ఇషాంత్ కు చిర్రెత్తుకొచ్చింది!

ఇషాంత్ కు చిర్రెత్తుకొచ్చింది!


రాంచీ: ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో ఆ దేశ క్రికెటర్ల హావభావాలను వ్యంగ్యంగా ప్రదర్శించి మరీ ఇషాంత్ శర్మ స్లెడ్జింగ్ దిగిన సంగతి తెలిసిందే. ఆ టెస్టు మ్యాచ్ రెండో రోజు ఆటలో ఇషాంత్ ఉన్న పళంగా తనలోనటుడ్ని బయటకు తీసి ఆసీస్ క్రికెటర్లను ఆట పట్టించాడు. ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది.  ప్రధానంగా ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్, రెన్ షాలను వారి శైలిలోనే కవ్వించే యత్నం చేశాడు. ఇది అటు అభిమానుల్ని, ఇటు వ్యాఖ్యాతల్ని సైతం బాగా అలరించింది. ఎంతగా అంటే ఈ సిరీస్ కు సంబంధించిన పలువురు వ్యాఖ్యాతలు 'గేమ్ ఫేస్' పేరిట ఛాలెంజ్ కు దిగి ఇషాంత్ ను అనుకరించే  యత్నం చేశారు.  ఇదిలా ఉంచితే మూడో టెస్టు మ్యాచ్లో తొలి నాలుగు రోజుల పాటు కూల్ గా కనిపించిన ఇషాంత్.. చివరిరోజు ఆటలో మాత్రం కాస్త ఆవేశంగా కనిపించాడు. రెండో ఇన్నింగ్స్ లో భాగంగా 29.0 ఓవర్ తొలి బంతిని వేసేందుకు ఇషాంత్ రాగా రెన్ షా క్రీజ్ నుంచి తప్పుకున్నాడు. దాంతో కోపం వచ్చిన ఇషాంత్ చేతిలోని బంతిని వికెట్లకు సమీపంలో విసిరాడు. దీన్ని చూసిన రెన్ షా నవ్వుతూ కనిపించాడు. ఈ క్రమంలో అవతలి ఎండ్ లో ఉన్న స్టీవ్ స్మిత్ ఏదో అనబోతే అంతే ఘాటుగా సమాధానమిచ్చాడు ఇషాంత్. తాను కూడా వెనక్కి తగ్గే ప్రసక్తి లేదన్న రీతిలోనే ఇషాంత్ తన కోపాన్ని ప్రదర్శించాడు. దాంతో అంపైర్ జోక్యం చేసుకుని భారత కెప్టెన్ విరాట్ కోహ్లితో మాట్లాడాడు. ఈ క్రమంలో ఇషాంత్ వేసిన ఆ తర్వాత రెండు బంతుల్ని ఎదుర్కొన్న రెన్ షా.. నాల్గో బంతికి ఎల్బీగా పెవిలియన్ చేరాడు. ఇలా ఇషాంత్ సక్సెస్ కాగా, రెన్ షా ఏదో తిట్టుకుంటూ పెవిలియన్ బాట పట్టాడు. ఆపై కాసేపటికి స్టీవ్ స్మిత్ ను జడేజా బౌల్డ్ చేయడంతో ఆసీస్ నాల్గో వికెట్ ను కోల్పోయింది.


 
Back to Top