సోషల్‌ మీడియాలో ఇరానీ మహిళల హల్‌చల్‌

Iranian Women Dressed As Men For Went To Football Match - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సరిగ్గా మూడు రోజుల క్రితం ముగిసిన పర్షియన్‌ గల్ఫ్‌ ప్రో లీగ్‌ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లో ఇరాన్‌ దేశానికి చెందిన జట్టు ‘పర్సేపాలిస్‌’ ఘన విజయం సాధించి నాలుగోసారి ఛాంపియన్‌ షిప్‌ సాధించినది. ఈ విషయాన్ని పక్కన పెడితే ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ అంటే ఇరాన్‌లో పురుషులకెంత ఇష్టమో, స్త్రీలకు అంతకంటే ఎక్కువ ఇష్టం. దాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు వారు ఎంతకైనా తెగిస్తారనడానికి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్న ఓ వీడియోను చూస్తే తెలుస్తోంది. 

1979లో వచ్చిన ఇస్లామిక్‌ విప్లవం నాటి నుంచి స్త్రీలను దేశంలో ఫుట్‌బాల్‌ క్రీడలకు అనుమతించరు. ఎలాగైన ఏప్రిల్‌ 27న ముగిసిన ఛాంపియన్‌ ట్రోపీ మ్యాచ్‌ను తిలకించాలనుకున్న ఐదుగురు స్త్రీలు పురుషుల దుస్తులు ధరించి, పెట్టుడు గడ్డాలు, మీసాలు పెట్టుకొని వచ్చి పురుషులతోపాటు ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ను తిలకించారు. తమను ఎవరైనా గుర్తుపడతారన్న భయంతో వారేమీ మౌనంగా కూర్చొని మ్యాచ్‌ను చూడలేదు. పురుషుల్లాగానే ఎంత అల్లరి చేయాలో అంత చేశారు. మ్యాచ్‌ అనంతరం వారిని పోలీసులు అరెస్ట్‌ చేశారని తెల్సింది. ఇదే విషయమై అక్కడి పోలీస్‌ అధికారులను అడిగితే అరెస్ట్‌ చేయలేదని, అదుపులోకి తీసుకొని అనంతరం వారిని వారి ఇళ్లకు పంపించి వేశామని చెప్పారు. 

వారం రోజుల క్రితమే స్టేడియంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన 35 మంది మహిళలను అరెస్ట్‌ చేశారు. ఆ నేపథ్యంలోనే ఈ సంఘటన జరగడం విశేషం. ఆడవాళ్లు మగవాళ్లలాగా దుస్తులు ధరించి ఫుట్‌బాల్‌ మ్యాచులు చూడడం ఇరాన్‌లో కొత్తేమి కాదు. గతంలో ఇలాంటి సంఘటనలు జరిగాయి. ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లకు మహిళలను అనుమతించాలని ఎప్పటి నుంచో ఇరాన్‌ మహిళలు డిమాండ్‌ చేస్తున్నారు. అనుమతించకపోవడం మహిళలను అవమానపర్చడమేనన్నది వారి వాదన. అయితే తాము మహిళలను అధికంగా గౌరవమిస్తామని, వారి మీదున్న గౌరవంతోనే కేకలు, అరుపులతో అల్లరిచిల్లరగా ఉండే స్టేడియంలోకి అనుమతించడం లేదని పాలకులు చెబుతుంటారు. గౌరవం సంగతి పక్కన పెడితే సోషల్‌ మీడియా విస్తరిస్తున్న నేటి సమయంలో మగవాళ్లతోపాటు మహిళలను సమానంగా చూడాలనే డిమాండ్‌ ఊపందుకుంటోంది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top