుడు రెండో తరగతి నుంచి నాల్గో తరగతి వరకూ తరగతిలో మొదటి ర్యాంక్‌ సాధించేవాడు.

జీక్సన్‌ అన్న అమర్‌జీత్‌(ప్రస్తుతం జట్టు కెప్టెన్‌) రెండో ర్యాంక్‌లో ఉండేవాడు. జీక్సన్‌ను ఐఏఎస్‌ అధికారిగా చూడాలని మేము కోరుకున్నాం. నాలుగు సంవత్సరాల వయసు నుంచే ఫుట్‌బాల్‌ ఆడటం మొదలు పెట్టాడు. ఇంటి ముందు ఉన్న కొద్దిపాటి స్థలంలోనే రోజంతా ఫుట్‌బాల్‌ ఆడుతుండేవాడు. ఆడే సమయంలో తినడం కూడా మరిచిపోయేవాడని జీక్సన్ తల్లి తెలిపారు. ఫుట్‌బాల్‌ ఆటను వదిలేసి చదువు మీద దృష్టిపెట్టాలని చెప్పినప్పుడు రెండు రోజుల పాటు ఏమీ తీసుకోకుండా ఉండిపోయాడు. అప్పటి నుంచి మేము అడ్డు చెప్పలేదు’ అని బిలాషిని తెలిపింది.
 
మిడ్‌ఫీల్డర్‌ జీక్సన్‌ సింగ్‌ 82వ నిమిషంలో చేసిన గోల్‌.. ఫిఫా టోర్నీలోనే భారత్‌కు తొలి గోల్‌గా నిలిచింది. ఓటమితో నిరాశపరిచినా స్టేడియంలోని ప్రేక్షకులతో పాటు దేశాభిమానుల మనస్సులు మాత్రం గెలుచుకున్నారు. అయితే వరుసగా రెండు మ్యాచ్‌లను ఓడిన భారత్‌ తమ తదుపరి రౌండ్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. తమ చివరి గ్రూప్‌ మ్యాచ్‌ను 12న భారత జట్టు ఘనాతో ఆడుతుంది.

ఆ మ్యాచ్‌ గెలుస్తాం: జీక్సన్‌
ఈ నెల 12 న భారత్‌ జట్టు ఘనాతో తలపడుతున్న ఉన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కచ్చితంగా విజయం సాధిస్తామని జీక్సన్‌ సింగ్‌ ధీమా వ్యక్తం చేశాడు. ‘ఘనాను ఓడిస్తామనే నమ్మకం మాకు ఉంది. మా జట్టు సమిష్టిగా రాణించి గెలుపు కోసం పోరాడుతాం. మొదటి గోల్‌ సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఆ క్షణలో ఏదో సాధించిన ఉత్సాహం. కానీ దురదృష్టం కొద్ది మ్యాచ్‌ ఓడిపోయాం’ అని జీక్సన్‌ సింగ్‌ అన్నారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top