పంత్‌ కంటే అయ్యర్‌ బెటర్‌: గావస్కర్‌

Iyer Is More Suited To Batting At No Four Gavaskar - Sakshi

న్యూఢిల్లీ: టీమిండియా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఎప్పట్నుంచో ప్రశ్నార్థకంగా మారిన నాల్గో స్థానంలో యువ ఆటగాడు రిషభ్‌ పంత్‌ను పదే పదే పంపడాన్ని దిగ్గజ ఆటగాడు సునీల్‌ గావస్కర్‌ తప్పుబట్టాడు. దీనిలో భాగంగా నాల్గో స్థానాన్ని పటిష్ట పరిచేందుకు రిషభ్‌ పంత్‌ను అక్కడ బ్యాటింగ్‌ పంపుతున్నామన్న టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి వ్యాఖ్యల్ని గావస్కర్‌ ఈ సందర్భంగా  ప్రస్తావించాడు. గత కొంతకాలంగా పంత్‌ను నాల్గో స్థానంలో బ్యాటింగ్‌కు దింపుతున్నా ఆశించిన ఫలితాలు రాలేదని, దాంతో అతని బ్యాటింగ్‌ ఆర్డర్‌ను మరింత కిందకు పంపాలని సూచించాడు. నాల్గో స్థానంలో పంత్‌ కంటే అయ్యర్‌ బెటర్‌ అని గావస్కర్‌ అభిప్రాయపడ్డాడు.

‘ చాలాకాలం తర్వాత వచ్చిన అవకాశాన్ని అయ్యర్‌ ఒడిసి పట్టుకున్నాడు. అతని ఆట తీరుతో ఎంతో విలువైన ఆటగాడో చాటిచెప్పాడు. ఇక అయ్యర్‌ రెగ్యులర్‌గా ఆటగాడిగా భారత్‌ క్రికెట్‌ జట్టులో ఉంటాడనే అనుకుంటున్నా. నాల్గో స్థానంలో అయ్యర్‌ను బ్యాటింగ్‌కు పంపి, పంత్‌ను ఐదు, ఆరు స్థానాల్లో పంపితే బాగుంటుంది. అయ్యర్‌ను నాల్గో స్థానంలో బ్యాటింగ్‌కు పంపితే జట్టు మరింత బలోపేతం అవుతుంది. పంత్‌ను నాల్గో స్థానంలో బ్యాటింగ్‌కు పంపుతున్నా అది మంచి ఫలితాన్ని ఇవ్వలేదు. పంత్‌ ఒక నైపుణ్యం ఉన్న క్రికెటర్‌. అందులో సందేహం లేదు. కానీ నాల్గో స్థానం మాత్రం అతనికి సరైనది కాదు. ధోని తరహాలో పంత్‌ ఒక మంచి ఫినిషర్‌. భారత్‌కు రోహిత్‌, ధావన్‌లతో పాటు కోహ్లిలు మంచి ఆరంభాన్ని ఇచ్చి, వారు 45 ఓవర్ల వరకూ ఉంటే నాల్గో స్థానంలో పంత్‌ను పంపినా ఫర్వాలేదు. కానీ భారత్‌కు సరైన ఆరంభం లభించనప్పుడు మాత్రం పంత్‌ను ఐదు, ఆరో స్థానాల్లో పంపితేనే బాగుంటుంది’ అని గావస్కర్‌ పేర్కొన్నాడు. విండీస్‌తో రెండో వన్డేలో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అయ్యర్‌ 71 పరుగులతో మెరిశాడు. ఇక పంత్‌ నాల్గో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి 20 పరుగులు మాత్రమే చేశాడు. దాంతో మరోసారి నాల్గో స్థానం చర్చకు దారి తీసింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top