మ్యాచ్‌ను ‘టర్న్‌’ చేశాడు!

Jadeja Displays Incredible Reflexes In Return Catch To Dismiss Markram - Sakshi

విశాఖ: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో పేసర్‌ మహ్మద్‌ షమీ, స్పిన్నర్‌ రవీంద్ర జడేజాలు చెలరేగిపోవడంతో టీమిండియా 203 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. భారత్‌ నిర్దేశించిన 395 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా ఆది నుంచి తడబడుతూ బ్యాటింగ్‌ చేసింది. నిన్నటి ఆటలో డీన్‌ ఎల్గర్‌ త్వరగానే పెవిలియన్‌కు చేరగా, ఈ రోజు ఆటలో బ్రయాన్‌ ఆరంభంలోనే ఔటయ్యాడు. అశ్విన్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ కావడంతో సఫారీలు 19 పరుగుల వద్ద రెండో వికెట్‌ను కోల్పోయారు. ఆపై బావుమాను డకౌట్‌గా షమీ పెవిలియన్‌కు పంపడంతో సఫారీలు కష్టాల్లో పడ్డారు. ఆదివారం ఆటను మొత్తంగా చూస్తే జడేజా బౌలింగ్‌ మ్యాచ్‌ హైలెట్‌గా నిలిచింది. 27 ఓవర్‌ తొలి బంతికి మార్కరమ్‌ను ఔట్‌ చేసిన జడేజా.. అదే ఓవర్‌ నాల్గో బంతికి ఫిలిండర్‌ను, ఐదో బంతికి మహరాజ్‌లను డకౌట్‌ చేశాడు.(ఇక్కడ చదవండి: వైజాగ్‌ టెస్టులో సరికొత్త వరల్డ్‌ రికార్డు)

ఈ మూడు ఔట్లలో ఫిలిండర్‌, మహరాజ్‌లు ఎల్బీలుగా ఔటైతే, మార్కరమ్‌ను రిటర్న్‌ క్యాచ్‌ ద్వారా ఔట్‌ చేశాడు జడేజా.  ఓపెనర్‌గా దిగిన మార్కరమ్‌ క్రీజ్‌లో నిలదొక్కుకునే క్రమంలో జడేజా నుంచి వచ్చిన ఒక అద్భుతమైన బంతిని స్ట్రైట్‌ డ్రైవ్‌ను కొట్టే యత్నం చేశాడు.  అయితే రెప్పపాటులో జడేజా క్యాచ్‌ అందుకోవడంతో మార్కరమ్‌ ఇన్నింగ్స్‌ 39 పరుగుల వద్ద ముగిసింది.  అది కచ్చితంగా భారత్‌ మ్యాచ్‌ గెలవడంలో టర్నింగ్‌ పాయింట్‌గానే చెప్పొచ్చు. మార్కరమ్‌ ఔటైన ఓవర్‌లోనే ఫిలిండర్‌, మహరాజ్‌లు ఔట్‌  కావడంతో భారత్‌కు మ్యాచ్‌పై పట్టుచిక్కింది. ఇక రెండో సెషన్‌లో భారత్‌ కాస్త శ్రమించినా అనుకూలమైన ఫలితాన్ని సాధించింది. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ హీరో డీన్‌ ఎల్గర్‌ కూడా జడేజాకే చిక్కాడు. శనివారం ఆటలోనే ఎల్గర్‌ను జడేజా ఔట్‌ చేసి భారత్‌కు మంచి బ్రేక్‌ ఇచ్చాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top